ఆరిపోతున్న సోలార్‌ లైట్లు.. నేలకొరిగిన స్తంభాలు

ABN , First Publish Date - 2022-06-08T04:59:48+05:30 IST

మండలంలో మల్కాపూర్‌కు పోటీగా ఎదుగుతున్న కోనాయపల్లి పీబీ గ్రామం లో నాలుగేళ్ల క్రితం ఏర్పాటు చేసిన సోలార్‌ వీధిలైట్ల వ్యవస్థ నిర్వహణ లోపంతో మినుకు మినుకుమంటోంది.

ఆరిపోతున్న సోలార్‌ లైట్లు.. నేలకొరిగిన స్తంభాలు
కోనాయపల్లిపీబీలో రోడ్డుపక్కన విరిగి కిందపడ్డ సోలార్‌ విద్యుత్‌ స్తంభం

కోనాయపల్లి పీబీ గ్రామంలో వీధిలైట్ల పరిస్థితి

పల్లెప్రగతిలోనైనా బాగుపడేనా?

తూప్రాన్‌రూరల్‌, జూన్‌ 7: మండలంలో మల్కాపూర్‌కు పోటీగా ఎదుగుతున్న కోనాయపల్లి పీబీ గ్రామం లో నాలుగేళ్ల క్రితం ఏర్పాటు చేసిన సోలార్‌ వీధిలైట్ల వ్యవస్థ నిర్వహణ లోపంతో మినుకు మినుకుమంటోంది. రోడ్డుకు ఇరువైపులా 30 సోలార్‌ స్తంభాలు అమర్చగా అందులో సగం కూడా పనిచేయడం లేదు. బ్యాటరీలు పాడై, సూర్య కిరణాలను ఆకర్షించే సోలార్‌ ప్లేట్లు పగిలిపోయి, చాలా వరకు స్తంభాలు నేలకు వంగిపోయి రోడ్డు వెంట రాత్రిపూట చీకట్లు అలుముకుంటున్నాయి. మల్కాపూర్‌లోని గిరిజన తండాలో ఏర్పాటు చేసిన సోలార్‌లైట్ల పరిస్థితి కూడా అలాగే తయారైంది. ఇదివరకు ప్రభుత్వం పల్లెల బాగుకోసం నాలుగు విడతలుగా పల్లెప్రగతి కార్యక్రమాలు నిర్వహించినా ఈ గ్రామాల్లో వీధిలైట్ల వ్యవస్థ మాత్రం బాగుపడలేదు. లైట్లను వెలిగించే దిక్కులేకుండా పోయింది. కొత్త పంచాయతీలు ఏర్పడక ముందు మల్కాపూర్‌ పంచాయతీకి ప్రభుత్వం ఉచితంగా 120 సోలార్‌ లైట్ల ను సరఫరా చేసింది. ఇందులో కోనాయపల్లికి సుమారు 30 లైట్లను కేటాయించారు. ఆర్నెళ్ల పాటు బాగానే పనిచేసిన సోలార్‌ లైట్లు పలు సమస్యలతో నిరుపయోగంగా మారాయి. ఇప్పుడు కోనాయపల్లిలో  రోడ్డు వెంట పది లైట్లు కూడా సరిగా వెలగడం లేదు. పంచాయతీ వారు కనీసం బ్యాటరీలను చార్జింగ్‌ చేయించలేకపోతున్నారు. స్తంభాలు నేలకొరిగి నెలలు గడుస్తున్నా వాటిని పైకెత్తి సరిచేసేవారు లేరు. కనీసం ఐదో విడత పల్లెప్రగతిలోనైనా  అధికారులు స్పందించి మూలకు పడ్డ సోలార్‌ విద్యుత్‌ లైట్ల వ్యవస్థను చక్కదిద్దే చర్యలు తీసుకోవాలని కోనాయపల్లి గ్రామస్థులు కోరుతున్నారు.


Read more