సబ్‌కోర్టు ఏర్పాటులో నిమ్మకు నీరెత్తినట్లు

ABN , First Publish Date - 2022-12-02T00:18:32+05:30 IST

హుస్నాబాద్‌లో సబ్‌కోర్టును ఏర్పాటు చేయాలని న్యాయవాదులు 11 రోజులుగా రిలే దీక్షలు చేస్తున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మండిపడ్డారు. హుస్నాబాద్‌ పట్టణంలో సబ్‌కోర్టు ఏర్పాటు చేయాలని న్యాయవాదులు చేస్తున్న దీక్ష శిబిరాన్ని గురువారం ఈటల రాజేందర్‌ సందర్శించి మాట్లాడారు.

సబ్‌కోర్టు ఏర్పాటులో నిమ్మకు నీరెత్తినట్లు
హుస్నాబాద్‌లో న్యాయవాదుల దీక్షలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌

హుస్నాబాద్‌పై వివక్ష చూపుతున్నారు

అవసరం లేని ప్రాంతాలకు మంజూరు

ఎస్సీ, ఎస్టీ కేసులకు సంగారెడ్డికి సద్దికట్టుకుని వెళ్లాల్సిన దుస్థితి

మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ధ్వజం

సబ్‌కోర్టు ఏర్పాటు చేసి ప్రజల విశ్వాసాన్ని పొందాలి : ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

హుస్నాబాద్‌, డిసెంబరు 1 : హుస్నాబాద్‌లో సబ్‌కోర్టును ఏర్పాటు చేయాలని న్యాయవాదులు 11 రోజులుగా రిలే దీక్షలు చేస్తున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మండిపడ్డారు. హుస్నాబాద్‌ పట్టణంలో సబ్‌కోర్టు ఏర్పాటు చేయాలని న్యాయవాదులు చేస్తున్న దీక్ష శిబిరాన్ని గురువారం ఈటల రాజేందర్‌ సందర్శించి మాట్లాడారు. న్యాయవాదుల ఉద్యమానికి బీజేపీ సంపూర్ణ మద్దుతు తెలుపుతుందన్నారు. జిల్లాల పునర్విభజనలో అన్ని జిల్లాలకు దూరంగా విసిరివేయబడిన ప్రాంతంగా హుస్నాబాద్‌ మారిందన్నారు. సమస్యలు తీరుతాయని సంబురపడిన ఇక్కడి ప్రజలకు పెనం మీద నుంచి పొయ్యిల పడిన చందంగా మారిందన్నారు. కరీంనగర్‌ ఇక్కడికి దగ్గరగా ఉండేది. కోర్టు పనుల కోసం సులభంగా వెళ్లివచ్చేవారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ కేసులకు సంగారెడ్డికి సద్ది కట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి దాపురించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి ప్రజల బాధలపై కనీసం ప్రభుత్వం ఆలోచించడం లేదన్నారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అన్నట్లు అవసరం లేని గజ్వేల్‌, వేములావాడలో సబ్‌ కోర్టులు ఏర్పాటు చేస్తున్నారని ఈటల రాజేందర్‌ ఎద్దేవా చేశారు. అక్కడ ఏర్పాటు చేయడానికి వ్యతిరేకం కాదని, కాని ఇక్కడ భౌగోళిక పరిస్థితులు తెలుసుకోక బాధ్యతను మరిచిపోవడం సరికాదన్నారు. న్యాయవ్యవస్థలో హుస్నాబాద్‌పై వివక్ష చూపుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో హౌజ్‌ఫెడ్‌ మాజీ చైర్మన్‌ బొమ్మ శ్రీరాంచక్రవర్తి, బీజేపీ జిల్లా నాయకులు జన్నపురెడ్డి సురేందర్‌రెడ్డి, సెన్సార్‌ బోర్డు మెంబర్‌ లక్కిరెడ్డి తిరుమల, నాయకులు శంకర్‌, అశోక్‌, అక్కు శ్రీనివాస్‌, బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు మల్లేశం, సదానందం, శ్రీనివా్‌సరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సబ్‌కోర్టు అత్యవసరం : ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

హుస్నాబాద్‌లో సబ్‌ కోర్టు ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజల విశ్వాసాన్ని పొందాలని ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. ఆయన గురువారం రిలే దీక్షా శిబిరాన్ని సందర్శించి న్యాయవాదులకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ హుస్నాబాద్‌ నియోజకవర్గం మూడు జిల్లాలో విస్తరించి ఉందని, జిల్లాల పునర్విభజనలో ఎక్కువ ఇబ్బందులు పడుతున్నది ఇక్కడి ప్రజలేనన్నారు. ఈ ప్రాంతంలో సబ్‌కోర్టు అత్యవసరమన్నారు. ఈ విషయంపై ప్రభుత్వానికి నివేదిస్తానని, మంత్రి హరీశ్‌రావుతోనూ మాట్లాడుతానని ఆయన తెలిపారు. శాసనమండలి సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతానన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు కేడం లింగమూర్తి, సింగిల్‌ విండో చైర్మన్‌ బొలిశెట్టి శివయ్య, చిత్తారి రవీందర్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు మల్లేశం, సదానందం, సీనియర్‌ న్యాయవాదులు రత్నాకర్‌, రాజిరెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి, ఎల్లారెడ్డి, మురళీమోహన్‌, కాంగ్రెస్‌ నాయకులు యాదవరెడ్డి, చిత్తారి పద్మ, సరోజన తదితరులు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌, బీజేపీ తోడుదొంగలు

టీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలు తోడు దొంగలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన హుస్నాబాద్‌ పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ అసమర్థత వల్లే రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు అమలు కావడం లేదన్నారు. 2019 వరకు బీజేపీ, టీఆర్‌ఎ్‌స మిత్రపక్షంగా కొనసాగి సమస్యలు పరిష్కరించలేదన్నారు. మెడలు వంచి తెలంగాణ సాధించిన అనే కేసీఆర్‌ ప్రజల హక్కులు ఎందుకు కాపాడటం లేదని ప్రశ్నించారు. రైతుల రుణమాఫీ ఏక కాలంలో చేసిన పార్టీ కాంగ్రెస్సే అని గుర్తుచేశారు. ఈ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.35 వేల వరకే రుణమాఫీకి పరిమితమైందన్నారు. దళితబంధు అంటూ మూడు ఎకరాల భూ పంపిణీని మరిచారన్నారు. 24 గంటలు కరెంట్‌ అంటూ ఊదరగొడుతున్నారని, ఎక్కడొస్తుందో చూపించాలని ఆయన సవాలు విసిరారు. సరఫరా చేసినట్లయితే తాను క్షీరాభిషేకం చేస్తానన్నారు. ఈ రాష్ట్రాన్ని దొంగల నుంచి కాపాడుకోవాలని జీవన్‌రెడ్డి పిలుపునిచ్చారు.

Updated Date - 2022-12-02T00:18:33+05:30 IST