ఆరేళ్లయినా అసంపూర్తిగానే..

ABN , First Publish Date - 2022-11-28T00:18:42+05:30 IST

నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్‌ పట్టణంలో తలపెట్టిన డబుల్‌బెడ్రూం ఇళ్ల నిర్మాణం ఆరేళ్లుగా అసంపూర్తిగానే మిగిలింది.

ఆరేళ్లయినా  అసంపూర్తిగానే..

డబుల్‌బెడ్రూంలకు లభించని మోక్షం

నర్సాపూర్‌లో 500 ఇళ్ల నిర్మాణం

250 ఇళ్లు దాదాపు పూర్తి, స్లాబ్‌ లెవల్‌లో మరో 250

ఇళ్ల కోసం వేచి చూస్తున్న పేదలు

నర్సాపూర్‌, నవంబరు 27: నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్‌ పట్టణంలో తలపెట్టిన డబుల్‌బెడ్రూం ఇళ్ల నిర్మాణం ఆరేళ్లుగా అసంపూర్తిగానే మిగిలింది. పట్టణంలో నివసిస్తున్న నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడానికి ప్రభుత్వం 500 ఇళ్లను మంజూరు చేసింది. నర్సాపూర్‌-వెల్దుర్తి రోడ్డు పక్కన మార్కెట్‌యార్డు సమీపంలో రెండుచోట్ల 250 చొప్పున ఇళ్ల చొప్పున నిర్మించాలని నిర్ణయించి, 2016లో శంకుస్థాపన చేశారు. మార్కెట్‌యార్డు ముందు భాగంలో 250 ఇళ్లు, వెనుక భాగం మరో 250 ఇళ్లను నిర్మిస్తున్నారు. ముందు భాగంలో ఉన్న ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తయ్యింది. చిన్న పనులు మాత్రమే మిగిలిపోయాయి. మార్కెట్‌యార్డు వెనుక భాగంలో చేపట్టి 250 ఇళ్లు మాత్రం స్లాబ్‌ వరకే నిర్మించి వదిలేశారు. కాంట్రాక్టర్లకు బిల్లులు రాకపోవడంతోనే ఇళ్ల నిర్మాణాన్ని నిలిపివేశారని తెలుస్తున్నది. ఇళ్ల కోసం 3వేల మంది పేదలు దరఖాస్తు చేసుకున్నారు. అసంపూర్తి ఉన్న ఇళ్లు అసాంఘిక కార్యక్రమాలకు కేంద్రంగా మారాయి. మందుబాబులు, పేకాటరాయుళ్లకు స్థావరాలయ్యాయి. వారి ఆగడాలతో పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు పేదలు పలుమార్లు విన్నవించుకున్నా ఎప్పటికప్పుడు ఇదిగో.. అదిగో.. అంటూ దాటవేయడమే తప్ప ఎవ్వరూ పట్టించుకున్న దాఖాలాలు లేవని ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న పేదలు ఆరోపిస్తున్నారు.

ఇళ్ల నిర్మాణంపై దృష్టి

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అసంపూర్తిగా ఉన్న డబుల్‌బెడ్రూం ఇళ్లపూ దృష్టిసారించడంతో నర్సాపూర్‌లోనూ కదలిక వచ్చింది. మెదక్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌, పీఆర్‌ ఈఈ సత్యనారాయణరెడ్డి, డీఈఈ రాధికాలక్ష్మి తదితరులు నర్సాపూర్‌ పట్టణంలో నిర్మిస్తున్న ఇళ్లను పరిశీలించారు. నిర్మాణం చివరి దశలో ఉన్న ఇళ్లను పూర్తిచేసి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న చిన్నచిన్న పనులను వెంటనూ పూర్తిచేయాలని పేర్కొన్నారు. శ్లాబ్‌ దశలో నిలిచిపోయిన ఇళ్లను కూడా మూడు నెలల్లో పూర్తిచేయాలని నిర్ధేశించారు. కానీ కాంట్రాక్టర్లు పెండింగ్‌ బిల్లులు రాకుండా పనులు తిరిగి ప్రారంభిస్తారా.. మొదలు పెట్టినా 3 నెలల్లో పూర్తిచేయడం సాధ్యమేనా అనే సంశయం వేధిస్తున్నది. అప్పుడప్పుడూ హడావుడి చేయడం ఆ తరువాత మరిచిపోవడం జిల్లా అధికారులకు పరిపాటేనని, చిత్తశుద్ధితో పనులు చేయించాలనే తపన వారికి లేదని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు.

Updated Date - 2022-11-28T00:18:43+05:30 IST