mp kotta prabhakar reddy: కేసీఆర్‌ వస్తేనే దేశంలో రైతు రాజ్యం

ABN , First Publish Date - 2022-09-12T04:19:23+05:30 IST

వ్యవసాయాన్ని సంక్షోభంలో నెట్టి, రైతులను వీఽధుల పాలు చేస్తున్న మోదీ సర్కారుకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని, కేసీఆర్‌ వస్తేనే.. దేశంలో రైతులు ఏలే రాజ్యం వస్తుందని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు.

mp kotta prabhakar reddy: కేసీఆర్‌ వస్తేనే దేశంలో రైతు రాజ్యం
దుబ్బాకలో సీఎం రిలీఫ్‌ఫండ్‌ చెక్కులను పంపిణీ చేస్తున్న ఎంపీ ప్రభాకర్‌రెడ్డి

దుబ్బాక, సెప్టెంబరు 11: వ్యవసాయాన్ని సంక్షోభంలో నెట్టి, రైతులను వీధుల పాలు చేస్తున్న మోదీ సర్కారుకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని, కేసీఆర్‌ వస్తేనే.. దేశంలో రైతులు ఏలే రాజ్యం వస్తుందని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోలుపై మోదీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టేందుకు తెలంగాణ ఉద్యమ బిడ్డలు కదలాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. ఆదివారం దుబ్బాకలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రపంచం మొత్తం బియ్యానికి మంచి డిమాండ్‌ ఉన్నదని,  బియ్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకుంటే, రైతులు వరిధాన్యాన్ని రవాణా చేసుకునే అవకాశాన్ని తిరిగి కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. తెలంగాణలో ద్వంద వైఖరితో వరిపై బీజేపీ డ్రామాలాడి, వరి పంట వేయాలని ప్రచారం చేసిందన్నారు. దేశంలోనే అత్యధికంగా తెలంగాణలోనే వరిధాన్యం పడుతుందని, దాన్ని కొనుగోలుకు కేంద్రం పేచీ పెట్టిందన్నారు. వరిధాన్యాన్ని కొనడానికి ముందుకు రాకుండా బాయిల్డ్‌ రైస్‌ కాకుండా రా రైస్‌ను కొనుగోలు చేస్తామని తిరకాసు పెట్టారన్నారు. నూకలు ఆసలు కొనుగోలు చేయబోమని, నూకలు తెలంగాణ ప్రజలే తినాలని హేళన చేశారన్నారు. ఎండకాలం సీజన్‌లో నూకలు ఎక్కువగా వస్తాయనీ కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్తే, ఆ నూకలను మీ ప్రజలకే తినిపించండని చులకన చేశారని చెప్పారు. ప్రస్తుతం దేశంలో పండిన వరిధాన్యానికి విదేశాల్లో డిమాండ్‌ పెరిగిందన్నారు. చాలా రాష్ట్రాల్లో మిగిలి ఉన్న బియ్యాన్ని నేరుగా విదేశాలకు సరఫరా చేస్తామంటే కేంద్రం ఆంక్షలు విధిస్తున్నదన్నారు. అనంతరం దుబ్బాకలోని లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను ప్రభాకర్‌రెడ్డి అందజేశారు. ఆయన వెంట నాయకులు ఆర్‌.రాజమౌళి, జడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, కిషన్‌రెడ్డి, ఆసస్వామి, గన్నె భూంరెడ్డి, వంశీకృష్ణ, సంజీవరెడ్డి, భూపాల్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-12T04:19:23+05:30 IST