‘పీజీ’కి గ్రీన్‌సిగ్నల్‌

ABN , First Publish Date - 2022-10-12T04:49:57+05:30 IST

సిద్దిపేట ప్రభుత్వ కళాశాలకు అరుదైన గుర్తింపు లభించింది. వైద్యవిద్యకు సంబంధించిన పీజీ కోర్సులకు గ్రీన్‌సిగ్నల్‌ వచ్చింది.

‘పీజీ’కి గ్రీన్‌సిగ్నల్‌
జారీ అయిన ఉత్తర్వులు

సిద్దిపేట ప్రభుత్వ మెడికల్‌ కాలేజీకి గుర్తింపు

నాలుగేళ్లలోనే 48 పీజీ సీట్ల కేటాయింపు

తాజాగా ప్రసూతి, గైనకాలజీ విభాగంలో 9 సీట్లు

ఉత్తర్వులు జారీ చేసిన నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌


ఆంధ్రజ్యోతిప్రతినిధి, సిద్దిపేట,అక్టోబరు 11: సిద్దిపేట ప్రభుత్వ కళాశాలకు అరుదైన గుర్తింపు లభించింది. వైద్యవిద్యకు సంబంధించిన పీజీ కోర్సులకు గ్రీన్‌సిగ్నల్‌ వచ్చింది. ఇప్పటికే పలు విభాగాల్లో 48 పీజీ సీట్లను కేటాయించగా తాజాగా ప్రసూతి, గైనకాలజీకి సంబంధించి 9 పీజీ సీట్లను మంజూరు చేస్తూ నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

 సిద్దిపేట ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ప్రారంభమై నాలుగేళ్లు అవుతుంది. 100 సీట్లతో ప్రారంభమై నేడు 850 సీట్లకు చేరింది. ఇందులో ఎంబీబీఎస్‌ విద్య అభ్యసించేవారి సంఖ్య దాదాపు 675. త్వరలోనే ఐదో బ్యాచ్‌ విద్యార్థులు రాబోతున్నారు. మొత్తంగా 57 పీజీ సీట్లను కేటాయించారు. ఈ ఏడాది నుంచే పీజీ విద్యకు శ్రీకారం చుడుతున్నారు. ఎన్సాన్‌పల్లి శివారులో నిర్మించిన మెడికల్‌ కళాశాల ప్రస్తుతం ఒక హబ్‌ను తలపిస్తున్నది. తెలంగాణతో పాటు ఇతర రాష్ర్టాల నుంచి సైతం విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. ఈ కళాశాల ఆవరణలోనే 950 పడకలతో భారీ ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణమవుతున్నది. 

పీజీ కోర్సుల వివరాలు

కోర్సు                 సీట్లు

ఫార్మకోలాజీ 5

ఫిజియాలజీ         3

పాథాలజీ 4

మైక్రోబయాలజీ 3

ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ 4

కమ్యూనిటీ మెడిసిన్‌ 4

అనాటమీ 5

జనరల్‌ సర్జరీ 5

సైకియాట్రీ         5

ఆప్తమాలజీ         5

ఈఎన్‌టీ 5

ప్రసూతి, గైనకాలజీ 9

మొత్తం 57


ఎంత పెద్ద వైద్యమైనా ఇక్కడే

- హరీశ్‌రావు, వైద్యఆరోగ్యశాఖ మంత్రి

ఒకప్పుడు సాధారణ వైద్యానికి హైదరాబాద్‌కు వెళ్లేవారు. ప్రస్తుతం ఎంత పెద్దవైద్యమైనా ఇక్కడే ఉచితంగా చేసేలా అన్నిరకాల సదుపాయాలను సిద్దిపేటలో ఏర్పాటు చేసుకున్నాం. ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ఏర్పాటుతో వైద్యుల కొరత కూడా తీరబోతున్నది. ప్రతీ యేటా 175 మంది ఫైనలియర్‌ ఎంబీబీఎస్‌ విద్యార్థులు సిద్దిపేట ప్రభుత్వాసుపత్రిలో సేవలందిస్తారు. వీరితో పాటు పెద్ద వ్యాధులకు చికిత్స చేసే పీజీ వైద్యులు కూడా ఉంటారు. మెడికల్‌ కాలేజీతో వైద్యవిద్యతో పాటు ఈ ప్రాంత ప్రజలకు ఉచిత వైద్యానికి భరోసా లభించింది. 

Read more