చెప్పింది 1,061.. సిద్ధం చేసింది 776

ABN , First Publish Date - 2022-12-13T00:17:22+05:30 IST

చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి అన్నట్లుగా ఉంది ప్రభుత్వం తీరు. మెదక్‌ జిల్లాలో జనవరి 15 నాటికి చివరి దశలో ఉన్న 1,061 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు పంపిణీ చేస్తామని ప్రకటించిన అధికారులు ఇప్పుడు వాటిని 776కు కుదించారు.

చెప్పింది 1,061.. సిద్ధం చేసింది 776

ఇళ్ల పంపిణీపై మాట మార్చిన మెదక్‌ జిల్లా అధికారులు

జనవరి 15 నాటికి వెయ్యికి పైగా ఇళ్లు పంపిణీ చేస్తామని ప్రకటన

గడువు సమీపిస్తుండగా 285 కోత

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్‌, డిసెంబరు 12 : చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి అన్నట్లుగా ఉంది ప్రభుత్వం తీరు. మెదక్‌ జిల్లాలో జనవరి 15 నాటికి చివరి దశలో ఉన్న 1,061 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు పంపిణీ చేస్తామని ప్రకటించిన అధికారులు ఇప్పుడు వాటిని 776కు కుదించారు. జిల్లాలో దాదాపు పూర్తికావచ్చిన ఇళ్లలో పెండింగ్‌ పనులు పూర్తిచేసి సిద్ధం చేయాలని మంత్రి హరీశ్‌రావు గతంలో అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు హడావుడిగా పనులు చేపట్టారు. కానీ వెయ్యికి పైగా ఇళ్లను పంపిణీకి సిద్ధం చేస్తామని ప్రకటించారు. తీరా గడువు సమీపిస్తున్న క్రమంలో మాట మార్చారు. ప్రకటించిన వాటిలో 300 ఇళ్లకు కోత పెట్టారు. దీంతో ఈసారి కూడా పేదలకు నిరాశే మిగిలింది.

3,644 ఇళ్లకు పరిపాలనా అనుమతులు

మెదక్‌ జిల్లాకు ఆరేళ్ల క్రితం 5,254 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను మంజూరు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 3,644 ఇళ్లకు మాత్రమే పరిపాలన పరమైన అనుమతి లభించింది. వీటికి టెండర్లు పూర్తిచేసిన అధికారులు పనులను ప్రారంభించారు. ఇందులోనూ 2,420 ఇళ్లు మాత్రమే పనులు చివరి దశకు చేరుకున్నాయి. 1,224 ఇళ్లు వివిధ దశల్లో నిలిచిపోయాయి. నిధుల సమస్యల కారణంగా ఏళ్ల తరబడిగా పనులు ఆగుతూ సాగుతున్నాయి. ఇటీవల మంత్రి హరీశ్‌రావు జిల్లాలో ఇళ్ల నిర్మాణంపై అధికారులతో సమీక్షించి, పనులు చివరి దశలో ఉన్న ఇళ్లను పూర్తిచేసి పంపిణీకి సిద్ధం చేయాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో ఈ నెల 5న అదనపు కలెక్టర్‌ రమేశ్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యుత్‌, తాగునీరు, మురుగు కాలువలు, అప్రోచ్‌ రోడ్ల నిర్మాణం వంటి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. దీంతో అధికారులు కార్యాచరణ ప్రారంభించారు. జనవరి 15 నాటికి 1,061 ఇళ్లను పంపిణీకి సిద్ధం చేస్తామని ప్రకటించారు. కానీ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం అధికారులు చెప్పిన దాంట్లోనే కోత పెట్టారు. 776 డబుల్‌బెడ్‌రూం ఇళ్లను మరో నెల రోజుల్లో పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. 10 మండలాల పరిధిలో చివరి దశలో ఉన్న ఇళ్లలో పనులు పూర్తి చేయించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. మొదట ప్రకటించిన వాటిలో 285 ఇళ్ల పనులు ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేకపోవడంతో వాటిని పంపిణీ చేయడం లేదు.

ఈసారీ నిరాశే..

జిల్లాలో వేల సంఖ్యలో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఎక్కడా పూర్తిస్థాయిలో నిర్మించిన దాఖలాలు లేవు. నిధుల కొరత కారణంగా ఇళ్ల నిర్మాణ పనులు నిలిచిపోయాయి. కొన్నిచోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నా మౌలిక వసతులు కల్పించలేదు. ఇటీవల మెదక్‌, తూప్రాన్‌, పాపన్నపేట పరిధిలో ఇళ్లను పంపిణీ చేశారు. వీటి సంఖ్య మంజూరైన వాటిలో మూడో వంతు కూడా దాటదు. మిగిలిన ఇళ్ల సంగతేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జిల్లాకు మంజూరైన ఇళ్లన్నీ పూరిచేస్తేనే అర్హులైన పేదలకు న్యాయం జరుగుతుందని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

జనవరి 15 నాటికి సిద్ధం : సత్యారెడ్డి, పంచాయతీరాజ్‌ ఈఈ

జిల్లాలో జనవరి 15న పంపిణీకి 776 ఇళ్లను సిద్ధం చేస్తున్నాం. ఈ ఇళ్లలో మౌలిక సదుపాయాల పనులు చేస్తున్నాం. జిల్లాకు ప్రభుత్వం మొత్తం 5,254 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు మంజూరు చేసింది. ఇందులో 3,644 ఇళ్లకు పరిపాలనా మంజూరు వచ్చింది. మరో నెల రోజుల్లో పంపిణీ చేసేవాటితో కలిపి 2,420 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాయి. ఇంకా 1,224 ఇళ్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి.

Updated Date - 2022-12-13T00:17:24+05:30 IST