అక్రమాలు కొండంత.. రికవరీ గోరంత!

ABN , First Publish Date - 2022-04-24T05:50:05+05:30 IST

మండలంలో ఉపాధిహామీ పనులపై సీఆర్డీ అధికారులు నిర్వహించిన సమాజిక తనిఖీలో భారీగా అవకతవకలు వెలుగుచూసినా.. కంటితుడుపు చర్యలతోనే సరిపెట్టడం విమర్శలకు దారితీస్తున్నది. అల్లాదుర్గం మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలో బుధవారం సామాజిక తనిఖీ ప్రజావేదికలో అనేక అక్రమాలు బహిర్గతమయ్యాయి. సీఆర్డీ అధికారులే నిధుల దుర్వినియోగంపై ముక్కున వేలేసుకున్నారు.

అక్రమాలు కొండంత.. రికవరీ గోరంత!

-ఉపాధిహామీ పనులు చేసిన అంగన్‌వాడీ సిబ్బంది

-ఒకేచోట మొక్కలకు నీళ్లు పోసినట్టు రెండు పంచాయతీల్లో రికార్డులు

-సీఆర్డీ అధికారుల తనిఖీల్లో బయటపడిన అక్రమాలు

- రూ. 69 వేల జరిమానా, రూ. 2.96 లక్షల రికవరీకి నిర్ణయం 

- ముగ్గురు సిబ్బందికి షోకాజ్‌ నోటీసులు ఇస్తాం : డీఆర్డీవో 


అల్లాదుర్గం, ఏప్రిల్‌ 23 : మండలంలో ఉపాధిహామీ పనులపై సీఆర్డీ అధికారులు నిర్వహించిన సమాజిక తనిఖీలో భారీగా అవకతవకలు వెలుగుచూసినా.. కంటితుడుపు చర్యలతోనే సరిపెట్టడం విమర్శలకు దారితీస్తున్నది. అల్లాదుర్గం మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలో బుధవారం సామాజిక తనిఖీ ప్రజావేదికలో అనేక అక్రమాలు బహిర్గతమయ్యాయి. సీఆర్డీ అధికారులే నిధుల దుర్వినియోగంపై ముక్కున వేలేసుకున్నారు. 

మండలంలోని రాంపూర్‌ గ్రామంలో అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు, ఆశా వర్కర్లు సైతం ఉపాధిహామీ పనుల్లో పాల్గొన్నట్టు అధికారుల తనిఖీల్లో వెల్లడి కావడం విస్మయానికి గురిచేసింది. అంగన్‌వాడీ కేంద్రాలు పనిచేసే సమయంలో సిబ్బంది ఉపాధి పనులు చేయడం ఏమిటరి సీఆర్డీ అధికారులే ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

మండలంలోని ఐబి గిరిజన తండా, గొల్లకుంట గిరిజన తండా సరిహద్దులోని అటవీ ప్రాంతంలో హరితహారం ద్వారా మొక్కలు నాటారు. ఈ మొక్కలకు నీళ్లు పోస్తున్నట్టు రెండు గ్రామ పంచాయతీల ఈజీఎస్‌ అధికారులు రికార్డుల్లో పేర్కొనడం చర్చనీయాంశమైంది. రెండు పంచాయతీల సిబ్బంది మొక్కలకు నీటిని పోసినట్టు ఎంబీ రికార్డుల్లో నమోదుచేసి నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్టు విచారణలో వెల్లడైంది. 

మండలంలో ఉపాధిహామీ ద్వారా చేపట్టిన పనులకు సంబంధించిన బోర్డుల ఏర్పాటులోనూ భారీగా నిధులు పక్కదారిపట్టినట్టు తెలుస్తున్నది. ఉపాధిహామీలో చేసన ప్రతీ పనికి సంబంధించిన పూర్తి వివరాలతో బోర్డులను ఏర్పాటు చేయాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. రికార్డుల్లో ఒక్కో బోర్డుకు రూ. 1,350 ఖర్చుచేసి, పంచాయతీల్లో చేపట్టిన ప్రతీ పనికి బోర్డులు ఏర్పాటు చేసినట్టు అధికారులు రికార్డుల్లో పేర్కొన్నారు. కానీ మండలంలోని 13 పంచాయతీల పరిధిలో ఎక్కడా ఉపాధి పనులకు సంబందించి బోర్డులు ఏర్పాటు చేయలేదు. ఇదేమిటని ప్రశ్నిస్తే బోర్డులు ఏర్పాటు చేశామని, ధ్వంసం కావడంతో కనిపించడం లేదని ఈజీఎస్‌ సిబ్బంది తెలియజేసినటు సీఆర్డీ అధికారులు సభ ఎదుట వెల్లడించారు. 

ఇలా పలు పంచాయతీల పరిధిలో ఉపాధిహామీ పనుల్లో భారీగా అక్రమాలు జరిగనట్టు సీఆర్డీ అధికారుల సభలో బయటపడింది. రూ. లక్షల్లో నిధులు పక్కదారి పట్టినట్టు తెలుస్తున్నది. కానీ అధికారులు మాత్రం నామమాత్రంగా జరిమానాలు విధించడం, షోకాజ్‌ నోటీసులతో సరిపెట్టడం అనుమానాలకు తావిస్తున్నదని విమర్శలు వస్తున్నాయి.


రూ. 2.96 లక్షలు రికవరీ!

ఈ విషయంపై డీఆర్డీవో శ్రీనివాస్‌ స్పందిస్తూ అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 2019 జనవరి 1 నుంచి 2022 జనవరి వరకు మండలంలో ఉపాధిహామీ ద్వారా 9.71 కోట్ల రూపాయలకు సంబంధించి వివిధ పనులను చేపట్టినట్టు ఆయన తెలిపారు. మూడేళ్లుగా మండలంలోని ఆయా గ్రామాల్లో నిర్వహించిన పనులకు సంబంధించి పక్షం రోజులు సామాజిక తనిఖీ నిర్వహించినట్టు పేర్కొన్నారు. పలు పనుల్లో అవకతవకలు జరిగనట్టు తేలిందని వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఏపీవో, టీఏ, కంప్యూటర్‌ ఆపరేటర్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తున్నామన్నారు. తదుపరి విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడిన వారి నుంచి రూ.2.96 లక్షల రూపాయలను రికవరీ చేస్తామని, అవకతవకలు జరగలేదని నిరూపించుకుంటే మినహాయింపు ఇస్తామని వివరించారు. ఈ అంశంపై ఇప్పటికే రూ. 69 వేలు జరిమానా విధించామని స్పష్టం చేశారు. 

Read more