మాదారం గ్రామానికి మళ్ల్లీ సంకటం

ABN , First Publish Date - 2022-07-19T05:26:12+05:30 IST

జిన్నారం మండలం మాదారం పంచాయతీ పరిధిలోని మూడు గ్రామాల శివారులో ఉన్న కంకర క్రషర్లతో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న ప్రజలకు మరో మూడు క్వారీల ఏర్పాటుకు అధికారులు జారీ చేసిన ప్రజాభిప్రాయ సేకరణ నోటిఫికేషన్‌ పిడుగులా మారింది.

మాదారం గ్రామానికి మళ్ల్లీ సంకటం
మంత్రికుంట సమీపంలో క్వారీ కోసం కేటాయించిన గుట్ట

కొత్తగా మూడు స్టోన్‌క్రషర్‌ క్వారీల ఏర్పాటు

22న ప్రజాభిప్రాయ సేకరణకు నోటీసులు

అఖిలపక్షం ఆధ్వర్యంలో వ్యతిరేక తీర్మానం 

జిన్నారం, జూలై 18: జిన్నారం మండలం మాదారం పంచాయతీ పరిధిలోని మూడు గ్రామాల శివారులో ఉన్న కంకర క్రషర్లతో  ఇప్పటికే  ఇబ్బందులు పడుతున్న ప్రజలకు మరో మూడు క్వారీల ఏర్పాటుకు అధికారులు జారీ చేసిన ప్రజాభిప్రాయ సేకరణ నోటిఫికేషన్‌ పిడుగులా మారింది. క్వారీల్లో నిత్యం జరిపే భారీ పేలుళ్లకు వాయు కాలుష్యంతో పాటు ఇళ్లకు పగుళ్లు, వ్యవసాయ బోర్ల మోటార్లు పూడుకుపోతూ సంకటంగా మారాయి. 2021 జనవరి 5న ప్రజాభిప్రాయ సేకరణకు వ్యతిరేకంగా గ్రామస్థులు 15 రోజుల పాటు ఉద్యమించడంతో  సద్దుమణిగిన  వివాదం ఈనెల 22న ప్రజాభిప్రాయ సేకరణ నోటీసుతో మళ్లీ ముందుకు వచ్చింది. దీంతో మరోమారు పోరాటానికి గ్రామస్థులు సిద్ధమవుతున్నారు.



మూడు గ్రామాల ప్రజల్లో వ్యతిరేకత

జిన్నారం మండలం మాదారం పంచాయతీ పరిధిలోని మంత్రికుంట గ్రామ శివారులో సర్వే నెంబర్‌ 210లో నూతన కంకర క్వారీల ఏర్పాటు కోసం ఈనెల 22న ప్రజాభిప్రాయ సేకరణకు పీసీబీ అధికారులు పబ్లిక్‌ నోటీస్‌ జారీ చేశారు. కాగా 5 ఎకరాల లోపు క్వారీలకు నేరుగా అనుమతులు దక్కితే.. ఇక్కడ ఏకంగా  150 ఎకరాల్లో క్వారీ ఏర్పాటు జరుగనుండటంతో ప్రజాభిప్రాయ సేకరణ తప్పని సరి అయింది. అధికారుల ప్రకటనతో మాదారం, మంత్రికుంట, కొర్లకుంట గ్రామాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది.  ఇటీవల గ్రామంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి, నూతన క్వారీల ఏర్పాటును విరమించుకోవాలంటూ ఈనెల 12న కలెక్టరేట్‌లో సైతం ఫిర్యాదు చేశారు. మాదారం గ్రామ సర్పంచ్‌ సరితాసురేందర్‌గౌడ్‌ మాట్లాడుతూ గ్రామాలకు సమీపంలో క్వారీలను ఏర్పాటు చేయడం సరికాదన్నారు. అఖిల పక్షం ఆధ్వర్యంలో గ్రామసభలో నూతన క్వారీల ఏర్పాటుకు వ్యతిరేకంగా తీర్మానం కూడా చేశాం కాబట్టి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టొద్దని కోరారు. నాలుగు నెలల క్రితం రాళ్లకత్వ పరిధిలోనూ క్రషర్‌ ఏర్పాటు కోసం ప్రజాభిప్రాయాన్ని సేకరించేందుకు వచ్చిన అధికారులను ప్రజలు, నాయకులు గ్రామ ప్రధాన రహదారిపైనే అడ్డుకున్న సంగతి తెలిసిందే. 

క్రషర్ల ఏర్పాటును నిలిపి వేయాలని వినతి

జిన్నారం, జూలై 18: మాధారం పరిధిలో నూతనంగా కంకరక్రషర్లు, క్వారీల ఏర్పాటును నిలిపి వేయాలని తహసీల్దార్‌కు గ్రామ యువజన నాయకులు వినతిపత్రం అందజేశారు. సోమవారం జిన్నారం తహసీల్దార్‌ దశరథను నియోజకవర్గ యువజన జేఏసీ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌గౌడ్‌, సుదర్శన్‌, రమణసింగ్‌, వెంకటేశ్‌ కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం ఉన్న స్టోన్‌ క్రషర్లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, కొత్తగా మరో మూడు స్టోన్‌ క్రషర్ల ఏర్పాటు కోసం అధికారులు జారీ చేసిన ప్రజాభిప్రాయ సేకరణ నోటీసులు, ప్రయత్నాన్ని నిలిపి వేయాలని తహసీల్దార్‌కు వారు విన్నవించారు. 


Updated Date - 2022-07-19T05:26:12+05:30 IST