మంజీర తీరాన ఘనంగా లక్షపుష్పార్చన

ABN , First Publish Date - 2022-03-23T05:40:59+05:30 IST

లక్ష పుష్పార్చనలో మహిళలు పెద్దఎత్తున పాల్గొనడం సంతోషకరమని ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి పేర్కొన్నారు.

మంజీర తీరాన ఘనంగా లక్షపుష్పార్చన
సహస్ర చండీయాగంలో భాగంగా లక్ష పుష్పార్చనలో పాల్గొన్న మహిళలు

భారీగా పాల్గొన్న మహిళలు... చండీయాగాన్ని దర్శించుకున్న సునీతారెడ్డి, దండెం విఠల్‌ 

 హవేళిఘణపూర్‌, మార్చి 22: లక్ష పుష్పార్చనలో మహిళలు పెద్దఎత్తున పాల్గొనడం సంతోషకరమని  ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని కూచన్‌పల్లి శివారులో మంజీరానది తీరాన ఉన్న ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి వ్యవసాయక్షేత్రంలో నిర్వహిస్తున్న సహస్ర చండీయాగం 4వ రోజైన మంగళవారం లక్ష పుష్పార్చనను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున పుష్పార్చనలో పాల్గొన్నారు. రంగంపేట పీఠాధిపతి మాధవానంద సరస్వతి అమ్మవారికి చేస్తున్న పుష్పార్చన గూర్చి చక్కగా వివరించారు. వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య అమ్మవారి నామస్మరణతో పరిసర ప్రాంతాలు మార్మోగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలందరూ చండీయాగంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. బుధవారం పూర్ణాహుతి కార్యక్రమంతో యాగం ముగుస్తుందని వివరించారు. రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి, ఆదిలాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండెం విఠల్‌ చండీయాగాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వారిని ఎమ్మెల్సీ శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో విద్యుత్‌బోర్డు సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి, జిల్లాఅధికారులు జానకిరాములు, రమేష్‌ కుమార్‌, వెంటేశ్వర్లు, సాయిరాం, సైదులు, హైదరాబాద్‌ సీపీ రవీందర్‌రెడ్డి, ఎంపీపీ శేరి నారాయణ రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, భక్తులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-03-23T05:40:59+05:30 IST