చరిత్ర శిథిలం

ABN , First Publish Date - 2022-12-12T23:42:38+05:30 IST

చిన్నకోడూరు, డిసెంబరు 12: పురాతన కట్టడాలు నేటితరానికి గత శతాబ్దాల చరిత్రను తెలియజేస్తాయి.

చరిత్ర శిథిలం

ఉనికిని కోల్పోతున్న బురుజులు

చిన్నకోడూరు, డిసెంబరు 12: పురాతన కట్టడాలు నేటితరానికి గత శతాబ్దాల చరిత్రను తెలియజేస్తాయి. పూర్వం రాజులు గ్రామాల్లో బురుజులు నిర్మించి వాటిపై సైనికులను కాపలా పెట్టి, బురుజులలో యుద్ధ సామగ్రిని నిల్వ ఉంచి, కాపలా ఉంచేవారని చరిత్ర చెబుతుంది. అయితే చరిత్రకు ఆనవాళ్లుగా ఉండే బురుజులు నేడు శిథిలావస్థకు చేరుతున్నాయి. దీంతో చరిత్ర కనుమరుగయ్యే ప్రమాదం ఉన్నది. మండలంలోని చిన్నకోడూరు, అల్లీపూర్‌, ఇబ్రహీంనగర్‌, ఓబులాపూర్‌ గ్రామాల్లో ఎత్తైన బురుజులు ఉన్నాయి. వాటి నిర్మాణాలు పరిశీలిస్తే ఆకాశాన్ని తాకుతున్నట్లు అనిపిస్తాయి. పూర్వకాలంలో ఎలాంటి టెక్నాలజీ (మిషన్స్‌) లేనికాలంలో అంత ఎత్తుకు రాళ్లు ఎలా చేర్చారు, మనుషులతో కట్టబడినవేనా, ఎలా సాధ్యమైందో అనే ఆలోచన వస్తున్నది. ఆ కట్టడాలను చూస్తుంటే పూర్వీకుల పని నైపుణ్యం మనకు అర్థమవుతున్నది. బురుజుపై పేర్చిన రాళ్లను ఎత్తుకు చేర్చేందుకు ఏనుగులను ఉపయోగించేవారని పూర్వీకులు చెబుతుంటారు. అయితే బురుజులను పట్టించుకోకపోవడంతో రాళ్ల మధ్య నుంచి వాటిపై చెట్లు పెరిగి ఆ చెట్ల వేర్లు రాళ్లను, మట్టిని పెకిలించడంతో బీటలు వారి శిథిలావస్థకు చేరువయ్యాయి. దీంతో ఎప్పుడు బురుజు రాళ్లు, మట్టి కూలి ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం స్పందించి బురుజులను రక్షించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2022-12-12T23:42:38+05:30 IST

Read more