నిమ్జ్‌ పర్యావరణ అనుమతులపై వివరణ ఇవ్వండి

ABN , First Publish Date - 2022-08-18T05:04:52+05:30 IST

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ నియోజకవర్గంలోని న్యాల్‌కల్‌, ఝరాసంగం మండలాల్లో గల 14 గ్రామాల పరిధిలో ఏర్పాటు కానున్న జాతీయ పెట్టుబడుల ఉత్పాదకమండలి (నిమ్జ్‌) ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి.

నిమ్జ్‌ పర్యావరణ అనుమతులపై వివరణ ఇవ్వండి
నిమ్జ్‌ ప్రాజెక్టు ఏర్పాటు చేయనున్న ప్రాంతం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జాతీయహరిత ట్రిబ్యునల్‌ నోటీసులు జారీ

నిమ్జ్‌ పర్యావరణ అనుమతులపై రైతుల అభ్యంతరాలు


జహీరాబాద్‌, ఆగస్టు 17: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ నియోజకవర్గంలోని న్యాల్‌కల్‌, ఝరాసంగం మండలాల్లో గల 14 గ్రామాల పరిధిలో ఏర్పాటు కానున్న జాతీయ పెట్టుబడుల ఉత్పాదకమండలి (నిమ్జ్‌) ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. అందులో భాగంగానే మొదటి విడత ఇప్పటి వరకు 3వేల ఎకరాల భూసేకరణ చేపట్టారు. ప్రస్తుతం రెండో విడత భూసేకరణకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే నిమ్జ్‌ ఏర్పాటుకు కొన్నినెలల క్రితం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోగా వారి దరఖాస్తులు స్వీకరించిన కేంద్ర పర్యావరణశాఖ నిమ్జ్‌ ఏర్పాటుకు పర్యావరణ అనుమతులను జారీ చేసింది. ఆ అనుమతులను సవాలు చేస్తూ 12,650 ఎకరాల్లో నిమ్జ్‌ ఏర్పాటు ప్రతిపాదించడాన్ని సవాల్‌ చేస్తూ న్యాల్‌కల్‌ మండలం హద్నుర్‌ గ్రామానికి చెందిన గణపతి దీక్షిత్‌తో పాటు పలువురు రైతులు ఆ అనుమతులను రద్దు చేయాలని కోరుతూ జూన్‌లో కేంద్ర హరిత ట్రిబ్యునల్‌లో పిటిషన్‌ దాఖలు చేశారు. రైతులు దాఖలు చేసిన పిటిషన్‌ స్వీకరించిన ధర్మాసనం జస్టిస్‌ పుష్ప సత్యనారాయణ, కె.సత్యగోపాల్‌ నేతృత్వంలోని బెంచ్‌ విచారణ చేపట్టింది. అయితే రైతుల వివరణ తెలుసుకున్న కేంద్ర హరిత ట్రిబ్యునల్‌ నిమ్జ్‌ ప్రాజెక్టు ఏర్పాటు కోసం పర్యావరణ అనుమతులు ఇవ్వడంపై నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని జాతీయ హరిత ట్రిబ్యునల్‌ చెన్నై బెంచ్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.

Read more