ఫార్మా ముసుగులో దందా

ABN , First Publish Date - 2022-03-23T05:38:35+05:30 IST

ఫార్మా ముసుగులో అక్రమార్కులు చీకటి వ్యాపారం నిర్వహిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల పారిశ్రామికవాడల్లోని కొన్ని పరిశ్రమలు నిషేధిత డ్రగ్స్‌ తయారీ, అనుమతి లేకుండా ఇతర దేశాలకు మందుల ఎగుమతి చేపడుతున్నాయి. సులభంగా డబ్బు సంపాదనే లక్ష్యంగా అక్రమాలకు పాల్పడుతున్నారు

ఫార్మా ముసుగులో దందా
ట్రామాడాల్‌ను అక్రమంగా ఎగుమతి చేసిన పరిశ్రమ

అక్రమంగా ఎగుమతులు, డ్రగ్స్‌ తయారీ

మత్తు పదార్థాలు, అనుమతిలేని  ఉత్పాదక కేంద్రాలుగా జిన్నారం పారిశ్రామికవాడలు

మూతపడిన పరిశ్రమల్లో అక్రమార్కుల కార్యకలాపాలు

సులభంగా డబ్బు సంపాదనే లక్ష్యంగా చీకటి వ్యాపారం

లూసెంట్‌ పరిశ్రమ నుంచి అనుమతి లేకుండా పాకిస్థాన్‌కు ట్రమాడాల్‌ ఎగుమతి


 జిన్నారం మార్చి 22 : ఫార్మా  ముసుగులో  అక్రమార్కులు చీకటి వ్యాపారం నిర్వహిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల పారిశ్రామికవాడల్లోని కొన్ని పరిశ్రమలు నిషేధిత డ్రగ్స్‌ తయారీ, అనుమతి లేకుండా ఇతర దేశాలకు మందుల ఎగుమతి చేపడుతున్నాయి. సులభంగా డబ్బు సంపాదనే లక్ష్యంగా అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఓ పరిశ్రమ అనుమతి లేకుండా పాకిస్థాన్‌కు డ్రగ్‌ను ఎగుమతి చేసినట్లు నార్కోటిక్స్‌ కంట్రోట్‌ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు గుర్తించారు.  ఈ తరహా వ్యాపారాలు ఇక్కడ నిత్యకృత్యమవుతున్నాయి. 


మూతపడిన పరిశ్రమలే అడ్డాలు!

నగర శివారు ప్రాంతమైన పటాన్‌చెరు నియోజకవర్గం రాష్ట్రంలోనే ఫార్మా పరిశ్రమలకు కేంద్రం. యేటా దేశం నుంచి ఇతర దేశాలకు ఎగుమతి జరిగే ఫార్మా ఉత్పాదనల్లో రాష్ట్రం వాటా సుమారు 35 శాతం.  ఎన్నో పేరెన్నిక గల పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయి. ఇందులో భారీ పరిశ్రమలు 200 వరకు ఉన్నాయి. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు 600 వరకు ఉంటాయి. వాటిలో చాలా వరకు నిర్వహణ, వ్యాపార, తదితర కారణాలతో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కొన్ని మూతపడ్డాయి. ఇదే అదునుగా భావించిన కొందరు కొన్నిచోట్ల ఖాయిలా పడ్డా చిన్న పరిశ్రమలను మత్తు పదర్థాల తయారీ కేంద్రాలుగా మారుస్తున్నారు. ముఖ్యంగా ఏదైనా పరిశ్రమ ప్రారంభానికి అనుమతులు ఇచ్చే పీసీబీ, పరిశ్రమలు, డ్రగ్‌ కంట్రోల్‌ తదితర విభాగాలకు ఏ పరిశ్రమలు మూతపడ్డాయో ఖచ్చితమైన సమాచారం ఉండదు. దీంతో అక్రమార్కులు రహస్యంగా మూతపడిన వాటిని లీజు లేదా.. కొనుగోలు జరిపి బయటికి పొక్కకుండా నార్కోటెక్‌ నిషేదిత మార్ఫిన్‌, ఆఫెంటామైన్‌, ఎఫిడ్రిన్‌, అసిటోలో ఫాం తదితర ఉత్పేరకాలను తయారు చేస్తున్నారు. కొన్నిచోట్ల అనుమతి ఉన్న ఔషద ఉత్పాదనలకు బదులు.. సులభంగా డబ్బు సంపాదనే ధ్యేయంగా నిషేదిత డ్రగ్‌, వాటి ముడి సరుకులు తయారీ చేస్తున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ధ్యేయంగా ఫార్మా రంగంలో అనుభవం ఉన్న వారు, పరిశ్రమల్లో ల్యాబ్‌ టెక్నీషియన్లు, వివిధ వ్యాధుల నివారణకు మందులు తయారు చేసే విభాగంలో అనుభవం ఉన్న వారు ఈ తరహా కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. పారిశ్రామిక వాడల్లో ఓ పరిశ్రమలో జరిపే ఉత్పాదనపై మరో పరిశ్రమకు కానీ అందులో పని చేసే సిబ్బందికి కూడా పూర్తి సమాచారం ఉండదు. రియాక్టర్ల వారీగా లీజు తీసుకోవటం, లేదా కొన్ని రోజుల పాటు ఉత్పాదనల కోసం ఒప్పందాలు జరిపి 2, 3 నెలల వ్యవధిలోనే కోట్లాది రూపాయల విలువ గల మత్తు పదర్థాలను ఉత్పాదన చేసి ఎగుమతి చేస్తుంటారు. 2016 నుంచి బొల్లారం, కాజీపల్లి, గడ్డపోతారం, గండిగూడెం ప్రాంతాల పరిశ్రమల్లో నార్కోటిక్‌, డ్రగ్‌ కంట్రోల్‌ విభాగాల ఆధ్వర్యంలో నాలుగు సార్లు దాడులు జరిపి రూ.100 కోట్ల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు.  

