చరిత్రకు సజీవ సాక్ష్యం జోగిపేట పోస్టాఫీసు

ABN , First Publish Date - 2022-09-10T05:50:30+05:30 IST

జోగిపేట పట్టణ అభివృద్ధికి సాక్ష్యంగా నిలిచిన పోస్టల్‌ భవనం కనుమరుగుకానున్నది. 1934-35 మధ్య కాలంలో ఈ భవనాన్ని నిర్మించగా, దశాబ్దం క్రితం మరమ్మతులు చేశారు. రహదారి విస్తరణలో భాగంగా ప్రస్తుతం భవనం కూల్చివేతకు రంగం సిద్ధమైంది. జోగిపేట పట్టణంలో నిజాం కాలంలో 87 ఏళ్ల క్రితం జాతీయ రహదారి పక్కనే 650 గజాల విశాల ఆవరణలో పోస్టాఫీసు భవనాన్ని నిర్మించారు. ఇందులో చక్కటి భవనాన్ని నిర్మించారు.

చరిత్రకు సజీవ సాక్ష్యం జోగిపేట పోస్టాఫీసు
జోగిపేటలోని పోస్టాఫీసు భవనం

రోడ్డు విస్తరణ కోసం త్వరలోనే కూల్చివేత 

కనుమరుగు కానున్న 87 ఏళ్ల పురాతన కట్టడం


జోగిపేట, సెప్టెంబరు 9: జోగిపేట పట్టణ అభివృద్ధికి సాక్ష్యంగా నిలిచిన పోస్టల్‌ భవనం కనుమరుగుకానున్నది. 1934-35 మధ్య కాలంలో ఈ భవనాన్ని నిర్మించగా, దశాబ్దం క్రితం మరమ్మతులు చేశారు. రహదారి విస్తరణలో భాగంగా ప్రస్తుతం భవనం కూల్చివేతకు రంగం సిద్ధమైంది. జోగిపేట పట్టణంలో నిజాం కాలంలో 87 ఏళ్ల క్రితం జాతీయ రహదారి పక్కనే 650 గజాల విశాల ఆవరణలో పోస్టాఫీసు భవనాన్ని నిర్మించారు. ఇందులో చక్కటి భవనాన్ని నిర్మించారు. ముందువైపు పోస్టల్‌ సేవల కోసం కారిడార్‌, వెనక సబ్‌ పోస్ట్‌మాస్టర్‌ ఛాంబర్‌ నిర్మించారు. మరోపక్క ఉత్తరాల సెగ్రిగేషన్‌, బట్వాడా కోసం సువిశాల హాల్‌ను నిర్మించారు. మిగిలిన స్థలాన్ని పార్కింగ్‌, చెట్ల పెంపకానికి కేటాయించారు. ఈ భవనం శిథిలావస్థకు చేరుకోగా మరమ్మతులు చేయించాలని 2010లో మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గంగా జోగినాథ్‌ పోస్టల్‌ మంత్రిత్వశాఖకు లేఖ రాశారు. స్పందించిన అప్పటి కేంద్ర చీఫ్‌ పోస్ట్‌ మాస్టర్‌ జనరల్‌ కరుణా పిళ్లై రూ.5 లక్షలను విడుదల చేశారు. ఈ నిధులతో భవనానికి పూర్తిస్థాయిలో మరమ్మతులు  చేశారు. నూతన ఫర్నిచర్‌ను సమకూర్చారు. వినియోగదారులకు పలు సదుపాయాలు కల్పించారు. విదేశీ కరెన్సీని రూపాయలలోకి మార్చుకునే మనీ ట్రాన్స్‌ఫర్‌, పోస్టల్‌ బీమా తదితర సేవలను ప్రారంభించారు.


రహదారి విస్తరణ కోసం కూల్చివేత

జోగిపేట పట్టణం మధ్యలో నుంచి వెళ్తున్న ప్రధాన రహదారి విస్తరణ కోసం పక్కనే ఉన్న పోస్టాఫీస్‌ భవనాన్ని కూల్చివేయాల్సి వస్తున్నది. రోడ్డు మధ్యలో నుంచి ఇరువైపులా 45 ఫీట్ల మేర రోడ్డును విస్తరించనున్నారు. ఇందుకోసం భవనాన్ని తొలగించాల్సి ఉంటుందని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ, అందోలు-జోగిపేట మున్సిపల్‌ కమిషనర్‌ వేర్వేరుగా పోస్టల్‌ అధికారులకు మూడు నెలల క్రితం నోటీసులు అందజేశారు. రహదారి విస్తరణ, సైడ్‌డ్రెయిన్‌ కోసం ఇప్పటికే మార్కింగ్‌ కూడా చేశారు. ఈ మార్కింగ్‌ ప్రకారం పోస్టాఫీసును10 గజాలు తొలగించాల్సి వస్తున్నది. రోడ్డు పక్కనే 131 ఫీట్ల వెడల్పు, 55 ఫీట్ల పొడవుతో ఉన్న భవనంలో 131 ఫీట్ల వెడల్పు, 23 ఫీట్ల పొడవు భవనాన్ని తొలగించాల్సి ఉంటుంది. దీంతో దాదాపుగా భవనం పూర్తిగా కనుమరుగవుతుంది. రహదారి విస్తరణలో పోగా ఇంకా 300 గజాల స్థలం మిగిలే అవకాశమున్నది. ఇప్పటికే నోటీసులు ఇచ్చినా ప్రత్యామ్నాయ భవనం దొరక్క కూల్చివేత పనులు ప్రాంరభం కాలేదు. కొత్త భవనం నిర్మించే వరకు పోస్టాపీసును ఎన్టీఆర్‌ స్పోర్ట్స్‌ స్టేడియంలో ఖాళీగా ఉన్న భవనంలోకి మారిస్తే సౌకర్యంగా ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు. కానీ సాధ్యమైనంత త్వరగా కొత్త భవనం నిర్మించకపోతే పోస్టాఫీసు స్థలం కబ్జాల బారినపడే ప్రమాదమున్నది. పోస్టాఫీసు తరలింపుపై జిల్లా అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోస్టాఫీసెస్‌ స్పందిస్తూ త్వరలోనే తాత్కాలిక భవనంలోకి మార్చుతామని తెలిపారు. 

Read more