ఫైలేరియాను తరిమేద్దాం

ABN , First Publish Date - 2022-10-19T04:59:20+05:30 IST

బోధకాలు (ఫైౖలేరియా)ను నిర్మూలించేందుకు వైద్యశాఖ అధికారులు నడుం బిగించారు.

ఫైలేరియాను తరిమేద్దాం

రేపటి నుంచి మూడు రోజుల పాటు

ఇంటింటికీ డీఈసీ, ఆల్బెండజోల్‌ మాత్రల పంపిణీ

జిల్లా వ్యాప్తంగా బృందాలు, సిబ్బంది ఏర్పాటు

9,29,354 మందిని గుర్తించిన అధికారులు


 సిద్దిపేటటౌన్‌, అక్టోబరు 18: బోధకాలు (ఫైౖలేరియా)ను నిర్మూలించేందుకు  వైద్యశాఖ అధికారులు నడుం బిగించారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఈ నెల 20, 21, 22 మూడు రోజుల పాటు ఫైలేరియా నివారణ మాత్రలను అందించనున్నారు. అందుకు జిల్లాలోని 36 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఫరిధిలోని 9,29,354 మందిని గుర్తించిన అధికారులు నివారణ మాత్రలను అందించేందుకు కసరత్తు ప్రారంభించారు. మాత్రలను ఎవరెవరికి వేయాలి అనే దానిపై సిబ్బందితో జిల్లా వైద్యశాఖాధికారి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. జిల్లాలో ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు మాత్రలను పంపీణీ చేసి ఫైలేరియా రహిత జిల్లాగా మార్చేందుకు సర్వం సిద్ధం చేశారు. 


ఫైలేరియా వ్యాప్తి.. లక్షణాలు

 ఉచిరియారా బ్రాం క్రాఫ్ట్‌ అను సూక్ష్మ జీవి వలన ఫైలేరియా సంక్రమిస్తుంది. ఈ వ్యాధి క్యులేక్స్‌ దోమ కాటు ద్వారా ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తిస్తుంది. దోమ కుట్టిన సంవత్సరం తర్వాత కానీ వ్యాధి లక్షణాలు బయటకు కనిపించవు. దోమలు సాధారణంగా మన ఇంటి చుట్టూ ఉండే మరుగు నీటి గుంటల్లో, సెప్టిక్‌ ట్యాంకుల్లో (గుడ్లు పెట్టి) అభివృద్ధి చెందుతాయి. తరచూ వచ్చే కొద్దిపాటి జ్వరం, ఆయాసం, శోష నాళాలు పాడైపోయి, లింపు ప్రసరణ ఆగిపోయి, కాళ్లు చేతులు వాపు రావడం, చర్మంపై పుండ్లు, దురద పెట్టడం, వరిబీజం (బుడ్డ) మర్మవయవాలు పాడవడం, గజ్జల్లో, చంకల్లో బిళ్లలు కట్టడం వంటివి లక్షణాలుగా భావించవచ్చు. సాధారణంగా వ్యాధి కాళ్లకే వస్తుందని అనుకుంటారు, కానీ ఈ వ్యాధి కాళ్ల భాగానికే కాక, చేతులకు, పురుషాంగాలకు, హైడ్రోసిల్‌, రొమ్ము భాగానికి, స్త్రీ మర్మాంగాలకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.


పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

పరిసరాల చుట్టూ మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవడంతో పాటు, దోమతెరలు వాడి దోమల నుంచి రక్షణ పొందాలి. రాత్రి పూట రక్త పరీక్ష ద్వారా ఒక వ్యక్తి శరీరంలో బోధవ్యాధి క్రీములు ఉన్నది లేనిది తెలుసుకోవచ్చు. వ్యాధి లక్షణాలు లేని వారు కూడా రక్తపరీక్షలు చేసుకొని నిర్ధారణ పొందవచ్చు. ప్రతి సంవత్సరం ఏడాదిలో నిర్ణయించిన రోజుల్లో డీఈసీ, ఆల్బెండజోల్‌ మాత్రలు వేసుకోవాలి.  రెండు సంవత్సరాల లోపు పిల్లలు, గర్భిణీ స్త్రీలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు డీఈసీ మందులను వేసుకోరాదు. ఈ మాత్రలు ఆహారం తిన్న తర్వాత మాత్రమే వేసుకోవాలి. 


 జిల్లా వ్యాప్తంగా మాత్రల పంపిణీకి సర్వం సిద్ధం

సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఈ నెల 20 నుంచి 22 వరకు 9,29,354 మందికి డీఈసీ, ఆల్బెండజోల్‌ మాత్రలను వైద్య శాఖ అధికారులు అందించనున్నారు. అందుకు జిల్లా వ్యాప్తంగా 1869 టీంలు, 374మంది సూపర్‌వైజర్‌లు, 36 ఆర్‌ఆర్‌టీ టీంలు, 3,738 మంది మాత్రలను అందించేలా ఆ శాఖ అధికారులు సమాయత్తమయ్యారు.


వ్యాధి నిర్మూలన మనందరి బాధ్యత

- ముజామిల్‌ఖాన్‌, సిద్దిపేట అదనపు కలెక్టర్‌

ఫైలేరియా వ్యాధి నిర్మూలన మనందరి బాధ్యతగా వ్యవహరించాలి. ఫైలేరియా నివారణ మాత్రల పంపిణీలో భాగంగా ఈనెల 20, 21, 22 తేదీల్లో జిల్లాలోని ఆరోగ్య సిబ్బంది, ఆశాకార్యకర్తలు, గ్రామాల్లోని వివిధ శాఖల్లో ఉన్న క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో పనిచేయాలి. ఇంటింటికి వెళ్లి స్వయంగా లబ్ధిదారులకు మాత్రలు అందించాలి. వివిధ పాఠశాలల్లో, హాస్టళ్లలో, కాలేజీలలో ఉన్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం  తర్వాత వారికి సూచించిన విధంగా మాత్రలు వేయించాలి. 


వైద్య సిబ్బందికి సహకరించాలి

-డాక్టర్‌ కాశీనాథ్‌, జిల్లా వైద్యశాఖాధికారి

ఫైలేరియా నివారణ మాత్రలను అందించేందుకు వస్తున్న వైద్య సిబ్బందికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. వైద్య సిబ్బంది సూచించిన విధంగా మాత్రలు వేసుకుని ఫైలేరియా రహిత జిల్లా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరమందించాలి. సిబ్బంది ప్రతి ఇంటినీ క్షుణ్ణంగా తనిఖీ చేసి నివారణ మాత్రలను అందించాలి.




Updated Date - 2022-10-19T04:59:20+05:30 IST