తలాపునే గోదావరి.. అయినా ఎడారే

ABN , First Publish Date - 2022-11-16T00:25:29+05:30 IST

కొండపాక మండలం తలాపునే మల్లన్నసాగర్‌ ఉన్నా మండలంలోని పలు గ్రామాలకు ఇప్పటికీ సాగునీరు అందడంలేదు. మూడేళ్ల నుంచి ఆ గ్రామాల ప్రజలకు ఎదురుచూపులు తప్పడం లేదు.

తలాపునే గోదావరి.. అయినా ఎడారే
బందారం చెరువు

కొండపాక మండలంలోని కొన్ని గ్రామాలకు అందని సాగునీరు

సాగునీరు లేక అంతంతమాత్రంగా పంటలు పండిస్తున్న రైతులు

కాలువ పనులు త్వరగా పూర్తి చేయాలని

ఇటీవలే మంత్రి హరీశ్‌రావు ఆదేశం

కొండపాక, మార్చి 15: కొండపాక మండలం తలాపునే మల్లన్నసాగర్‌ ఉన్నా మండలంలోని పలు గ్రామాలకు ఇప్పటికీ సాగునీరు అందడంలేదు. మూడేళ్ల నుంచి ఆ గ్రామాల ప్రజలకు ఎదురుచూపులు తప్పడం లేదు. మరీ ముఖ్యంగా మండలంలోని బందారం, అంకిరెడ్డిపల్లి, దర్గా గ్రామాలకు గోదావరి నీరు అందడం లేదు. అయితే గతంలో తపా్‌సపల్లి రిజర్వాయర్‌ నుంచి కాలువల ద్వారా సాగునీరు అందించేందుకు ప్రణాళికలు రూపొందించినా మధ్యలోనే నిలిచిపోయాయి. ఇటీవల రాష్ట్ర ఆర్థిక వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, ఇరిగేషన్‌ అధికారులతో సమీక్ష నిర్వహించి సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాలకు సాగునీరు అందించే విషయంపై చర్చించారు. కొండపాక మండలంలోని మూడు గ్రామాలతో పాటు సిద్దిపేటఅర్బన్‌ మండలం బక్రిచెప్యాల, నాంచార్‌పల్లి, నంగునూరు మండలంలోని కోనాయిపల్లి తదితర గ్రామాలకు సాగునీరు అందించే కాలువ పనులపై చర్చించారు. ఆయా గ్రామాలకు మల్లన్నసాగర్‌ నుంచి సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. మల్లన్నసాగర్‌ నుంచి తొగుట మండలం బండారుపల్లి వరకు వచ్చే కాలువ నుంచి ఖమ్మంపల్లి వరకు ఉన్న తప్‌సపల్లి కాలువకు కలపడంతో అక్కడి నుంచి మర్పడగ, రాంపల్లి కలెక్టరేట్‌ సమీపం నుంచి దర్గా బందారం, అంకిరెడ్డిపల్లి గ్రామాలకు నీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు. అందుకు సంబంధించిన పనులు ప్రారంభించాలన్నారు. మంత్రి ఆదేశాలతో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కొండపాక మండలంలోని మూడు గ్రామాల ప్రజలకు మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి.

మర్పడగ వరకే కాలువ పనులు పూర్తి..

కొండపాక మండలం పక్క నుంచే వరంగల్‌ జిల్లాకు కాలువ వెళ్తున్నప్పటికీ ఆ జిల్లా నాయకులు, ప్రభుత్వ వివక్షత వల్ల మండలంలోని గ్రామాలకు నీరు అందలేదు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమ ఆశలు నెరవేరుతాయని రైతులు భావించారు. 2017లో సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు మంత్రి హరీశ్‌రావు చొక్కారావు ఎత్తిపోతల పథకంలో డీ 4 కెనాల్‌ ద్వారా గోదావరి జలాలను తపాస్‌పల్లి రిజర్వాయర్‌ నుంచి విడుదల చేశారు. దీంతో కొండపాక మండలంలోని తిమ్మారెడ్డిపల్లి, కొండపాక, దమ్మక్కపల్లి, సిర్సనగండ్ల, మర్పడగ, దుద్దెడ, జప్తినాచారం, ఖమ్మంపల్లి, రాంపల్లి గ్రామాల్లోని చెరువులు నిండాయి. ఇక్కడ ప్రతి యేటా వేసవిలో సైతం నిండుకుండలా చెరువులు ఉంటాయి. మర్పడగ నుంచి రాంపల్లి మీదుగా ఉన్న మూడు గ్రామాల్లోని చెరువులు నింపడానికి కాలువలు నిర్మిస్తామని నాయకులు హామీ ఇచ్చారు. కానీ మర్పడగ గ్రామ శివారులో ఏవో కారణాలతో కాలువ తవ్వకం పనులు ఆగిపోయాయి. ఫలితంగా అంకిరెడ్డిపల్లి, దర్గా, బందారం చెరువుల్లోకి నీరు చేరలేదు. సాగునీరు అందించాలని పలుమార్లు రైతులు, వివిధ సంఘాలు అధికారులను కోరుతూ వచ్చాయి. కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నచందంగా మారింది. మంత్రి ఆదేశాలతో అయినా సాగునీరు అందకపోదా? అని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నాం

-శ్రీనివాస్‌ రెడ్డి, రైతు, బందారం

కొండపాక మండలంలోని గ్రామాలకు సాగునీరు అందివ్వడానికి 2017లో శంకుస్థాపన చేశారు. కొన్ని రోజుల తర్వాత మండలంలోని కొన్ని గ్రామాల్లోని చెరువులు మాత్రమే కళకళలాడాయి. కానీ బందారం, అంకిరెడ్డిపల్లి, దర్గా గ్రామాలకు సాగునీరు అందలేదు. మధ్యలోనే కాలువ పనులు ఆగిపోయాయి. ఎన్నో మార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నాం.

తొందరగా పనులు పూర్తి చేయాలి

-చంద్రారెడ్డి, రైతు, బందారం

మా గ్రామానికి సాగునీరు అందించే కాలువ పనులు తొందరగా పూర్తి చేయాలి. వర్షపు నీటి పైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నాం. దగ్గరి వరకు వచ్చిన కాలువ కొన్ని గ్రామాలకు రాకపోవడంతో అందరూ నిరాశ చెందుతున్నారు. మంత్రి హరీశ్‌రావు ఆదేశాలు ఇవ్వడం సంతోషకరమైన విషయం.

Updated Date - 2022-11-16T00:25:30+05:30 IST