టీఎస్‌ఐఐసీ ఇండస్ట్రీయల్‌ పార్క్‌ రహదారి పనుల ప్రారంభోత్సవంలో వివాదం

ABN , First Publish Date - 2022-05-19T04:52:46+05:30 IST

చిట్కుల్‌ టీఎ్‌సఐఐసీ ఇండస్ట్రీయల్‌ పార్క్‌ రహదారి పనుల ప్రారంభోత్సవంలో వివాదం చోటు చేసుకుంది.

టీఎస్‌ఐఐసీ ఇండస్ట్రీయల్‌ పార్క్‌ రహదారి పనుల ప్రారంభోత్సవంలో వివాదం

వెనుదిరిగిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి  

పటాన్‌చెరు రూరల్‌, మే 18: చిట్కుల్‌ టీఎ్‌సఐఐసీ  ఇండస్ట్రీయల్‌  పార్క్‌ రహదారి పనుల ప్రారంభోత్సవంలో వివాదం చోటు చేసుకుంది. దీంతో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడటంతో ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి ప్రారంభోత్సవాన్ని రద్దు చేసుకుని వెనుతిరిగారు. చిట్కుల్‌ 472 సర్వే నంబర్‌లో టీఎ్‌సఐఐసీ ఇండస్ట్రీయల్‌ పార్క్‌కు ప్రభుత్వం పది ఎకరాలను కేటాయించింది. ఇండస్ట్రీయల్‌ పార్కుకు రహదారి నిర్మాణానికి ఎమ్మెల్యే బుధవారం ఉదయం శంకుస్థాపన చేయాల్సి ఉండగా ముందుగానే సంఘటనా స్థలానికి చేరుకున్న చిట్కుల్‌ మాజీ సర్పంచ్‌ రవీందర్‌, ఉపసర్పంచ్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, వార్డు సభ్యులు ఆంజనేయులు, దుర్గయ్య, కాంగ్రెస్‌ నాయకుడు నరేందర్‌రెడ్డి, పలువురు నాయకులు టీఎ్‌సఐఐసీ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 472 సర్వే నంబర్లో గ్రామానికి చెందిన పలువురికి ప్రభుత్వం భూమి అసైన్డ్‌ చేసిందని తమకు తెలియకుండా తమ భూములు ఎలా కబ్జా చేస్తారని వారు అధికారులను నిలదీశారు. ప్రస్తుతం రహదారి మాత్రమే నిర్మిస్తున్నామని చెప్పి అనంతరం తమ భూములను కబ్జా చేయడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున కుట్ర పన్నిందని దీన్ని తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఇంతలో సంఘటనాస్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డికి గ్రామస్థులు తమ గోడు విన్నవించుకున్నారు. రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేయకుండా వెనుదిరగాలని వారు ఎమ్మెల్యేకు చెప్పారు. తమ గ్రామంలో చాలా మంది నిరుద్యోగులున్నారని వారికి ఈ భూమి కేటాయిస్తే చిన్న తరహ పరిశ్రమలను ఏర్పాటు చేసుకుంటారని సుంకరి రవీందర్‌ ఎమ్మెల్యేకు సూచించారు. అనంతరం అధికారులను అడిగి వివరాలు తీసుకున్న ఎమ్మెల్యే విషయం తనకు తెలియదని ప్రస్తుతానికి ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటున్నామని చెప్పి వెళ్లిపోయారు.

Read more