ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు

ABN , First Publish Date - 2022-09-26T04:48:48+05:30 IST

మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబురాలు నిర్వహించారు.

ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు
మెదక్‌ కలెక్టరేట్‌లో బతుకమ్మ ఆడుతున్న మహిళా ఉద్యోగులు

మెదక్‌ అర్బన్‌/చిన్నశంకరంపేట/నారాయణఖేడ్‌/తూప్రాన్‌/శివ్వంపేట, సెప్టెంబరు 25: మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. తీరొక్క పూలతో పేర్చిన బతకమ్మను మహిళలు వీధుల్లో ఒక చోట పెట్టి బతుకమ్మ పాటలు పాడారు. అనంతరం గ్రామ శివార్లలో ఉన్న చెరువుల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. బతుకమ్మ సంబరాల్లో భాగంగా మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ కార్యక్రమాన్ని ఆదివారం మెదక్‌ కలెక్టరేట్‌ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం నుంచి అక్టోబరు  మూడు వరకు తొమ్మిది రోజుల పాటు కలెక్టరేట్‌లో నిర్వహించడానికి కలెక్టర్‌ వివిధ శాఖ అధికారులకు విధులను కేటాయించారు. ఈ మేరకు మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్‌ ఎంగిలిపూల బతుకమ్మ కార్యక్రమాన్ని జిల్లా సైన్స్‌ అధికారి, బతుకమ్మ సమన్వయాధికారి రాజిరెడ్డితో కలిసి కలెక్టరేట్‌ ఆవరణలో ఏర్పాటు చేశారు. ఇందులో స్వయం సహాయక సంఘం సభ్యులు, మహిళ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. సోమవారం డీఆర్డీవో ఆధ్వర్యంలో అటుకుల బతుకమ్మ కార్యక్రమంతో పాటు ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కాగా నారాయణఖేడ్‌లో  హంస ఆకారంలో పేర్చిన బతుకమ్మ ఆకట్టుకుంది. అలాగే తూప్రాన్‌  పట్టణంలో శనివారం రోజే బతుకమ్మ పండుగను ప్రారంభించగా, మరికొందరు ఆదివారం ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ప్రారంభించారు. తూప్రాన్‌లోని మహంకాళి ఆలయం వద్దగల ఆర్యవైశ్య సంఘ భవనంలో మహిళలు బతుకమ్మ ఆడారు. 

Updated Date - 2022-09-26T04:48:48+05:30 IST