లూసెంట్‌ పరిశ్రమ నుంచి.. 

గడ్డపోతారం పారిశ్రామికవాడలో గల లూసెంట్‌ పరిశ్రమ నుంచి నొప్పి నివారణ మందును అక్రమంగా పాకిస్థాన్‌కు ఎగుమతి చేసినట్లు నార్కోటిక్‌ బెంగుళూరు శాఖ అధికారులు గుర్తించారు. ఈ పరిశ్రమకు డెన్మార్క్‌, జర్మనీ, మలేషియాకు ట్రమాడాల్‌ తయారీ చేసి ఎగుమతి చేసేందుకు అనుమతి ఉండగా.. పాకిస్థాన్‌కు అక్రమంగా ఎగుమతి చేశారని అఽధికారులు గుర్తించారు. గత శనివారం పరిశ్రమలో సోదాలు జరిపిన ఎన్‌సీబీ అధికారులు 25 వేల కిలోల ట్రమాడాల్‌ దారి మళ్లినట్లు గుర్తించారు. అనుమతి ఉన్న దేశాలకు కాకుండా పాకిస్థాన్‌కు ఎగుమతి చేసినట్లు తేలింది. ఔషధాల తయారీ కోసం పరిశ్రమలు వాడే ఏసిటిక్‌ హైట్రైడ్‌ కూడా ఉండాల్సినంత లేదు. అలాగే నిబంధనల మేరకు ఈ రసాయనాల నిల్వల సమాచారం అందుబాటులో ఉండాలి. కానీ 3.65 కేజీలు తక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయమై పరిశ్రమవర్గాలను అధికారులు ప్రశ్నించగా ఏసిటిక్‌ రసాయనం ఆవిరైనట్లు చెప్పడం గమనార్హం. దీంతో పరిశ్రమకు చెందిన నలుగురిని ఎన్‌సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇదే తరహాలో ఇక్కడ ఉన్న చిన్నా చితక పరిశ్రమలు అనుమతి లేని, మత్తుపదార్థాలు తదితర ఉత్పాదనలు చేస్తున్నాయనే అనుమానాలు పారిశ్రామిక వాడలో ఉన్నాయి. ఈ ఉత్పాదనలపై స్థానికంగా ఏశాఖ అధికారులకు సమాచారం కానీ పరిశీలన చేసే అధికారం లేక పోవడంతో కొన్ని పరిశ్రమల్లో ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొన్నది. 

Updated Date - 2022-03-23T05:38:35+05:30 IST