రెండేళ్ల నిరీక్షణకు ఫలితం.. విధేయతకు పట్టం

ABN , First Publish Date - 2022-09-14T05:19:51+05:30 IST

రెండేళ్ల నిరీక్షణ.. విధేయత ఫలితంగా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతాప్రభాకర్‌కు రాష్ట్ర చేనేత అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి దక్కింది. 2014 ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టిన ఆయన.. 2018లో ఎన్నికల్లో మాత్రం స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. అయినా నిరాశ చెందకుండా పార్టీ కార్యక్రమాల్లో చరుకుగా పాల్గొంటున్నారు. ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖల మంత్రి టి.హరీశ్‌రావుకు ముఖ్య అనుచరుడైన ప్రభాకర్‌కు తొలుత నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు.

రెండేళ్ల నిరీక్షణకు ఫలితం.. విధేయతకు పట్టం
చింతా ప్రభాకర్‌ను సన్మానిస్తున్న మంత్రి హరీశ్‌రావు

చేనేత అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌గా చింతా ప్రభాకర్‌


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, సెప్టెంబరు 13: రెండేళ్ల నిరీక్షణ.. విధేయత ఫలితంగా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతాప్రభాకర్‌కు రాష్ట్ర చేనేత అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి దక్కింది. 2014 ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టిన ఆయన.. 2018లో ఎన్నికల్లో మాత్రం స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. అయినా నిరాశ చెందకుండా పార్టీ కార్యక్రమాల్లో చరుకుగా పాల్గొంటున్నారు. ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖల మంత్రి టి.హరీశ్‌రావుకు ముఖ్య అనుచరుడైన ప్రభాకర్‌కు తొలుత నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. రెండేళ్ల కిందట ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసిన సమయంలో చేనేత అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమిస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా నియమిస్తామని కూడా హామీ ఇచ్చారని ప్రచారం జరిగింది. కానీ రెండేళ్లయినా ఏ పదవీ రాకపోవడంతో ప్రభాకర్‌ అనుచరులు అసంతృప్తికి లోనయ్యారు. అయితే ఇటీవలి కాలంలో సంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్ష పదవిని ఆయనకు కట్టబెట్టారు. ప్రభుత్వ పరంగా పదవి ఏమీ లేకపోయినా భవిష్యత్‌ తనదేనన్న ఆశలో ఆయన రాజకీయాలు సాగిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో చింతా ప్రభాకర్‌ను చేనేత అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 


మంత్రులను కలిసిన చింతా..

తనను చేనేత అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమించడంపై చింతా ప్రభాకర్‌ సంతోషం వ్యక్తం చేశారు. చైర్మన్‌గా నియమించేందుకు సహకరించిన మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావును మంగళవారం ఆయన కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి హరీశ్‌రావు చింతాప్రభాకర్‌ను సన్మానించి కొత్త పదవిలో బాధ్యతాయుతంగా పనిచేసి మంచిపేరు తెచ్చుకోవాలని సూచించారు. ఆయనవెంట ఎంపీ ప్రభాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Read more