ఎట్టకేలకు..గౌరవెల్లి రిజర్వాయర్‌ పనులకు లైన్‌క్లియరైనట్లే!

ABN , First Publish Date - 2022-12-10T00:08:12+05:30 IST

ఎట్టకేలకు గౌరవెల్లి రిజర్వాయర్‌ భూనిర్వాసితుల వివాదం సద్దుమణిగినట్లే కనిపిస్తోంది. పోలీసుల బందోబస్తు మధ్య రిజర్వాయర్‌ పనులను ప్రారంభించేందుకు అధికారులు శుక్రవారం ప్రయత్నించారు. మరోవైపు నిర్వాసితుల బైఠాయించగా వారితో జిల్లా అధికారి జరిపిన చర్చలు సఫలం కావడంతో చివరి దశ పనులకు లైన్‌క్లియర్‌ అయింది.

ఎట్టకేలకు..గౌరవెల్లి రిజర్వాయర్‌ పనులకు లైన్‌క్లియరైనట్లే!
గుడాటిపల్లి వద్ద గౌరవెల్లి ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తున్న ప్రాజెక్టు అధికారులు

పోలీసు బందోబస్తు మధ్య పనుల పునఃప్రారంభం

ప్రాజెక్టు కట్ట వద్ద బైఠాయించిన ముంపు బాధితులు

వారితో చర్చలు జరిపిన అదనపు కలెక్టర్‌ శ్రీనివా్‌సరెడ్డి

పరిహారం చెక్కులు తీసుకునేందుకు అంగీకారం

ప్రాజెక్టు పనులకు సహకరిస్తామన్న భూనిర్వాసితులు

అక్కన్నపేట, డిసెంబరు 9 : ఎట్టకేలకు గౌరవెల్లి రిజర్వాయర్‌ భూనిర్వాసితుల వివాదం సద్దుమణిగినట్లే కనిపిస్తోంది. పోలీసుల బందోబస్తు మధ్య రిజర్వాయర్‌ పనులను ప్రారంభించేందుకు అధికారులు శుక్రవారం ప్రయత్నించారు. మరోవైపు నిర్వాసితుల బైఠాయించగా వారితో జిల్లా అధికారి జరిపిన చర్చలు సఫలం కావడంతో చివరి దశ పనులకు లైన్‌క్లియర్‌ అయింది. తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చి పరిహారం డబ్బు త్వరగా అందజేయాలని, ప్రాజెక్టు పనులకు సహకరిస్తామని భూనిర్వాసితులు తెలిపారు.

అక్కన్నపేట మండలం గుడాటిపల్లి వద్ద నిర్మిస్తున్న గౌరవెల్లి ప్రాజెక్టు పనులను పోలీసుల బందోబస్తు మధ్య అధికారులు శుక్రవారం సాయంత్రం పునఃప్రారంభించారు. గతంలో రెండుసార్లు ప్రాజెక్టు పనులను చేసేందుకు అధికారులు, కాంట్రాక్టర్‌ ప్రయత్నించగా భూనిర్వాసితులు పనులను అడ్డుకున్న విషయం తెలిసిందే. ప్రాజెక్టు కట్ట వద్ద దీక్షా శిబిరం ఏర్పాటు చేసుకుని పోరాటం చేశారు. ప్రాజెక్టు అధికారుల పనులను అడ్డుకున్నారన్న కారణంతో అర్ధరాత్రి గుడాటిపల్లిలో పోలీసులు ప్రవేశించి నిర్వాసితులను లాక్కెందుకు ప్రయత్నించగా పోలీసులకు, నిర్వాసితుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణామాలతో లాఠీచార్జి చేయడం, తోపులాటలో భూ నిర్వాసితులు, పోలీసులు గాయపడడంతో రణరంగంగా మారింది. ఈ ఘటనకు కారకులైన 17 మంది భూ నిర్వాసితులపై కేసులు నమోదు కాగా నలుగురిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. వారు 40 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించి బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో చివరి దశలో ఉన్న రిజర్వాయర్‌ పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. మళ్లీ ఇప్పుడు ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తే అడ్డుకుంటారని ముందస్తుగా 500 మందితో పోలీస్‌ బందోబస్తును ఏర్పాటు చేశారు. హుస్నాబాద్‌ ఏసీపీ వాసాల సతీష్‌, సీఐ ఎర్రల కిరణ్‌ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నలుగురు సీఐలు, ఆరుగురి ఎస్‌ఐలు, 500 మందితో భారీ పోలీసు బందోబస్తును నిర్వహించారు. ప్రాజెక్టు కట్ట మూసివేత పనులు ఓవైపు ప్రారంభించడానికి అధికారులు ఏర్పాటు చేస్తుంటే, మరోవైపు రామవరం వెళ్లే రహదారి వద్దకు భూ నిర్వాసితులు భారీగా తరలివచ్చి అక్కడే బైఠాయించారు. అదనపు కలెక్టర్‌ శ్రీనివా్‌సరెడ్డి హుస్నాబాద్‌ ఆర్డీవో కార్యాలయంలో మకాం వేసి పదిమంది నిర్వాసితులను పిలిపించుకుని చర్చలు జరిపారు. నిర్వాసితులకు రావలసిన పరిహారం డబ్బుతో పాటు, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం కోసం రూ.3 లక్షల చొప్పున చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని వారికి వివరించారు. అనంతరం భూనిర్వాసితులు తిరిగి వచ్చి రామవరం వెళ్లే రహదారిలో కట్ట దగ్గర ఉన్న మిగతా ముంపు బాధితులకు అదనపు కలెక్టర్‌ చెప్పిన విషయాలను వివరించారు. ఈ సందర్బంగా భూ నిర్వాసితులు మాట్లాడుతూ ప్రాజెక్టు పనులకు పూర్తిస్థాయిలో సహకరిస్తామన్నారు. తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చి పరిహారం డబ్బు త్వరగా అందజేయాలని కోరుతున్నారు. కాగా కొంతమంది భూనిర్వాసితులు ముందుకు వచ్చి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీకి సంబంధించిన రూ.6 లక్షల చెక్కులను ఆర్డీవో కార్యాలయంలో తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మిగతా వారు కూడా చెక్కులు తీసుకునేందుకు వస్తామని అధికారులకు చెప్పినట్లు సమాచారం. మరోవైపు ప్రాజెక్టు పనుల ప్రారంభానికి ఎలాంటి అవరోధాలు ఎదురు కాకపోవడంతో పోలీసులు,అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

