ఉద్యమ స్ఫూర్తి అభివృద్ధికి దిక్సూచి

ABN , First Publish Date - 2022-09-18T05:04:24+05:30 IST

ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని హోంశాఖ మంత్రి మహమూద్‌అలీ పేర్కొన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా శనివారం ఆయన సంగారెడ్డి పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ పోరాడి సాఽధించుకున్న తెలంగాణలో తమ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందజేస్తున్నదన్నారు.

ఉద్యమ స్ఫూర్తి అభివృద్ధికి దిక్సూచి
సంగారెడ్డిలో పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తున్న హోంమంత్రి మహమూద్‌అలీ

హోంశాఖ మంత్రి మహమూద్‌అలీ

సంగారెడ్డి జిల్లాలో అట్టహాసంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు


ఆంధ్రజ్యోతిప్రతినిధి, సంగారెడ్డి, సెప్టెంబరు 17 : ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని హోంశాఖ మంత్రి మహమూద్‌అలీ పేర్కొన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా శనివారం ఆయన సంగారెడ్డి పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ పోరాడి సాఽధించుకున్న తెలంగాణలో తమ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందజేస్తున్నదన్నారు. విద్యుత్‌, నీటి పారుదల, వ్యవసాయం, పరిశ్రమలు, ఉద్యోగ, ఉపాధి కల్పనతోపాటు అభివృద్ధి, ప్రజా సంక్షేమ రంగాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దార్శనికత దేశానికే దిక్సూచిలా నిలిచిందన్నారు. 


ఎత్తిపోతలకు రూ.4,427 కోట్లు

జిల్లాలోని సింగూర్‌ ప్రాజెక్టుపై సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలను నిర్మించేందుకు ప్రభుత్వం రూ.4,427 కోట్లను కేటాయించిందని తెలిపారు. ఈ రెండు ఎత్తిపోతలు పూర్తయితే మూడు లక్షల ఎకరాలకు సాగు నీరందుతుందని వివరించారు. రైతుబంధు పథకం ద్వారా జిల్లాలో తొమ్మిది విడతలలో రూ.2,906 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలియజేశారు. రైతుబీమా పథకం ద్వారా 5,459 మంది రైతుల నామినీల ఖాతాల్లో రూ.272.95 కోట్లను జమ చేశామని వెల్లడించారు. మిషన్‌భగీరథ పథకం ద్వారా జిల్లాలోని 943 నివాస ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నామని, జిల్లాలోని అన్ని తండాలకు గిరిజనులకు రూ.1,372 కోట్ల వ్యయంతో తాగునీటిని అందిస్తున్నామని తెలిపారు. జిల్లాలో 13 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నామన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 61,551 కేసీఆర్‌ కిట్లను పంపిణీ చేశామని, ఇందులో 5,835 మంది గిరిజన మహిళలున్నారని పేర్కొన్నారు. 


ప్రతి నెలా పింఛన్లకు రూ.30 కోట్లు

జిల్లాలో ఆసరా పథకం కింద జిల్లాలో అర్హులైన 1.34 లక్షల మందికి ప్రతి నెలా పింఛన్లు ఇవ్వడానికి రూ.30 కోట్లను కేటాయిస్తున్నామని తెలిపారు. వీరిలో 10,483 మంది గిరిజనులకు ప్రతి నెలా రూ.2.10 కోట్లను పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్‌ లింకేజీ ద్వారా రూ.700 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, ఇప్పటి వరకు రూ.385 కోట్లను అందించి రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచామన్నారు. జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీలలో రూ.43.64 కోట్ల బ్యాంకు రుణాలను, స్వయం సహాయక సంఘాల మహిళలకు మంజూరు చేయడం జరిగిందన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా 2019 నుంచి ఇప్పటి వరకు జిల్లాకు వివిధ గ్రాంట్ల రూపంలో రూ.473.68 కోట్లను విడుదల చేశామన్నారు. ప్రత్యేక అభివృద్ధి నిధి ద్వారా జిల్లాకు రూ.527 కోట్లను ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంజూరు చేశారని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి పథకం కింద వివిధ అభివృద్ధి పనులకు రూ.14.69 కోట్ల పనులకు అనుమతులను మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. ఉత్సవాల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అకట్టుకున్నాయి. విద్యార్థులకు మంత్రి జ్ఞాపికలను అందజేశారు. అనంతరం దళితబంధు లబ్ధిదారులకు వాహనాలను పంపిణీ చేశారు. స్వయంసహాయ సంఘాల మహిళలకు ఆర్థిక సహాయం చెక్కును అందజేశారు. కార్యక్రమాల్లో  ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ మంజూశ్రీజైపాల్‌రెడ్డి, చేనేత అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ చింతాప్రభాకర్‌, కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌, ఎస్పీ రమణకుమార్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ శివకుమార్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నరహరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-18T05:04:24+05:30 IST