జయ జయహే

ABN , First Publish Date - 2022-09-17T05:49:13+05:30 IST

వజ్రోత్సవ సంబురాలు అంబరాన్నంటాయి. నియోజకవర్గ కేంద్రాలు జనసంద్రంగా మారాయి. ప్రధాన వీధుల్లో మువ్వెన్నెల పతాకాలు రెపరెపలాడాయి. జైతెలంగాణ నినాదాలతో హోరెత్తాయి. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్‌, హుస్నాబాద్‌ నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలతో శుక్రవారం తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలను ప్రారంభించారు.

జయ జయహే
సిద్దిపేట పట్టణంలో జాతీయ జెండాలో ర్యాలీలో పాల్గొన్న జనం

సిద్దిపేట జిల్లాలో అంబరాన్నంటిన తెలంగాణ వజ్రోత్సవ సంబురాలు

నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు

రెపరెపలాడిన మువ్వన్నెల జెండాలు


సిద్దిపేట టౌన్‌/హుస్నాబాద్‌/గజ్వేల్‌, సెప్టెంబరు 16 : వజ్రోత్సవ సంబురాలు అంబరాన్నంటాయి. నియోజకవర్గ కేంద్రాలు జనసంద్రంగా మారాయి. ప్రధాన వీధుల్లో మువ్వెన్నెల పతాకాలు రెపరెపలాడాయి. జైతెలంగాణ నినాదాలతో హోరెత్తాయి. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్‌, హుస్నాబాద్‌ నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలతో శుక్రవారం తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలను ప్రారంభించారు. జిల్లా కేంద్రంలో పాత బస్టాండ్‌ నుంచి ప్రభుత్వ ఉన్నత పాఠశాల వరక వేలాదిమందితో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఎటు చూసినా జాతీయ జెండాలు రెపరెపలాడాయి. మంత్రి హరీశ్‌రావు సైతం మువ్వన్నెల జెండాను చేతబూని ర్యాలీలో పాల్గొన్నారు. దుబ్బాకలోనూ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. స్థానిక బస్‌డిపో నుంచి తెలంగాణ తల్లి విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం చాకలి అయిలమ్మ ప్రాంగణంలో నిర్వహించిన బహిరంగ సభలో వారు పాల్గొన్నారు. గజ్వేల్‌ పట్టణంలో అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌, గడ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి పర్యవేక్షణలో యూనియన్‌ బ్యాంక్‌ నుంచి వ్యవసాయ మార్కెట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు, ఆయా పార్టీ నాయకులు భారీగా తరలివచ్చారు. హుస్నాబాద్‌ పట్టణంలో ఎమ్మెల్యే సతీ్‌షకుమార్‌ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని మార్కెట్‌ యార్డు నుంచి అంబేద్కర్‌ చౌరస్తా, మల్లెచెట్టు చౌరస్తా, అనభేరి చౌరస్తా మీదుగా జాతీయ జెండాలతో ఆర్టీసీ డిపో గ్రౌండ్‌ వరకు ర్యాలీ సాగింది. నియోజకవర్గంలోని ఏడు మండలాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అంబేడ్కర్‌ విగ్రహానికి, అనభేరి ప్రభాకర్‌రావు విగ్రహానికి ఎమ్మెల్యే సతీ్‌షకుమార్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. 


తెలంగాణ జాతి నిర్మాతలను స్మరించుకుందాం

జాతి నిర్మాతలను స్మరించుకుందామని, వారి ఆశయసాధనకు కృషిచేద్దామని ఎమ్మెల్సీ డాక్టర్‌ వంటేరి యాదవరెడ్డి, తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి, అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌లు అన్నారు. మార్కెట్‌ కమిటీలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ 75ఏళ్లుగా తెలంగాణ సమాజ నిర్మాణానికి కృషిచేసిన మహనీయులను స్మరించుకోవడంతో పాటు వారి ఆశయసాధన గూర్చి నేటి తరానికి తెలిపే అవకాశం రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల ద్వారా కల్పించారన్నారు. ఈ సమావేశంలో మెదక్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ హేమలతా, మునిసిపల్‌ చైర్మన్లు రాజమౌళి, రాఘవేందర్‌గౌడ్‌, ఏఎంసీ చైర్మన్లు మాదాసు శ్రీనివా్‌స, జహంగీర్‌, ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. 


