గ్రామపంచాయతీ భవన నిర్మాణంలో వివాదం

ABN , First Publish Date - 2022-03-05T05:09:16+05:30 IST

గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయాల్సి ఉండగా.. ఓ మహిళ పెట్రోల్‌ డబ్బాతో వచ్చి ఆందోళన చేయడంతో ఎమ్మెల్యే రఘునందన్‌రావు శంకుస్థాపన చేయకుండానే వెనుదిరిగారు.

గ్రామపంచాయతీ భవన నిర్మాణంలో వివాదం
పెట్రోల్‌ డబ్బాతో సత్తవ్వ

  పెట్రోల్‌ డబ్బాతో మహిళ బెదిరింపు

 శంకుస్థాపన చేయకుండానే వెనుదిరిగిన ఎమ్మెల్యే


మిరుదొడ్డి, మార్చి 4: గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయాల్సి ఉండగా.. ఓ మహిళ పెట్రోల్‌ డబ్బాతో వచ్చి ఆందోళన చేయడంతో ఎమ్మెల్యే రఘునందన్‌రావు శంకుస్థాపన చేయకుండానే వెనుదిరిగారు. ఈ సంఘటన మిరుదొడ్డి మండలం పెద్దచెప్యాలలో శుక్రవారం జరిగింది. గ్రామంలో భవన నిర్మాణానికి సేకరించిన స్థలంలో గతంలో మహిళా మండలి భవనం ఉండేది. ఆ భవనాన్ని కూల్చి, గ్రామపంచాయతీ, మహిళా మండలి భవనాల నిర్మాణం చేయాలని గ్రామసభలో తీర్మానించారు. అయితే గ్రామపంచాయతీ రికార్డుల్లో జగ్గ సత్తవ్వ పేరుతో సర్వే నంబర్‌ 415/ఏ లో 15 గుంటల స్థలం ఉంది. కొన్నేళ్ల క్రితం జగ్గ సత్తవ్వ బతుకుదెరువుకు ముంబైకి వెళ్లి 15 ఏండ్లపాటు అక్కడే ఉంది. తిరిగొచ్చే సరికి ఆమెకు చెందిన స్థలంలో మహిళా మండలి భవన నిర్మాణం చూసి కంగుతిన్నది. తనకు న్యాయం చేయాలని ఆమె అధికారుల చుట్టూ కూడా తిరుగుతోంది. ఈ క్రమంలో గ్రామపంచాయతీ, మహిళా భవనం నిర్మాణానికి మహిళా మండలి భవనాన్ని కూల్చివేశారు. ఇదే అదునుగా భావించిన జగ్గ సత్తవ్వ రెండు రోజుల క్రితం కోర్టును ఆశ్రయించగా.. ఆ స్థలంలో నిర్మాణాలపై తాత్కాలిక నిలిపివేతకు కోర్టు ఆదేశాలిచ్చినట్టు ఆమె చెప్పింది. అయితే శుక్రవారం భవనాల నిర్మాణానికి శంకుస్థాపన కోసం వచ్చిన ఎమ్మెల్యే రఘునందన్‌రావు ముందు పెట్రోల్‌ పోసుకుని చనిపోతానని హెచ్చరిస్తూ, పెట్రోల్‌ డబ్బాను చూపించింది. దీంతో శంకుస్థాపన చేయకుండానే ఎమ్మెల్యే వెనుదిరిగారు. 


సమస్యలపై ఎమ్మెల్యేను ప్రశ్నించిన గ్రామస్థులు


గ్రామంలో తాగునీటి సమస్యతో పాటు సీసీ రహదారులు, మురికి కాలువలు అధ్వాన్నంగా ఉన్నాయంటూ ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావును గ్రామస్థులు నిలదీశారు. సమస్యలను పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. రెండు రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే తెలపడంతో గ్రామస్థులు శాంతించారు.


 



Updated Date - 2022-03-05T05:09:16+05:30 IST