అకారణంగా బదిలీ చేశారు.. చనిపోతా!

ABN , First Publish Date - 2022-03-23T05:39:57+05:30 IST

అ కారణంగా బదిలీ చేశారంటూ ఓ కానిస్టేబుల్‌ పోలీసు ఏఆర్‌ హెడ్‌ క్వార్టర్‌లో హల్‌చల్‌ చేశాడు.

అకారణంగా బదిలీ చేశారు.. చనిపోతా!

 మెదక్‌ ఏఆర్‌ హెడ్‌క్వార్టర్‌లో కానిస్టేబుల్‌ హల్‌చల్‌


మెదక్‌అర్బన్‌/తూప్రాన్‌, మార్చి 22: అ కారణంగా బదిలీ చేశారంటూ ఓ కానిస్టేబుల్‌ పోలీసు ఏఆర్‌ హెడ్‌ క్వార్టర్‌లో హల్‌చల్‌ చేశాడు. ఉరేసుకుని చనిపోతానంటూ కుటుంబసభ్యులతో కలిసి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇదంతా వీడియో తీసి స్నేహితులకు, తోటి పోలీసు సిబ్బందికి, మీడియాకు పంపించాడు. ఈ సంఘటన మెదక్‌ టౌన్‌ పోలీసుస్టేషన్‌ వెనుకగా ఉన్న ఏఆర్‌ హెడ్‌ క్వార్టర్‌ వద్ద సోమవారం రాత్రి చోటుచేసుకున్నది. 

శివ్వంపేట ప్రాంతానికి చెందిన ఎం.నాజమ్‌నాయక్‌ 2012లో పోలీసు కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. సంగారెడ్డి, చేగుంట పోలీసుస్టేషన్లలో విధులు నిర్వహించాడు. 2019 జూలైలో తూప్రాన్‌ పోలీ్‌సస్టేషన్‌కు బదిలీ చేశారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న నాజమ్‌ను ఈనెల 14న మెదక్‌ టౌన్‌ పోలీసుస్టేషన్‌కు బదిలీ చేశారు. అయితే తనను అకారణంగా బదిలీ చేసినట్లు వాట్సాప్‌ గ్రూపుల్లో పోస్టులు పెట్టాడు. అలాగే మెదక్‌టౌన్‌ పోలీ్‌సస్టేషన్‌లో జాయినింగ్‌ రిపోర్టు చేయలేదు. ఓ అధికారిపై లంచాలు తీసుకుంటున్నట్లు వాట్సాప్‌ గ్రూపుల్లో ఆరోపించాడు. దీంతో అతడిని ఏఆర్‌ (ఆర్మ్‌డ్‌ రిజర్వు) హెడ్‌ క్వార్టర్‌కు పంపించారు. ఏఆర్‌ హెడ్‌ క్వార్టర్‌లో జాయినింగ్‌ అయినప్పటికీ విధులకు హాజరు కాలేదు. తానేమి తప్పు చేయకుండా పనిష్మెంట్‌ బదిలీ చేశారని  ఆరోపిస్తూ మౌనదీక్ష చేపట్టేందుకు సిద్ధమయ్యాడు. ఈ మేరకు అనుమతి కోసం మీసేవ కేంద్రంలో దరఖాస్తు కూడా చేసుకున్నాడు. తోటి సిబ్బంది సముదాయించడంతో దీక్ష విరమించుకుని ఏఆర్‌ హెడ్‌క్వార్టర్‌లో విధులకు హాజరయ్యాడు. తను మౌనదీక్షకు ప్రయత్నించిన విషయం బయటకు రావడంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. సోమవారం రాత్రి నాజమ్‌ను సస్పెండ్‌ చేస్తూ జిల్లా పోలీసు కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. విషయం తెలియగానే నాజమ్‌, భార్య పిల్లలతో కలిసి ఏఆర్‌ హెడ్‌ క్వార్టర్‌ వద్దకు వచ్చి హల్‌చల్‌ చేశాడు. అధికారుల వేధింపులు తాళలేకనే చనిపోతున్నామంటూ వీడియోలు తీసి పలువురికి సెండ్‌ చేశాడు. కొన్నిరోజులుగా అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని, అధికారుల పేర్లు చెబుతూ చనిపోతానంటు పేర్కొన్నాడు. అక్కడే ఉన్న పోలీసులు నాజమ్‌కు నచ్చజెప్పారు. నాజమ్‌ విషయంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Read more