వివాహేతర సంబంధమే ప్రాణాలు బలిగొంది

ABN , First Publish Date - 2022-02-20T04:16:17+05:30 IST

ఓ వ్యక్తి హత్య కేసులో జోగిపేట పోలీసులు నలుగురు యువకులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

వివాహేతర సంబంధమే ప్రాణాలు బలిగొంది
నిందితులను మీడియాకు చూపుతున్న జోగిపేట సీఐ

 జోగిపేట సీఐ బుర్రి శ్రీనివాస్‌ 

 హత్య కేసును ఛేదించిన జోగిపేట పోలీసులు

 జోగిపేట, ఫిబ్రవరి 19: ఓ వ్యక్తి హత్య కేసులో జోగిపేట పోలీసులు నలుగురు యువకులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. శనివారం జోగిపేట సీఐ బుర్రి శ్రీనివాస్‌ పట్టణ ఎస్‌ఐ  వెంకటే్‌షతో కలిసి కేసు వివరాలను వెల్లడించారు.  మహబూబాబాద్‌ జిల్లా విస్సంపల్లికి చెందిన పీకే యాకూబ్‌(55) కొన్నాళ్లుగా హైదరాబాద్‌ హైటెక్‌సిటీలోని అయ్యప్ప సొసైటీలో నివాసముంటున్నాడు.  ఈ క్రమంలో మెదక్‌ జిల్లా అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్‌ గ్రామానికి చెందిన ఇటిక్యాల బేతమ్మతో అతడికి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇది గమనించిన బేతమ్మ కుటుంబీకులు పలుమార్లు యాకూబ్‌తో గొడవ పడ్డారు. ఈ నెల 10న జోగిపేటలోని ఒక ప్రైవేటు ఫంక్షన్‌ హాల్లో  బేతమ్మ పెద్ద కుమార్తె వివాహానికి హాజరైన యాకూబ్‌ తిరిగి ఇంటికి చేరుకోలేదు. మరునాడు అందోలు మండలం తాలెల్మ శివారులోని   శ్రీరేణుకా ఎల్లమ్మ ఆలయం వద్ద గల చెక్‌డ్యాం పొదల్లో గుర్తు తెలియని మృతదేహం పడి ఉందని  ఓ వ్యక్తి జోగిపేట పోలీసులకు సమాచారమందించాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ఏరియా ఆసుపత్రికి తరలించి అక్కడే భద్రపరిచారు. ఈ నెల 14న సోషల్‌ మీడియాలో మృతుడి వివరాలను గమనించిన అతడి కుమారులు పీకే. జహంగీర్‌ పాషా, రహీం పాషాలు ఆ మృతదేహం తమ తండ్రిదేనని గుర్తించి  పోలీసులకు చెప్పడంతో వారికి మృతదేహాన్ని అప్పగించారు.


మద్యం తాగించి చంపేశారు

 కేసు దర్యాప్తులో భాగంగా మృతుడి కుమారులను పోలీసులు విచారించగా యాకూబ్‌, బేతమ్మల వివాహేతర సంబంధం వెలుగుచూసింది. అనంతరం పోలీసులు జోగిపేటలోని మద్యం దుకాణాలు వద్ద సీసీటీవీ పుటేజీలను పరిశీలించి మెదక్‌  జిల్లా అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్‌కు చెందిన కొత్తగొల్ల వెంకటేశం (19),  కాదులూరి బాల్‌రాజ్‌ (37)లను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా ఆ హత్య తామే చేసినట్టు అంగీకరించారు. తమ చిన్నమ్మ అయిన బేతమ్మతో వివాహేతర సంబంధం పెట్టుకున్న యాకూబ్‌ను తమ బంధువైన మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం మిన్పూర్‌కు చెందిన గోదారి దేవరాజ్‌ (22)తో కలిసి ఈ హత్య చేసినట్టు ఒప్పుకున్నారు. పెళ్లికి వచ్చిన యాకూబ్‌ను శ్రీరేణుకా ఎల్లమ్మ ఆలయం వద్ద నిర్జనప్రదేశానికి తీసుకెళ్లినట్టు చెప్పారు. మద్యం సేవించిన తరువాత యాకూబ్‌ తలపై మద్యం బాటిళ్లతో మోదడంతో అక్కడికక్కడే మరణించినట్టు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పొదల్లో పారేసి వెళ్లిపోయినట్టు నిందితులు వివరించారు. నిందితుల వాంగ్మూలం మేరకు కొత్తగొల్ల వెంకటేశం, కాదులూరి బాల్‌రాజ్‌లను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించామని, మరో నిందితుడు గోదారి దేవరాజ్‌ కోసం గాలిస్తున్నట్టు సీఐ పేర్కొన్నారు.   

Updated Date - 2022-02-20T04:16:17+05:30 IST