సరికొత్త అందాలతో ఆకట్టుకుంటున్న కోమటి చెరువు

ABN , First Publish Date - 2022-12-02T00:14:36+05:30 IST

కొత్త అందాలతో కోమటి చెరువు అందర్నీ ఆకట్టుకుంటున్నది. రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక కృషితో కోమటి చెరువు పరిసరాలు సరికొత్త అందాలను సంతరించుకుంటున్నాయి.

సరికొత్త అందాలతో ఆకట్టుకుంటున్న కోమటి చెరువు
కోమటిచెరువు అందాలు

సిద్దిపేట కల్చరల్‌, డిసెంబరు 1: కొత్త అందాలతో కోమటి చెరువు అందర్నీ ఆకట్టుకుంటున్నది. రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక కృషితో కోమటి చెరువు పరిసరాలు సరికొత్త అందాలను సంతరించుకుంటున్నాయి. రోజు రోజుకూ పర్యాటకుల తాకిడి పెరుగుతున్నది. ఇక్కడ ఏర్పాటు చేసిన నెక్లెస్‌ రోడ్డు, రాక్‌ గార్డెన్‌, నైట్‌ గార్డెన్‌, గేమ్‌ జోన్‌, బోటింగ్‌ , లేజర్‌ షో, అడ్వెంచర్‌ పార్క్‌, చిల్డ్రన్‌ పార్క్‌, కేబుల్‌ బ్రిడ్జి మొదలైనవి అందరినీ ఆకట్టుకుంటున్నాయి. పర్యాటకులు సిద్దిపేట నుంచి మాత్రమే కాకుండా హైదరాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి కోమటి చెరువు అందాలను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సండే వచ్చిందంటే చాలు కోమటి చెరువు వద్దకు వేల సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు.

ప్రత్యేక ఆకర్షణగా మ్యూజికల్‌ ఫౌంటెయిన్‌

దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఈ విధంగా కోమటి చెరువు మధ్యలో మ్యూజికల్‌ ఫౌంటెయిన్‌ ను ఏర్పాటు చేశారు. మ్యూజిక్‌కు అనుగుణంగా వాటర్‌ ఫ్లోయింగ్‌ ఉంటుంది. దేశంలో మొదటగా గుజరాత్‌ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. తర్వాత సిద్దిపేటలోని ఏర్పాటు చేశారు. లక్నవరం చెరువు మాదిరిగా కోమటి చెరువు మధ్యలో సస్పెన్షన్‌ బ్రిడ్జి ఏర్పాటు చేశారు. కోమటి చెరువు ఒక చివర నుంచి ఇంకొక చివరకు దీని ద్వారా చేరుకోవచ్చు.

ఆకట్టుకుంటున్న నైట్‌ గార్డెన్‌

వివిధ ఎల్‌ఈడీ లైట్లతో జంతువుల బొమ్మలను ఏర్పాటు చేశారు. ఇవి ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మ్యూజిక్‌ ఆధారంగా లైట్లు వచ్చే విధంగా డ్రమ్స్‌ను ఏర్పాటు చేశారు. వివిధ జంతువుల అరుపులతో కూడిన ఏఆర్‌ స్ర్కీన్‌ను ఏర్పాటు చేశారు. రెండు కిలోమీటర్ల వరకు నెక్లెస్‌ రోడ్‌లో వివిధ లైట్లతో వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేశారు. సింథటిక్‌ ట్రాక్‌ ఏర్పాటు చేశారు. మధ్యలో చిల్డ్రన్‌ గేమ్‌లను ఏర్పాటు చేశారు. రెండు కిలోమీటర్ల వరకు పర్యాటకులు మ్యూజిక్‌ వినే విధంగా బాక్సులను ఏర్పాటు చేశారు.

చిన్నారులను ఆకర్షిస్తున్న గేమ్‌ జోన్‌

చిన్నారులు వివిధ ఆటలు ఆడుకునేందుకు కంప్యూటర్‌తో కూడిన ఆర్కిడ్‌ గేమ్‌ జోన్‌ ఏర్పాటు చేశారు. ఎలక్ట్రిక్‌ కార్‌ రేసింగ్‌, బైక్‌ రేసింగ్‌, హ్యామర్‌ స్ట్రెంత్‌, రెయిన్‌బో షూటింగ్‌, వి ఆర్‌ గేమ్‌ తదితర గేమ్‌లను ఏర్పాటు చేశారు. చిన్నారులు వీటితో ఆడుకుంటూ ఉల్లాసంగా గడుపుతున్నారు.

స్పీడ్‌ బోటింగ్‌... స్కై సైక్లింగ్‌

కోమటి చెరువులో ఏర్పాటు చేసిన బోటింగ్‌ సౌకర్యంతో కోమటి చెరువు అందాలను పర్యాటకులు ఆస్వాదిస్తున్నారు. లగ్జరీ బోట్‌, స్పీడ్‌ బోట్‌, వాటర్‌ స్కూటర్‌, మెగాజైన్‌ బోట్లను ఏర్పాటు చేశారు. వీటిలో ప్రయాణిస్తూ పర్యాటకులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అడ్వెంచర్‌ పార్కులో ఏర్పాటు చేసిన స్కై సైక్లింగ్‌ పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నది. కొలంబస్‌ రంగులరత్నం అడల్ట్‌ గేమ్‌లు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి.

Updated Date - 2022-12-02T00:17:01+05:30 IST