మన ఊరు - మన బడి ముందుకు సాగేదెలా?

ABN , First Publish Date - 2022-12-02T00:19:58+05:30 IST

‘‘బిల్లుల చెల్లింపులకు ఇబ్బందులు ఉండవు. పనులు చేపట్టేందుకు ముందుకు రండి.’’ అని అధికారులు ఎన్నిసార్లు కోరినా కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదు. బిల్లుల చెల్లింపులపై కాంట్రాక్టర్లకు నమ్మకం కుదరడం లేదు

మన ఊరు - మన బడి ముందుకు సాగేదెలా?
సంగారెడ్డిలోని సంజీవనగర్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అసంపూర్తిగా నిలిచిన బాత్‌రూం పనులు

బిల్లులు చెల్లిస్తారో లేదోనని ముందుకు రాని కాంట్రాక్టర్లు

బిల్లుల చెల్లింపులపై కాంట్రాక్టర్ల ఆందోళన

పనులు పూర్తయ్యాక ఇస్తారో లేదోననే సందేహం

గడువు దాటి ఆర్నెళ్లు అయినా చేరని లక్ష్యం

సంగారెడ్డి జిల్లాలో తొలి విడత 437 స్కూళ్లలో పనులు

33 స్కూళ్లలోనే పూర్తిస్థాయిలో పనులు కంప్లీట్‌!!

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, డిసెంబరు1: ‘‘బిల్లుల చెల్లింపులకు ఇబ్బందులు ఉండవు. పనులు చేపట్టేందుకు ముందుకు రండి.’’ అని అధికారులు ఎన్నిసార్లు కోరినా కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదు. బిల్లుల చెల్లింపులపై కాంట్రాక్టర్లకు నమ్మకం కుదరడం లేదు. ఫలితంగా రూ.30లక్షల పైచిలుకు అంచనా లతో చేపట్టాల్సిన 54 పనులు ఆగిపోయాయి. కొన్నిచోట్ల కాంట్రాక్టర్లు ముందుకొచ్చి రూ.30లక్షల లోపు పనులు చేపట్టినా అవి పూర్తి కావడం లేదు. మొత్తం మీద సంగారెడ్డి జిల్లాలో ‘మన ఊరు- మన బడి’లో భాగంగా తొలివిడతగా 437 పాఠశాలల్లో చేపట్టిన 2,439 పనుల్లో 640 పనులు పూర్తయ్యాయి. ఇక 19 పాఠశాలల్లోనే అన్ని రకాల పనులు పూర్తి కావడం గమనార్హం.

సంగారెడ్డి జిల్లాలో వివిధ కేటగిరీల ప్రభుత్వ పాఠశాలలు 1,262 ఉన్నాయి. వీటిలో తొలి విడతగా 441 పాఠశాలలను ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో ఎంపిక చేశారు. అయితే కోర్టు కేసులు, ఇతరత్ర కారణాలతో ఇందులో నాలుగు పాఠశాలలో పనులు చేపట్టడం లేదు. ప్రస్తుత విద్యాసంవత్సరం ప్రారంభం కావడానికి ముందే మన ఊరు-మన బడి కింద ఎంపిక చేసిన పాఠశాలల్లో పనులు పూర్తి చేయాల్సి ఉన్నది. ఆ రకంగా గత జూన్‌ 12లోపు ఆయా పనులన్నీ పూర్తి కావాల్సి ఉండగా గడువు దాటి ఆర్నెళ్లు కావస్తున్నా కేవలం 19 పాఠశాలల్లోనే పనులన్నీ పూర్తయ్యాయి. పాఠశాలల్లో చేపట్టాల్సిన పనుల్లో నీటివసతితో టాయిలెట్లు, ప్రహరీ, వంటగది, విద్యుత్‌, తాగునీరు, హైస్కూళ్లలో డైనింగ్‌ హాలుతో పాటు అన్ని పాఠశాలల్లో మైనర్‌, మేజర్‌ పనులు చేపట్టాలి. ఈ పనులన్నీ పూర్తయ్యాకనే పాఠశాలలకు పేయింటింగ్‌ వేసి సుందరంగా తీర్చిదిద్దాలి. జిల్లాలో తొలి విడతగా ఎంపిక చేసిన 437 పాఠశాలలో ఇప్పటి వరకు 33 పాఠశాలల్లోనే అన్ని రకాల పనులను పూర్తిచేశారు. వీటిలోనూ 19 పాఠశాలలకు మాత్రమే పెయింటింగ్‌ వేశారు.

