చేపల వలలో చిక్కిన భారీ కొండ చిలువలు

ABN , First Publish Date - 2022-04-06T05:08:54+05:30 IST

చేపల కోసం వేసిన వలలో రెండు భారీ కొండచిలువలు చిక్కుకోవడంతో మత్స్యకారుడు భయాందోళనకు గురయ్యాడు.

చేపల వలలో చిక్కిన భారీ కొండ చిలువలు
కొండచిలువలను చూపుతున్న సాయిలు

అల్లాదుర్గం, ఏప్రిల్‌ 5:  చేపల కోసం వేసిన వలలో రెండు భారీ కొండచిలువలు చిక్కుకోవడంతో మత్స్యకారుడు భయాందోళనకు గురయ్యాడు. ఈ ఘటన మెదక్‌ జిల్లా అల్లాదుర్గం మండలం అప్పాజీపల్లి గ్రామ శివారులోని గిడ్డమ్మ చెరువులో మంగళవారం జరిగింది. అల్లాదుర్గం పట్టణానికి చెందిన గోండ్ల సాయిలు అనే మత్స్య కార్మికుడు మండలంలోని అప్పాజీపల్లి గ్రామ శివారులోని గిడ్డమ్మ చెరువులో చేపలను  పట్టేందుకు వల వేశాడు. వలను బయటకు తీసే క్రమంలో ఎన్నడూ లేనంత బరువుగా రావడంతో చేపలు ఎక్కువగా పడిఉంటాయని భావించాడు. ఉత్కంఠగా వలను బయటకు లాగిన సాయిలుకు ఊహించని షాక్‌ తగిలింది.  వలలో  పది అడుగుల పొడవైన రెండు భారీ కొండచిలువలు చిక్కుకోవడంతో అవాక్కయ్యాడు. ఇక చేసేదేమీ లేక సమీపంలోని అటవీ ప్రాంతంలో ఆ రెండు కొండచిలువలను వదిలేసి ఇంటిదారి పట్టాడు.

Read more