విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలి

ABN , First Publish Date - 2022-09-14T05:06:07+05:30 IST

ప్రభుత్వ పాఠశాలలను గాడిలో పెట్టి విద్యాప్రమాణాలను మెరుగుపర్చాలని మండల సర్వసభ్య సమావేశంలో సభ్యులు డిమాండ్‌ చేశారు.

విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలి

  సర్వసభ్య సమావేశంలో సభ్యుల డిమాండ్‌


వట్‌పల్లి, సెప్టెంబరు 13: ప్రభుత్వ పాఠశాలలను గాడిలో పెట్టి విద్యాప్రమాణాలను మెరుగుపర్చాలని మండల సర్వసభ్య సమావేశంలో సభ్యులు డిమాండ్‌ చేశారు. మంగళవారం వట్‌పల్లి మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ పత్రి కృష్ణవేణి అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో సభ్యులు మాట్లాడుతూ.. మండలంలోని పోతులబొడుగ ఆదర్శపాఠశాలలో ఉపాధ్యాయుల నిర్లక్ష్య వైఖరితో విద్యార్థులు గాడి తప్పుతున్నారని చెప్పారు. ఉన్నత స్థాయి అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారే ప్రమాదం ఉందన్నారు. మండల సర్వసభ్య సమావేశానికి విద్యాశాఖ అధికారులు గైర్హాజరు కావడమే ఇందుకు నిదర్శనమన్నారు. దేవునూర్‌ వసతి గృహం వార్డెన్‌ పనితీరు బాగలేదని, వార్డెన్‌పై అధికారులు విచారణ జరపాలని కోరారు. ఉపాధి కూలీలకు కూలీ డబ్బులు చెల్లించాలని కోరారు. నూతనంగా గ్రామ పంచాయతీలకు సరిహద్దులు కేటాయించాలని కోరారు. తహసీల్దార్‌ ప్రభులు మాట్లాడుతూ.. సరిహద్దుల కేటాయింపు తమ పరిధిలోనిది కాదని, కలెక్టరేట్‌లోని సర్వే విభాగంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో జడ్పీటీసీ పత్రి అపర్ణ, ఎంపీపీ ఉపాధ్యక్షురాలు నాగరాణిభస్వరాజ్‌, ఎంపీడీవో మల్లికార్జున్‌, ఎంపీవో యూసుఫ్‌, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.


 

Updated Date - 2022-09-14T05:06:07+05:30 IST