తెలంగాణ ప్రజలు హర్షించదగ్గ ఘట్టం ఇది: సీఎం కేసీఆర్

ABN , First Publish Date - 2022-02-23T21:15:45+05:30 IST

మల్లన్నసాగర్‌ ప్రాజెక్ట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం మధ్యాహ్నం ప్రారంభించారు.

తెలంగాణ ప్రజలు హర్షించదగ్గ ఘట్టం ఇది: సీఎం కేసీఆర్

సిద్ధిపేట: కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయలాంటి కొమురవెల్లి మల్లన్నసాగర్‌ ప్రాజెక్ట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం మధ్యాహ్నం ప్రారంభించారు. 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టును సీఎం జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ బహిరంగ సభలో మాట్లాడుతూ మల్లన్నసాగర్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజలు హర్షించదగ్గ ఘట్టం ఇదని అన్నారు. ప్రాజెక్టులను అడ్డుకోవాలని చాలా మంది ప్రయత్నించారని, ఆ కుట్రలను చేధించామన్నారు. ఇంజనీర్లు కూడా భయపడకుండా పనులు చేశారని.. ఈ సందర్భంగా వారిని అభినందిస్తున్నానని కేసీఆర్ అన్నారు.


ఇది తెలంగాణ జల హృదయ సాగర్‌ అని, మల్లన్నసాగర్‌తో మంచినీటి సమస్య పరిష్కారం అవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. మత్స్య, పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రాజెక్టులపై కనీస పరిజ్ఞానం లేని పార్టీలు విమరిస్తున్నాయని మండిపడ్డారు. ఖమ్మంలో సీతారామ ప్రాజెక్ట్‌ త్వరలోనే పూర్తి చేస్తామని సీఎం స్పష్టం చేశారు.


అన్ని రంగాల్లో తెలంగాణ దూసుకెళ్తోందని సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. 24 గంటల విద్యుత్‌ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, రాష్ట్రం అభివృద్ధిని చూసి మహారాష్ట్ర సీఎం ఆశ్చర్యపోయారన్నారు. దేశంలో దుర్మార్గమైన పనులు జరుగుతున్నాయని పరోక్షంగా మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కర్నాటకలో మతకల్లోలాలకు పాల్పడుతున్నారని సీఎం కేసీఆర్‌ ఆరోపించారు.

Updated Date - 2022-02-23T21:15:45+05:30 IST