ఉద్యోగుల్లో కొవిడ్‌ గుబులు

ABN , First Publish Date - 2022-01-29T04:27:36+05:30 IST

కరోనా కేసులు రోజురోజుకూ విజృంభిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొన్నిరోజులుగా నిత్యం 400కుపైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులు ఎక్కువగా కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

ఉద్యోగుల్లో కొవిడ్‌ గుబులు

మెదక్‌ అర్బన్‌, జనవరి 28 : కరోనా కేసులు రోజురోజుకూ విజృంభిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొన్నిరోజులుగా నిత్యం 400కుపైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులు ఎక్కువగా కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వైద్య ఆరోగ్య శాఖలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడంతోపాటు ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య కూడా అదే స్ధాయిలో పెరుగుతోంది. ప్రజల నిర్లక్ష్యం కారణంగా ఆసుపత్రిలోని డాక్టర్లు, ఇతర సిబ్బందికి కూడా వైరస్‌ సోకుతుంది. మెదక్‌ జిల్లాలో వైద్యులు, సర్జన్లు, నర్సింగ్‌, పారామెడికల్‌, ఇతర వైద్య సిబ్బందితో మొత్తం 100 మందికిపైగా కరోనా బారిన పడ్డగా.. వివిఽధ శాఖల్లో దాదాపు 60 మంది కరోనా బారిన పడినట్లు సమాచారం. దీంతో జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు, సిబ్బంది భయంభయంగా విధులకు హాజరవుతున్నారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో అధికారులు, సిబ్బంది ఒక్కొక్కరుగా కరోనా బారిన పడుతున్నారు. ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, అటెండర్లకు కరోనా సోకింది. పోలీసు శాఖలోని అధికారులతో పాటు సిబ్బంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. 


వారం రోజులకే మళ్లీ విధుల్లోకి

వైరస్‌ సోకి పాజిటివ్‌ వచ్చిన వారు వాస్తవానికి 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాలి. కానీ చాలా మంది వారం రోజులకే మళ్లీ విధుల్లో చేరుతున్నారు. ఆసుపత్రిలో అన్ని విభాగాల్లో పాజిటివ్‌ వచ్చిన వారు ఉన్నారు. పనిభారం పెరుగుతుండడంతో వారం రోజులకే క్వారంటైన్‌ పూర్తి చేసుకొని నెగటివ్‌ వచ్చిన తర్వాత మళ్లీ విధుల్లో చేరుతున్నారు. 


సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో 244 కరోనా కేసులు

మెదక్‌ అర్బన్‌/సంగారెడ్డి అర్బన్‌ జనవరి28: మెదక్‌ జిల్లాలో శుక్రవారం 1509 మందికి నిర్వహించిన ర్యాపిడ్‌ టెస్టుల్లో 124 కరోనా కేసులు వెలుగుచూశాయి. రామాయంపేటలో 27, తూప్రాన్‌లో 23, మెదక్‌లో 22, నర్సాపూర్‌లో 9, డీధర్మారంలో 7, వెల్దుర్తిలో 6, చేగుంటలో 5, రెడ్డిపల్లిలో 4, శివ్వంపేటలో 4, కౌడిపల్లిలో 4, కొల్చారంలో 4, పాపన్నపేట లో 4, టేక్మాల్‌లో 2, చిన్నశంకరంపేటలో 1, సర్ధనలో 1, నార్సింగిలో 1 చొప్పున నమోదయ్యాయి. ఇక సంగారెడ్డి జిల్లాలో శుక్రవారం 120 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. జిల్లాలోని పటాన్‌చెరు-40, సంగారెడ్డి-30, నారాయణఖేడ్‌-25, జహీరాబాద్‌-15, బొల్లారం-2, కంది-2, కొండాపూర్‌-2, మొగుడంపల్లి-2, ఆర్సీపురంలో ఇద్దరికి కరోనా సోకింది. 1401 మందికి ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులు చేశారు. 

అప్రమత్తంగా ఉండాలి 

కొవిడ్‌ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఫ్రంట్‌లైన్‌లో ఉండి పనిచేస్తున్న ప్రభుత్వోద్యోగులు, సిబ్బంది కరోనా జాగ్రత్తలు పాటి స్తూ అప్రమత్తంగా ఉండాలి. ప్రజలందరూ భౌతిక దూరం పాటిస్తూ నివారణకు సహకరించాలి.

-  డాక్టర్‌ వెంకటేశ్వర్‌రావు, డీఎంహెచ్‌వో మెదక్‌

Read more