సాంకేతికత ఫలాలు పేదలకు చేర్చేలా ప్రయోగాలు

ABN , First Publish Date - 2022-12-09T23:53:58+05:30 IST

శాస్త్ర సాంకేతిక ఫలాలు పేదలకు చేరేలా విద్యార్థులు సైన్స్‌ ప్రయోగాలు రూపొందించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి సూచించారు. విద్యార్థులు బాగా చదివి మంచిపౌరులుగా ఎదగాలన్నారు.

సాంకేతికత ఫలాలు పేదలకు చేర్చేలా ప్రయోగాలు
రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులతో ఎమ్మెల్సీ, అదనపు కలెక్టర్‌, డీఈవో తదితరులు

కష్టపడి చదివి ఉత్తమ పౌరులుగా ఎదగాలి

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి

సంగారెడ్డిలో ముగిసిన ఇన్‌స్పైర్‌ ప్రదర్శన

సంగారెడ్డి అర్బన్‌, డిసెంబరు 9: శాస్త్ర సాంకేతిక ఫలాలు పేదలకు చేరేలా విద్యార్థులు సైన్స్‌ ప్రయోగాలు రూపొందించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి సూచించారు. విద్యార్థులు బాగా చదివి మంచిపౌరులుగా ఎదగాలన్నారు. సంగారెడ్డి శాంతినగర్‌ సెయింట్‌ ఆంథోనిస్‌ హైస్కూల్‌లో మూడు రోజుల పాటు జరిగిన జిల్లాస్థాయి ఇన్‌స్పైర్‌, జవహర్‌లాల్‌నెహ్రూ జాతీయ వైజ్ఞానిక గణిత, పర్యావరణ ప్రదర్శన కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి కుటుంబంలో నెలకొన్న ఇబ్బందులను తొలగించాలని కోరారు. సైన్స్‌ ప్రయోగాల్లో సెన్సార్‌ వినియోగం పెరిగిందన్నారు. చదువుకు పేదరికం అడ్డురాదన్న అంబేడ్కర్‌ను గుర్తుచేశారు. సంగారెడ్డి జిల్లాకు మొబైల్‌ సైన్స్‌ ల్యాబ్‌ వ్యాన్‌ కోసం ఎమ్మెల్సీ గ్రాంట్‌ నుంచి నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. అడిషనల్‌ కలెక్టర్‌ రాజర్షిషా మాట్లాడుతూ విద్యార్థులు టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని సూచించారు. రాష్ట్రస్థాయికి ఎంపిక కాని ఎగ్జిబిట్‌ విద్యార్థులు నిరాశ చెందకుండా వచ్చే ఏడాది కృషి చేయాలన్నారు. డీఈవో నాంపల్లి రాజేశ్‌ మాట్లాడుతూ విద్యార్థులు తమ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని మున్ముందు మరింత మెరుగ్గా ఎగ్జిబిట్లను రూపొందించాలని సూచించారు. మేదస్సుకు పదునుపెట్టి అధ్బుతంగా ఎగ్జిబిట్‌ ప్రదర్శించిన మునిపల్లి మండలం కంకోల్‌ జడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన దివ్యాంగ విద్యార్థి మఽధుకుమార్‌ను డీఈవో రాజేశ్‌ అభినందించారు. ఇన్‌స్పైర్‌ మానక్‌ నుంచి 8, ప్రాథమికోన్నత పాఠశాల స్థాయి నుంచి 7, హైస్కూల్‌ లెవల్‌ నుంచి 7, ఉపాఽధ్యాయ విభాగం నుంచి 1, మొత్తం-23 ఎగ్జిబిట్లు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాయి. ఈ సందర్భంగా విద్యార్థులతో పాటు గైడ్‌ టీచర్లకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. అంతకుముందు నిర్వహించిన సాంస్కృతిక పదర్శనలు అలరించాయి. అద్భుతంగా పాట పాడి, నృత్యం చేసిన విద్యార్థిని సహస్రకు ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి రూ.2వేల ప్రోత్సాహక నగదు అందజేశారు. కార్యక్రమంలో ఏడీ విజయ, డీసీఈవో సెక్రటరీ లింబాజీ, సీనియర్‌ హెచ్‌ఎం విశ్వనాథంగుప్తా, ఎంఈవో వెంకటనర్సింహులు, ఆంథోని హైస్కూల్‌ ప్రిన్సిపాల్‌ కరుణాకర్‌రెడ్డి, జిల్లా సైన్స్‌ అధికారి విజయ్‌కుమార్‌, నిర్వహణ పూర్ణకృష్ణ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, విద్యార్థులు, గైడ్‌ టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-09T23:53:59+05:30 IST