రాహుల్‌ యాత్రతో కాంగ్రెస్‌లో జోష్‌

ABN , First Publish Date - 2022-11-08T00:19:50+05:30 IST

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్ర సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో కాంగ్రెస్‌ క్యాడర్‌లో నూతనోత్సాహం నింపింది.

రాహుల్‌ యాత్రతో కాంగ్రెస్‌లో జోష్‌

సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో పాదయాత్ర, కార్నర్‌ మీటింగ్‌లు సక్సెస్‌

ఎన్నికలను తలపించిన కోలాహలం

భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు

రాహుల్‌ ప్రసంగాలను ఆసక్తిగా విన్న జనాలు

ఫ్లెక్సీలతోనే సరిపెట్టిన నియోజకవర్గ స్థాయి నేతలు

కార్యకర్తలకు వాహనాలూ సమకూర్చని వైనం

మండల నాయకులపైనే భారం

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, నవంబరు 7 : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్ర సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో కాంగ్రెస్‌ క్యాడర్‌లో నూతనోత్సాహం నింపింది. రెండు జిల్లాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క సంగారెడ్డి నియోజకవర్గంలోనే కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉన్నది. నియోజకవర్గస్థాయి నాయకులకు క్యాడర్‌ను కాపాడుకోవడమే కష్టంగా మారింది. ఈ నాయకుల్లో కొందరు గతంలో శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన వారుండగా మరికొందరు రానున్న ఎన్నికల్లో టికెట్‌ ఆశిస్తున్నారు. అయినా నియోజకవర్గంల్లో పార్టీని బలోపేతం చేయడానికి ఉత్సాహంగా పనిచేయడం లేదనే విమర్శలున్నాయి. సంగారెడ్డి నియోజకవర్గంలోనూ రెండో శ్రేణి కాంగ్రెస్‌ నాయకులు పార్టీని వీడి టీఆర్‌ఎ్‌సలో చేరినా ఆపలేకపోవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవున్నది.

బూస్టర్‌ డోస్‌..

ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో ఉన్న పార్టీకి రాహుల్‌గాంధీ జోడోయాత్ర బూస్టర్‌ డోస్‌ అవుతుందన్న అభిప్రాయాన్ని పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. జిల్లాల్లో రాహుల్‌గాంధీ పాదయాత్ర, కార్నర్‌ మీటింగ్‌లు విజయవంతమవడం పార్టీ భవితవ్యంపై వారిలో ఆశలు చిగురింపజేస్తున్నాయి. పాదయాత్రలు, కార్నర్‌ మీటింగ్‌లకు నియోజకవర్గస్థాయి నాయకులు జన సమీకరణ చేయలేదని పార్టీ వర్గాలంటున్నాయి. నియోజకవర్గాలలో పార్టీ సమావేశాలు నిర్వహించడం తప్పితే వాహనాలు సమకూర్చుకునేందుకు నాయకులు డబ్బు ఇవ్వలేదని ఆ వర్గాలు తెలిపాయి. అయినా మండలస్థాయి నాయకులు చొరవ తీసుకుని వాహనాలు ఏర్పాటు చేయడంతో పాదయాత్రలు, కార్నర్‌ మీటింగ్‌లకు వచ్చామని పేర్కొన్నారు.

ఎన్నికల ప్రచారాన్ని తలపించిన కోలాహలం

రాహుల్‌గాంధీ యాత్ర జిల్లాల్లో ఎన్నికల వాతావరణాన్ని తలపింపజేసింది. ఈ నెల 2న సాయంత్రం బీహెచ్‌ఈఎల్‌ లింగంపల్లి క్రాస్‌రోడ్డు వద్ద సంగారెడ్డి జిల్లాలో అడుగుపెట్టిన రాహుల్‌గాంధీ పటాన్‌చెరు, సంగారెడ్డి, అందోలు, నారాయణఖేడ్‌ నియోజకవర్గాల మీదుగా 6వ తేదీ సాయంత్రం కామారెడ్డి జిల్లాకు వెళ్లారు. జిల్లాలో యాత్ర మొదలైనప్పటి నుంచి ఆయా నియోజకవర్గాల్లో పాదయాత్ర, కార్నర్‌ మీటింగుల్లో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాహుల్‌గాంధీ ప్రసంగాన్ని ఓపికగా ఉన్నారు. రాహుల్‌ ప్రసంగం సాయంత్రం 6:30 వరకు ముగిసినా 8 గంటల వరకు కార్యకర్తలు, అభిమానులు సభా ప్రాంగణాల్లోనే ఉన్నారు. ప్రజల నుంచి వస్తున్న ఈ స్పందన భవిష్యత్‌పై తమకు నమ్మకాన్ని కల్పిస్తున్నదని పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. రాహుల్‌ యాత్ర జరగని జహీరాబాద్‌, నర్సాపూర్‌ నియోజకవర్గాల కార్యకర్తలు అందోలు నియోజకవర్గం పుల్‌కల్‌ మండలం శివంపేట వద్ద జరిగిన కార్నర్‌ మీటింగ్‌కు తరలివచ్చారు. దీంతో ఇక్కడ హైవే వాహనాలు, కార్యకర్తలతో కిటకిటలాడింది.

ఖర్చుకు నేతల వెనకంజ

అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది ఉండడంతో రాహుల్‌గాంధీ యాత్ర కోసం ఖర్చు చేసేందుకు నియోజకవర్గస్థాయి నేతలు ముందుకురాలేదని పార్టీ శ్రేణులు విమర్శించారు. రాహుల్‌గాంధీ దృష్టిలో పడేందుకు ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేయడం మినహా కార్యకర్తలు, ప్రజల తరలింపునకు అవసరమైన వాహనాలకు డబ్బులను నేతలు ఇవ్వలేదని పేర్కొన్నారు.. రానున్న ఎన్నికలలో పార్టీ టిక్కెట్టు ఆశిస్తున్న నేతలందరూ ఎన్నికల వరకు కాంగ్రె్‌సలో ఉంటామా? లేదా? అన్న సందేహంతో ఉన్నట్టు వారు తెలిపారు. అందుకే తొందరపడి కార్యకర్తలు, జనసమీకరణకు డబ్బు ఖర్చు చేయడం దండుగ అన్న విధంగా నేతలు వ్యవహరించారని పార్టీ వర్గాలు వివరించాయి. ఏమైనా రాహుల్‌గాంధీ జోడో యాత్రతో వచ్చిన జోష్‌ను ఏడాది పాటు కొనసాగించే విషయంలోనూ నేతలు తర్జనభర్జన పడుతున్నట్టు తెలుస్తున్నది.

Updated Date - 2022-11-08T00:21:30+05:30 IST

Read more