‘మన ఊరు - మనబడి’ పనులను వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-11-24T23:45:21+05:30 IST

జిల్లాలో మొదటి విడతలో చేపట్టిన పాఠశాలలో మన ఊరు - మన బడి పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్‌ దేవసేన అధికారులను ఆదేశించారు.

‘మన ఊరు - మనబడి’ పనులను వేగవంతం చేయాలి
సిద్దిపేట పట్టణంలోని ఇందిరానగర్‌ స్కూల్లో విద్యార్థులతో మాట్లాడుతున్న రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్‌ దేవసేన

రాష్ట్రంలోనే ఆదర్శ పాఠశాల ఇందిరానగర్‌ స్కూల్‌

కరోనాతో రెండేళ్లు విద్యార్థుల చదువుకు ఆటంకం

ప్రతీ సబ్జెక్టుపై పూర్తి అవగాహన వచ్చేలా ఉపాధ్యాయులు కృషి చేయాలి

రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్‌ దేవసేన

సిద్దిపేట అగ్రికల్చర్‌/సిద్దిపేట క్రైం/సిద్దిపేట రూరల్‌, నవంబరు 24 : జిల్లాలో మొదటి విడతలో చేపట్టిన పాఠశాలలో మన ఊరు - మన బడి పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్‌ దేవసేన అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లాలోని సిద్దిపేట రూరల్‌ మండలం రాఘవపూర్‌, సిద్దిపేట పట్టణంలోని ఇందిరానగర్‌ పాఠశాలను సందర్శించిన అనంతరం జిల్లా కలెక్టరేట్‌ సమావేశం మందిరంలో కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌తో కలిసి జిల్లా విద్యాశాఖ, ఎంఈవోలు, ఎంపీడీవోలు, ఆర్‌అండ్‌బీ అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవసేన మాట్లాడుతూ కరోనాతో రెండు సంవత్సరాలు విద్యార్థుల చదువుకు ఆటంకం కలిగిందని అన్నారు. విద్యార్థులలో నైపుణ్యాలకు పునాది పడేది ప్రాథమిక పాఠశాల స్థాయిలోనే అని, ప్రతీ సబ్జెక్టుపై వారికి పూర్తి అవగాహన వచ్చేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. ఉపాధ్యాయులు, విద్యార్థులకు జ్ఞానాన్ని అందించే వారధిగా పనిచేయాలని సూచించారు. విద్యార్థులకు అభ్యసన ఉపకరణాలు ఉపయోగించి విద్యా బోధన చేయాలన్నారు. ఇంగ్లీష్‌, తెలుగు చదవడం, రాయడంపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఆమె సూచించారు. వచ్చే సంవత్సరం నిర్వహించే నేషనల్‌ అకడమిక్‌ సర్వేలో రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచేలా నాణ్యమైన విద్యను అందించాలని ఆమె పేర్కొన్నారు. జిల్లాలో మన ఊరు - మన బడి పథకం అమలు చాలా బాగా జరిగేలా సమావేశాలు నిర్వహించిన కలెక్టర్‌ని ఆమె అభినందించారు. పనులను చేపట్టకముందు, అనంతరం ఇప్పుడు పాఠశాలలు ఎలా ఉన్నాయో ఫొటోలు తీసుకోవాలని ఆమె సూచించారు. రాఘవాపూర్‌ జడ్పీ హైస్కూల్‌, ప్రైమరీ స్కూళ్లలో కిచెన్‌ షెడ్లు, ప్రహరీ గోడ చాలా బాగా నిర్మించారని ఆమె అభినందించారు. రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలగా ఇందిరానగర్‌ స్కూల్‌ ఉందని, అనంతరం ఉపాధ్యాయులను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌, సమగ్ర శిక్ష అడిషనల్‌ స్టేట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

దుద్దెడ పాఠశాలను సందర్శించిన దేవసేన

కొండపాక : రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ దేవసేన గురువారం కొండపాక మండలం దుద్దెడ పాఠశాలను సందర్శించారు. మన ఊరు - మన బడి, తొలిమెట్టు కార్యక్రమాలను పరిశీలించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయం కావడంతో అక్కడ రెండు నిమిషాలు మాత్రమే ఉండి వెళ్లిపోయారు.

Updated Date - 2022-11-24T23:45:21+05:30 IST

Read more