మంజూరైన పనులు 2,439

తొలివిడతగా ఎంపిక చేసిన 437 వివిధ పాఠశాలల్లో 2,439 పనులు చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఇందులో ఇప్పటి వరకు 640 పనులు మాత్రమే పూర్తి కాగా, 1,172 పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. ఇంకా 627 పనులు అయితే మొదలు కాలేదు. ఆయా పాఠశాలల్లో మొదలైన పనులన్నీ రూ.30 లక్షలలోపు అంచనాలతో కూడుకున్నవే. పాఠశాలల్లో చేపట్టిన పనులలో కొన్ని పనులు రూ.5లక్షల నుంచి రూ.30లక్షల లోపు వరకే ఉన్నాయి. అయినా ఆయా పనులను పూర్తి పూర్తి చేసేందుకు కాంట్రాక్లర్లు చొరవ చూపడం లేదు.

రూ.30లక్షలపై చిలుకు పనులకైతే అంతే

పాఠశాలల్లో చేపట్టిన 2,439 పనుల్లో రూ.30 లక్షల పైచిలుకు పనులను 107 పాఠశాలలో ప్రారంభించాల్సి ఉన్నది. అయితే వీటికి జిల్లా యంత్రాంగం గత ఆరేడు నెలలుగా పలుమార్లు టెండర్లు పిలిచింది. 53 పాఠశాలల్లో మాత్రమే పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు వచ్చారు. మిగిలిన 54 పాఠశాలల్లో పనులు చేపట్టడానికి కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదు. పనులు చేపట్టేందుకు ముందుకు వచ్చిన కాంట్రాక్టర్లకు ఆ పని అంచనాలో పది శాతం డబ్బును ముందుగానే చెల్లిస్తున్నారు. అయినా పనులు పూర్తయ్యాక బిల్లుల చెల్లింపులో ఇబ్బందులకు గురి చేస్తారేమోనన్న ఆందోళన కాంట్రాక్టర్లలో నెలకొన్నది. అంతేగాక పనులు పూర్తయ్యాక ప్రభుత్వం నిధుల విడుదల్లో జాప్యం చేస్తే తమ పరిస్థితి ఆగమవుతుందన్న భావనతో కాంట్రాక్టర్లు రావడం లేదని తెలుస్తున్నది.

విడుదలైన నిధులు

సంగారెడ్డి జిల్లాలో మన ఊరు- మన బడి ద్వారా చేపట్టిన 2,439 పనుల్లో ఇప్పటి వరకు రూ.17.12 కోట్లతో అంచనాలు రూపొందించగా అందులో రూ.9.50 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. చౌటకూరు హైస్కూలు, కృష్ణాపూర్‌ యూపీఎ్‌సకు, తుర్కపల్లి-టి, మంగాపూర్‌ ప్రాథమిక పాఠశాలలకు మన ఊరు-మన బడి పనులకు రూ.3లక్షలు దాతల నుంచి విరాళంగా వచ్చాయి. ఇందులో రూ.2.95 లక్షలను వినియోగించేందుకు ఆయా పాఠశాలల మేనేజ్‌మెంట్‌ కమిటీల ఖాతాలకు విడుదల చేశారు.

యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారిస్తేనే

మన ఊరు- మన బడి ద్వారా ఎంపిక చేసిన పాఠశాలల్లో పనులు పూర్తి కావాలంటే జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాల్సిందే. జిల్లాలోని 1,262 పాఠశాలలో తొలి విడతగా ఎంపిక చేసిన 437 పాఠశాలల్లో పనులన్నీ కనీసం మరో రెండు, మూడు నెలల్లో పూర్తి చేయించాలి. అయితేనే రెండో విడత పనులను ఏప్రిల్‌, మే నెలల్లో తీసుకుని, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే జూన్‌ 12 లోపు పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకోవచ్చు. ఇందుకోసం బిల్లుల చెల్లింపులపై జిల్లా యంత్రాంగం కాంట్రాక్టర్లకు భరోసా కల్పిస్తేనే మన ఊరు-మన బడి కార్యక్రమానికి సార్థకత చేకూరుతుంది. అప్పుడే విద్యార్థులు కార్పోరేట్‌ స్కూళ్లలో మాదిరిగా చదువుకునే అవకాశాలుంటాయని ఉపాధ్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Updated Date - 2022-12-02T00:19:59+05:30 IST