పునరావాస ప్యాకేజీ చెక్కులను తీసుకోవాలి

హుస్నాబాద్‌రూరల్‌ : రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న గౌరవెల్లి ప్రాజెక్టు పునరావాస చెక్కులను తీసుకునేందుకు ముందుకు రావాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ భూనిర్వాసితులకు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. శుక్రవారం నుంచి ప్రభుత్వం నిర్ణయించిన పునరావాస ప్యాకేజీ చెక్కులను పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. మొదటి రోజున 15 మంది నిర్వాసితులు పునరావాస ప్యాకేజీ చెక్కులు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. వెనుకబడిన హుస్నాబాద్‌ ప్రాంత పరిసరాలలో లక్ష ఎకరాల భూములను సస్యశ్యామలం చేస్తూ సుమారు 50 వేల మంది రైతులకు లబ్ధిచేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా గౌరవెల్లి రిజర్వాయర్‌ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టిందని గుర్తుచేశారు. భూ నిర్వాసితులకు హుస్నాబాద్‌ ఆర్డీవో కార్యాలయంలో పునరావాస ప్యాకేజీ చెక్కులను అందజేస్తున్నామని తెలియజేశారు. రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య మంత్రి హరీశ్‌రావు, హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితెల సతీ్‌షకుమార్‌ భూనిర్వాసితులకు అండగా నిలిచి న్యాయం చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. గతంలో మంత్రి హరీశ్‌రావు భూనిర్వాసితులకు ఇచ్చిన హామీ మేరకు అందరికీ న్యాయం జరిగేలా జిల్లా అధికార యంత్రాంగం ద్వారా చెక్కులను సిద్థం చేసి పంపిణీ చేయిస్తున్నామని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఇంకా చెక్కులు పొందని ముంపు బాధితులు సోమవారం హుస్నాబాద్‌ ఆర్డీవో కార్యాలయానికి వచ్చి తమకు సంబంధించిన ప్యాకేజీ చెక్కులు తీసుకుని ప్రభుత్వానికి సహకరించాలని కలెక్టర్‌ కోరారు.

చెక్కులు తీసుకోవడానికి ముందుకు రావడం హర్షణీయం

హుస్నాబాద్‌ : గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులు చెక్కులను తీసుకోవడానికి ముందుకు రావడం హర్షణీయమని జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ రాయిరెడ్డి రాజారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించిన 20మంది భూనిర్వాసితులు ఆర్డీవో కార్యాలయంలో నష్టపరిహారం చెక్కులు అదనపు కలెక్టర్‌ శ్రీనివా్‌సరెడ్డి చేతుల మీదుగా అందుకున్నారని తెలిపారు. మిగతా రైతులు కూడా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నేరుగా అధికారుల వద్దకు వచ్చి చెక్కులను తీసుకోవాలని ఆయన కోరారు. ఎమ్మెల్యే సతీ్‌షకుమార్‌ నిర్వాసితులను అన్నిరకాల ఆదుకోవడానికి ఇప్పటికే స్పష్టమైన హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అందరూ కలసి వచ్చి పరిహారం చెక్కులు తీసుకుంటే త్వరగా పనులు పూర్తయి ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంత రైతులు ఎదురుచూస్తు గోదావరి జలాల కళ నెరవేరుతుందన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు ద్వారా సాగు, తాగునీరుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులు సుఖసంతోషాలతో జీవించే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.

Updated Date - 2022-12-10T00:08:13+05:30 IST