మార్కెట్లలో దసరా సందడి

ABN , First Publish Date - 2022-10-05T04:50:10+05:30 IST

జిల్లావ్యాప్తంగా పట్టణాలు, మండల కేంద్రాల్లో మంగళవారం దసరా సందడి నెలకొన్నది. షాపింగ్‌మాల్‌లు, పూలు, పండ్లు, గుమ్మడికాయలు దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి.

మార్కెట్లలో దసరా సందడి
సంగారెడ్డిలో వెలసిన పూల దుకాణాలు

కిటకిటలాడిన షాపింగ్‌మాల్‌లు, వస్త్ర దుకాణాలు 

ఆకాశాన్నంటిన పూలు, గుమ్మడికాయలు, పూజా సామగ్రి ధరలు


సంగారెడ్డి రూరల్‌, అక్టోబరు 4: జిల్లావ్యాప్తంగా పట్టణాలు, మండల కేంద్రాల్లో మంగళవారం దసరా సందడి నెలకొన్నది. షాపింగ్‌మాల్‌లు, పూలు, పండ్లు, గుమ్మడికాయలు దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. జిల్లాకేంద్రమైన సంగారెడ్డిలో పాతబస్టాండ్‌ నుంచి కొత్త బస్టాండ్‌, పోతిరెడ్డిపల్లి చౌరస్తా వరకు రోడ్డుకు ఇరువైపులా పూలు, గుమ్మడికాయల దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారు. పండుగ నేపథ్యంలో రేట్లు విపరీతంగా పెంచేశారు. సాధారణ రోజుల్లో బంతి పూలు కిలో రూ.60 నుంచి రూ.80 ధర పలుకుతాయి. ప్రస్తుతం బంతిపూలు కిలో రూ. 120 వరకు విక్రయిస్తున్నారు. మామూలు రోజుల్లో చామంతి కిలో రూ.400 కాగా.. రూ.600కు విక్రయించారు. సాధారణ రోజుల్లో రూ. 75 పలికే గుమ్మడికాయలను రూ.120కి విక్రయిస్తున్నారు. తప్పనిసరి కావడంతో ధరలు పెంచినా వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు.

అంబేడ్కర్‌ మైదానంలో..

దసరా నేపథ్యంలో సంగారెడ్డి పట్టణంలోని బీఆర్‌ అంబేడ్కర్‌ స్టేడియంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు, రావణ దహనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం శివకాశి నుంచి పటాకుల నిపుణులను పిలిపించి 33 అడుగుల రావాణాసురుడి విగ్రహాన్ని తయారు చేయించారు. గ్రౌండ్‌ నలుమూలలా విద్యుద్దీపాలను ఏర్పాటు చేశారు. ప్రజలు కూర్చునేందుకు కుర్చీలు ఏర్పాటు చేశారు. పాత బస్టాండ్‌ వద్ద ఉన్న రామమందిరం నుంచి పల్లకీసేవ ఊరేగింపుగా బయలుదేరి అంబేడ్కర్‌ మైదానానికి చేరుకుంటుంది. సీతారాములు, లక్ష్మణ, హనుమంత, భరత, శత్రుజ్ఞల వేశధారణలో కళాకారులు ఊరేగింపులో పాల్గొంటారు. అనంతరం ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాలపిట్టను వదిలి దసరా వేడుకలను ప్రారంభించనున్నారు. పండుగ నేపథ్యంలో పట్టణంలో పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుంచి పాత బస్టాండ్‌ వరకు ప్రధాన రహదారి వెంట, ప్రధాన కూడళ్లలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి, హ్యాండ్లూమ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ చింతా ప్రభాకర్‌ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.


మెదక్‌లో ఉత్సవాలకు సర్వం సిద్ధం

మెదక్‌ అర్బన్‌, అక్టోబరు 4: దసరా పండుగకు పట్టణాలు, పల్లెలు ముస్తాబయ్యాయి. మెదక్‌ జిల్లావ్యాప్తంగా వేడుకలు వెభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. పండుగ సామగ్రి, కొత్తబట్టలు కొనుగోలు చేసేందుకు వినియోగదారులు తరలిరావడంతో మార్కెట్లలో రద్దీ నెలకొంది. ఆలయాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. నేడు తెల్లవారుజాము నుంచే భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ఇందుకు తగినట్టు ఏర్పాట్లు చేశారు. విజయదశమి సందర్భంగా పెద్ద సంఖ్యలో వాహన పూజలు నిర్వహించేందుకు అన్నీ సిద్ధం చేశారు. మెదక్‌ జిల్లా కేంద్రంలో దసరా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జూనియర్‌ కళాశాల మైదానంలో వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు, రావణ దహనం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. వేడుకలకు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో పాటు ప్రముఖులు హాజరుకానున్నారు. ప్రధాన కూడళ్ల వద్ద స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు.  దసరా సందర్భంగా ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభా్‌షరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌ రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌, టీపీసీసీ ప్రతినిఽధి మ్యాడం బాలకృష్ణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్‌ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అయిన విజయదశమిని జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

Read more