అసైన్డ్‌ భూముల్లో లేఅవుట్‌లు

ABN , First Publish Date - 2022-04-11T05:11:11+05:30 IST

వ్యవసాయం చేయని అసైన్డ్‌ భూములు, వ్యవసాయానికి ఉపయోగపడని బీడు భూములపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ భూములను సేకరించి హెచ్‌ఎండీఏ ద్వారా లేఅవుట్‌ చేయించి, ప్లాట్లు విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రభుత్వానికి ఆదాయం సమకూరడంతో పాటు అసైన్డ్‌ భూములు, బీడు భూములను ఇచ్చిన రైతులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలని యోచిస్తున్నారు.

అసైన్డ్‌ భూముల్లో లేఅవుట్‌లు

అసైన్ట్‌, బీడు భూములపై సర్కారు నజర్‌

హచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో లేఅవుట్‌లు చేసి విక్రయించాలని నిర్ణయం

కొన్నిచోట్ల రైతుల అంగీకారం.. మరికొన్నిచోట్ల వ్యతిరేకత


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, ఏప్రిల్‌ 10: వ్యవసాయం చేయని అసైన్డ్‌ భూములు, వ్యవసాయానికి ఉపయోగపడని బీడు భూములపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ భూములను సేకరించి హెచ్‌ఎండీఏ ద్వారా లేఅవుట్‌ చేయించి, ప్లాట్లు విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రభుత్వానికి ఆదాయం సమకూరడంతో పాటు అసైన్డ్‌ భూములు, బీడు భూములను ఇచ్చిన రైతులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలని యోచిస్తున్నారు. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో హెచ్‌ఎండీఏ పరిధిలో అసైన్డ్‌ భూములు పొందిన రైతులు వ్యవసాయం చేయడం లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ భూములను అమ్ముకోవడానికి వీలు లేకపోవడంతో వృథాగా ఉంటున్నాయి. ఇదే అవకాశంగా రాజకీయ పలుకుబడితో కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. రైతులు ఒప్పించి ఇలాంటి భూములను సేకరించాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో లేఅవుట్‌గా మార్చి, ఎకరా భూమికి బదులుగా రైతుకు 200 చదరపు గజాల ప్లాటును ఇవ్వాలని నిర్ణయించారు. ఈ విషయంపై హైదరాబాద్‌ శివార్లలోని పటాన్‌చెరు, జిన్నారం మండలాల్లో అసైన్డ్‌, బీడు భూములను కలిగి ఉన్న రైతులతో ఇటీవల రెవెన్యూ అధికారులు చర్చించారు. అధికారుల ప్రతిపాదనకు కొన్ని ప్రాంతాల్లో రైతులు అంగీకరించగా.. మరికొన్ని ప్రాంతాల్లో ఒప్పుకోవడం లేదు. 


జిన్నారం, పటాన్‌చెరులో సమావేశాలు

ఆయా భూముల సేకరణపై రెవెన్యూ అధికారులు జిన్నారం, పటాన్‌చెరు తదితర మండలాల రైతులతో సమావేశమయ్యారు. పారిశ్రామికంగా అబివృద్ధి చెందిన జిన్నారం మండలంలో భూములు ఇవ్వడానికి పలు డిమాండ్లతో రైతులు ముందుకు వచ్చారు. పటాన్‌చెరు మండలం ఐనోలు, కంది మండలం ఆరుట్లలో భూములు ఇవ్వడానికి వ్యతిరేకిస్తున్నారు. కంది మండలం ఆరుట్లలో మాత్రం రైతులు తమకు నలభై ఏళ్ల కిందట అప్పటి ప్రధాని, దివంగత ఇందిరాగాంధీ హాయాంలో ఇచ్చిన భూములను ఉపాధి కోసం వినియోగించుకుంటున్నామని స్పష్టం చేశారు.


400 గజాల స్థలం ఇవ్వాలని డిమాండ్‌

భూసేకరణకు అంగీకరించిన రైతులు ఎకరా భూమికి బదులుగా 400 చదరపు గజాల స్థలం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. జిన్నారం మండలం జంగంపేట పరిధిలోని 376 సర్వే నంబర్‌లోని 136 ఎకరాల అసైన్ట్‌ భూములను హెచ్‌ఎండిఏ లేఅవుట్‌ కోసం సేకరించాలని రెవెన్యూ అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. గ్రామ రైతులతో సమావేశమవగా, ఎకరా భూమికి 400 చ.గ. ప్లాటును కేటాయిస్తే భూములు ఇవ్వడానికి సిద్ధమని రైతులు స్పష్టం చేశారు. ఈ డిమాండ్‌కు అంగీకారం లభించే అవకాశమున్నట్టు తెలుస్తున్నది. మరోవైపు భూసేకరణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న రైతులతో కలిసి కాంగ్రెస్‌, సీఐటీయూ నాయకులు ఇటీవల ప్రతిపాదిత భూముల వద్ద ఆందోళన నిర్వహించారు. కాగా జిన్నారం ఒకటో సర్వే నంబర్‌లోని 120 ఎకరాల అసైన్డ్‌ భూములను 2020లో పరిశ్రమల ఏర్పాటు కోసం సేకరించాలని రెండేళ్ల క్రితం రెవెన్యూ  అధికారులు ప్రయత్నించారు. జంగంపేట అసైన్డ్‌భూముల స్వాధీనం సక్రమంగా జరిగితే జిన్నారం ఒకటో సర్వే నంబర్‌లోని భూములను హెచ్‌ఎండీఏ లేఆవుట్‌ కోసం సేకరించాలన్న యోచనలో అధికారవర్గాలున్నాయి. 


రైతులకు ప్రయోజనం

రెవెన్యూ అధికారుల కోరిక మేరకు అసైన్డ్‌ భూములను తిరిగి ఇచ్చిన రైతులకు కూడా ప్రయోజనం చేకూరనున్నది. ప్రభుత్వం కేటాయించిన అసైన్డ్‌ భూములను రైతులు అమ్ముకోవడం కుదరదు. కానీ హెచ్‌ఎండీఏ లేఅవుట్‌ కోసం ఇస్తే ఆర్థికంగా లబ్ధిపొందవచ్చు. జిన్నారం ప్రాంతంలో చ.గ. ప్లాటు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు ఉన్నది. అసైన్డ్‌ భూమికి బదులుగా పొందిన ప్లాటును అమ్ముకునే వీలుండటంతో రైతులు కోటీశ్వరులు కావచ్చని అధికారవర్గాలు తెలిపాయి. 

Updated Date - 2022-04-11T05:11:11+05:30 IST