కాలచక్ర క్రతువు

ABN , First Publish Date - 2022-11-16T00:22:34+05:30 IST

ఆధ్యాత్మిక సంబురానికి సిద్దిపేట పట్టణం ముస్తాబవుతున్నది. శ్రీకృష్ణ కాలచక్రం పేరిట కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామిజీ పర్యవేక్షణలో విశ్వశాంతి మహాయాగ మహోత్సవ ఏర్పాట్లు తుదిదశకు చేరాయి.

కాలచక్ర క్రతువు
అయుత చండీ, అతిరుద్ర యాగాల కోసం సిద్దిపేటలోని వేములవాడ రోడ్డు కమాన్‌ ఎదురుగా సిద్ధమవుతున్న యాగశాలలు

ఈనెల 19 నుంచి విశ్వశాంతి మహాయాగ మహోత్సవం

14 రోజుల పాటు అయుతచండీ, అతిరుద్ర యాగాలు

800 మంది రుత్విక్కులు, వేదపండితులతో హోమాలు

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, నవంబరు 15: ఆధ్యాత్మిక సంబురానికి సిద్దిపేట పట్టణం ముస్తాబవుతున్నది. శ్రీకృష్ణ కాలచక్రం పేరిట కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామిజీ పర్యవేక్షణలో విశ్వశాంతి మహాయాగ మహోత్సవ ఏర్పాట్లు తుదిదశకు చేరాయి. అయుత చండీ, అతిరుద్ర యాగాలు, సీతారామ సామ్రాజ్య పట్టాభిషేక వేడుకలకు యాగస్థలం సన్నద్ధమవుతున్నది. ఈనెల 19 నుంచి 14 రోజుల పాటు ఆధ్యాత్మిక పరిమళాలు, వేదపండితుల మంత్రోచ్చరణాలతో సిద్దిపేట ప్రాంతం పరిఢవిల్లనున్నది. 19న శనివారం తెల్లవారుజామున గణపతిపూజతో ప్రారంభమయ్యే ఈ మహావేడుకలు 14 రోజుల పాటు కొనసాగనున్నాయి. డిసెంబరు 2న మహాపూర్ణాహుతి కార్యక్రమంతో ఈ ఉత్సవం ముగుస్తుంది. 14,641 హవనాలతో అతిరుద్ర యాగం చేపట్టనున్నారు. వీటితోపాటు నాటి సీతారాముల పట్టాభిషేకాన్ని కళ్లకు కట్టేలా సీతారామ సామ్రాజ్య పట్టాభిషేక వేడుకకు అద్భుతమైన వేదికలను రూపొందిస్తున్నారు.

కాలచక్ర యాగ విశిష్టతలు ఇవే

2013లో సిద్దిపేటలో అతిరుద్ర యాగం జరగ్గా ప్రస్తుతం అయుత చండీ యాగంతోపాటు అతిరుద్ర యాగం నిర్వహించనున్నారు. 6 యాగశాలలను ఏర్పాటు చేసి 256 హోమగుండాలను నిర్మించారు. 800 మంది రుత్విక్కులు, వేదపండితులు మంత్రోచ్ఛరణలతో యాగాలను నిర్వహిస్తారు. నిత్యం 10వేల మందికి పైగా భక్తులు మూడు పూటల అల్పాహారం, భోజనం చేయడానికి ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజు హోమగుండాల వద్ద 650 మంది జంటలతో పూజల నిర్వహణ. 30వేలకు పైగా తాటికమ్మలతో యాగశాలల నిర్మాణం. హోమగుండాల కోసం 30 లారీలతో సమిధల దిగుమతి. హోమాల నిర్వహణకు 36వేల కిలోల ఆవునెయ్యి. ప్రతీరోజు 1100 లీటర్ల ఆవుపాలతో అభిషేకాలు. ప్రత్యామ్నాయ దినాల్లో లక్ష, కోటి బిల్వార్చన, కుంకుమార్చన. నిత్యం ఉదయం 6 నుంచి 7 వరకు ధ్యానం. 11 గంటలకు భాగవతంపై ప్రవచనాలు. పూర్తి ఉచితంగా భక్తులకు యాగ సందర్శన, హోమాల వద్ద పూజలు, భోజనం. స్వచ్ఛంద విరాళాల స్వీకరణ. ప్రతీరోజు 10వేల మందికి పైగానే భక్తులు సందర్శించే అవకాశం ఉన్నది.

ప్రకృతిని ప్రసన్నం చేసుకునేలా

- కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామి

హోమాలు, యాగాలు, వేదమంత్రాలు ఎంతో శక్తివంతమైనవి. హోమగుండంలో వేసే ఒక చెంచాడు నెయ్యితో కొన్ని కిలో కేలరీల స్వచ్ఛమైన ఆక్సిజన్‌ పుట్టుకొస్తుంది. అలాంటి 36 వేల కిలోల ఆవునెయ్యిని ఈ క్రతువుకు వినియోగిస్తున్నారు. ప్రజల ఆరోగ్యానికి ప్రకృతి సహకరించేలా, సర్వదోషాల నివారణకు, విశ్వశాంతి కోసం ఈ కాలచక్రాన్ని 2001లో చేపట్టడం జరిగింది. ఈ 78వ మహోత్సవానికి మంత్రి హరీశ్‌రావుతోపాటు స్థానికుల సహకారం మెండుగా ఉండడం సంతోషంగా ఉంది.

Updated Date - 2022-11-16T00:22:34+05:30 IST

Read more