దేశానికి కేసీఆర్‌ నాయకత్వం వహించే సమయం ఆసన్నమైంది 

దేశానికి మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వం వహించాల్సిన సమయం ఆసన్నమైందని రాజ్యసభ మాజీ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు, ఎమ్మెల్యే వొడితెల సతీ్‌షకుమార్‌ అన్నారు. పట్టణంలోని ఆర్టీసీ డిపో గ్రౌండ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో వారు మాట్లాడారు. బీళ్లుగా ఉన్న భూములకు సాగునీరందించి పచ్చని చేలుగా మార్చమన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా హుస్నాబాద్‌ నియోజకవర్గం అభివృద్ధి చెందిందన్నారు. రూ.150 కోట్లతో రోడ్లను అభివృద్ధి చేశామన్నారు. హుస్నాబాద్‌కు మాతా శిశు సంక్షేమ ఆసుపత్రిని మంజూరు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు రుణవిముక్తి చైర్మెన్‌ ఎన్‌ వెంకన్న, హనుమకొండ జడ్పీ చైర్మన్‌ సుదీర్‌కుమార్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ గోపాల్‌రావు, ఆర్డీవో జయచంద్రారెడ్డి, రాష్ట్ర నాయకులు కర్ర శ్రీహరి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజిత, నేషనల్‌ లేబర్‌ కోఅపరేటివ్‌ డైరెక్టర్‌ డి.రాజ్యలక్ష్మీ, ఎంపీపీలు మానస, కీర్తి, లక్ష్మీ, వినీత, జడ్పీటీసీలు మంగ, రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.విద్వేషాలను రెచ్చగొట్టే శక్తులను తరిమికొడుదాం : మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట టౌన్‌, సెప్టెంబరు 16 : కుల, మతాల పేరిట ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్న పార్టీలను తరిమికొడదామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. శుక్రవారం సిద్దిపేట పట్టణంలో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. 2001లో సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో మలిదశ ఉద్యమంలో సమైక్య పాలనలో, సకల జనుల సమ్మెతో ఢిల్లీని గడగడలాడించి తెలంగాణ సాధించుకున్నామని గుర్తుచేశారు. సంపద పెంచు, పేదలకు పంచు అనేదే సీఎం కేసీఆర్‌ నినాదమన్నారు. సర్వస్వతీ క్షేత్రంగా సిద్దిపేట మారుతుందని, లా, బీ ఫార్మసీ కోర్సులను వచ్చే ఏడాది నుంచి ప్రారభిస్తామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక్క ఎకరం పారలేదని ఢిల్లీ, హైదరాబాద్‌లో మాట్లాడే కొంత మంది నాయకులను చూస్తే జాలి వేస్తుందని, దమ్ముంటే సిద్దిపేట, సిరిసిల్లా, దుబ్బాకకు వస్తే చూపిస్తామన్నారు. 8 ఏళ్లలో దక్షిణ భారత ధాన్యగారంగా తెలంగాణను మార్చుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చెర్‌పర్సన్‌ రోజాశర్మ, కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, పోలీస్‌ కమిషనర్‌ శ్వేత, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజుల, తదితరులు పాల్గొన్నారు.


ఇంట్లో ఇద్దరికి పింఛన్‌లు ఇస్తున్న కేసీఆర్‌ ప్రభుత్వం

దుబ్బాక : దుబ్బాక చాకలి అయిలమ్మ ప్రాంగణంలో నిర్వహించిన సభలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. దుబ్బాక నియోజకవర్గంలో ప్రతి గుంటకూ నీరందిస్తున్నామన్నారు. నియోజకవర్గంలో 63,085 పింఛన్లను అందజేస్తున్నామని, దుబ్బాకలో 5,679 కుటుంబాలుంటే,  8,210 పింఛన్లు వస్తున్నాయన్నారు. ఇంట్లో ఇద్దరికి కేసీఆర్‌ ప్రభుత్వం పింఛన్‌ ఇస్తున్నదన్నారు. ఎంపీ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ సిద్దిపేట బిడ్డగా కేసీఆర్‌ చేపడుతున్న అభివృద్ధి రాష్ట్రాన్ని దేశంలోనే మహోన్నతమైన స్థాయికి చేర్చిందన్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వనితారెడ్డి, ఎంపీపీ పుష్పలత, జడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
కమ్యూనిస్టులే సాయుధ పోరాట వారసులు

హుస్నాబాద్‌/హుస్నాబాద్‌ రూరల్‌/మద్దూరు, సెస్టెంబరు 16:  తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులేనని, ఈ పోరాటంతో ఏ సంబంధం లేని బీజేపీ చరిత్రను వక్రీకరిస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం హుస్నాబాద్‌ పట్టణంలోని డిపో చౌరస్తా వద్ద సాయుధ పోరాట యోధుడు అనభేరి ప్రభాకర్‌రావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అలాగే మహ్మదాపూర్‌ గుట్టల్లో సాయుధ పోరాట వీరుల ఘాట్‌వద్ద, దూళిమిట్ట మండలంలోని బైరాన్‌పల్లిలో అమరవీరులకు బురుజు వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి, భుక్తి, పేద ప్రజల విముక్తి కోసం, వెట్టిచాకిరి, జమీందార్‌ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి వేల ఎకరాలను పేదలకు పంచిపెట్టిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీకి ఉందన్నారు. వీరోచితంగా పోరాడి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించింది కమ్యూనిస్టులు మాత్రమేనన్నారు. ఈ పోరాటంలో ఏ పాత్ర ఉందని బీజేపీ కేంద్ర నేత అమిత్‌షా హైదరాబాద్‌ వస్తున్నారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్‌, కర్రె భిక్షపతి, గడిపె మల్లేశం, అందెస్వామి, సృజన్‌కుమార్‌, అనభేరి ప్రభాకర్‌రావు కూతురు విప్లవకుమారి, పార్టీ కార్యదర్శులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Read more