చాయ్‌, బిస్కెట్‌ కోసమే సభకు రావాలా?

ABN , First Publish Date - 2022-10-01T04:37:04+05:30 IST

గ్రామాల్లో సమస్యలను మండల సభ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలు పరిష్కారం కావడం లేదని చాట్లపల్లి, ఇటిక్యాల సర్పంచ్‌లు నరేష్‌, చంద్రశేఖర్‌ వాపోయారు.

చాయ్‌, బిస్కెట్‌ కోసమే సభకు రావాలా?
మాట్లాడుతున్న మునిగడప ఎంపీటీసీ కిరణ్‌గౌడ్‌

సమస్యలు పరిష్కారం కానప్పుడు సభ ఎందుకు?

ఎంపీపీ, అధికారుల తీరుకు నిరసనగా మండల సభ బహిష్కరణ

జగదేవపూర్‌, సెప్టెంబరు 30: గ్రామాల్లో సమస్యలను  మండల సభ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలు పరిష్కారం కావడం లేదని చాట్లపల్లి, ఇటిక్యాల సర్పంచ్‌లు నరేష్‌, చంద్రశేఖర్‌ వాపోయారు. అలాంటప్పుడు మండల సర్వసభ్య సమావేశానికి ఎందుకు రావాలన్నారు. సమావేశానికి చాయ్‌, బిస్కెట్‌ కోసమే రావాలా? అని ప్రశ్నించారు. ఎంపీపీ, అధికారుల తీరుకు నిరసనగా మండల సర్వసభ్య సమావేశాన్ని ఎంపీటీసీలు బహిష్కరించి వెళ్లిపోయారు. శుక్రవారం జగదేవపూర్‌ ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ బాలేశంగౌడ్‌ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీలు కిరణ్‌గౌడ్‌, మహేందర్‌రెడ్డి, మహేష్‌, రమ్య మాట్లాడుతూ గ్రామాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు అధికారులు, ఎంపీపీ సమాచారం అందించడం లేదన్నారు. మూడు నెలలకు ఒకసారి జరిగే మండల సభను మధ్యాహ్నం రెండు గంటలకు బదులుగా ఉదయం పది గంటలకు నిర్వహించాలని గత సమావేశంలో సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినప్పటికీ అధికారులు, ఎంపీపీ ఒంటెద్దు పోకడలతో పాత విధానం ద్వారానే మండల సభను ఏర్పాటు చెయ్యడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నేటికి కూడా అన్ని గ్రామపంచాయతీలో ఎంపీటీసీల పేర్లు రాయించడం లేదని పంచాయతీ కార్యదర్శులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల సర్వసభ్య సమావేశానికి ఎంపీటీసీలు, అన్ని గ్రామాల సర్పంచ్‌లు హాజరయ్యే విధంగా చూడాలని అధికారులను సభ్యులు కోరారు. దీంతో ఎంపీపీ మరో తేదిన మండల సభను ఏర్పాటు చేసుకుందాం అని ఎంపీటీసీలకు తెలిపారు.


Updated Date - 2022-10-01T04:37:04+05:30 IST