పెంచిన గ్యాస్‌ ధరను తగ్గించాలి

ABN , First Publish Date - 2022-07-08T04:59:04+05:30 IST

కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్‌ ధరను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ గురువారం అక్కన్నపేట మండల కేంద్రంలో టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.

పెంచిన గ్యాస్‌ ధరను తగ్గించాలి
అక్కన్నపేట మండల కేంద్రంలో కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తున్న మహిళలు

పలు మండలాల్లో టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో

అక్కన్నపేట, జూలై 7: కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్‌ ధరను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ గురువారం అక్కన్నపేట మండల కేంద్రంలో టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపైనే ఖాళీ గ్యాస్‌ సిలిండర్లు ఉంచి కట్టెల పొయ్యి మీద వంటలు చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు పెసరు సాంబరాజు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రూ.400 ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ ధర ప్రస్తుతం రూ.1,105లకు చేరుకున్నదన్నారు. పేదలకు పెనుభారంగా మారిన గ్యాస్‌ ధరను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్‌ కందుల రాంరెడ్డి, సర్పంచులు కాశబోయిన యాదయ్య, కాశబోయిన సంపత్‌, సంచార జాతుల సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సమ్మయ్య, రాజు పాల్గొన్నారు.

కోహెడలో 

కోహెడ, జూలై 7: మండల కేంద్రంలో పెంచిన గ్యాస్‌ ధరకు నిరసనగా ఖాళీ సిలిండరు పెట్టి టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో గురువారం ఆందోళన చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘బీజేపీని బొందపెట్టు.. సిలిండరుకు దండం పెట్టు, మోదీ డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. పెంచిన ధరలు తగ్గించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి, వైస్‌ ఎంపీపీ తడకల రాజిరెడ్డి, రైతు సమన్వయ కమిటీ జిల్లా సభ్యుడు క్రిష్ణమూర్తి, జిల్లా అటవీ పరిరక్షణ కమిటీ సభ్యుడు అబ్దుల్‌ రహీం తదితరులు పాల్గొన్నారు. 

హుస్నాబాద్‌లో

హుస్నాబాద్‌, జూలై 7: కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్‌ సిలిండర్‌ ధరను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ హుస్నాబాద్‌ పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గ్యాస్‌ సిలిండర్‌తో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజిత, వైస్‌ చైర్‌పర్సన్‌  అనిత, టీఆర్‌ఎస్‌ మండట, పట్టణ అధ్యక్షులు వంగ వెంకట్రాంరెడ్డి, ఎండీ.అన్వర్‌, మాజీ ఎంపీపీ వెంకట్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-07-08T04:59:04+05:30 IST