అలంకార ప్రాయంగా చిన్నకోడూరు బస్టాండు

ABN , First Publish Date - 2022-04-11T05:24:57+05:30 IST

ప్రయాణికుల సౌకర్యార్థం లక్షలాది రూపాయలు వెచ్చించి చిన్నకోడూరు మండల కేంద్రంలో నిర్మించిన ఆర్టీసీ బస్టాండు అలంకార ప్రాయంగా దర్శనమిస్తున్నది.

అలంకార ప్రాయంగా చిన్నకోడూరు బస్టాండు
చిన్నకోడూరులో నిరుపయోగంగా ఉన్న ఆర్టీసీ బస్టాండు

  వినియోగంలోకి తేవాలని స్థానికుల డిమాండ్‌

 పట్టించుకోని అధికారులు, పాలకులు


చిన్నకోడూరు, ఏప్రిల్‌ 10: ప్రయాణికుల సౌకర్యార్థం లక్షలాది రూపాయలు వెచ్చించి చిన్నకోడూరు మండల కేంద్రంలో నిర్మించిన ఆర్టీసీ బస్టాండు అలంకార ప్రాయంగా దర్శనమిస్తున్నది. ప్రయాణ ప్రాంగణంలోకి బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు లేక బస్టాండు వెలవెలబోతోంది. దీంతో బస్టాండు ఏళ్ల తరబడి నిరుపయోగంగా ఉంటోంది. ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించాలనే ఉద్దేశంతో చిన్నకోడూరు మండల కేంద్రంలో సుమారు 22 సంవత్సరాల క్రితం ఆర్టీసీ బస్టాండు నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించారు. బస్టాండు నిర్వహణలో అధికారులు తగిన చర్యలు చేపట్టకపోవడంతో ప్రయాణికులు బస్టాండును ఉపయోగించుకునే పరిస్థితి లేకుండా పోయింది. బస్టాండు వినియోగంలో లేకపోవడంతో పంచాయతీలను నిర్వహిస్తున్నారు. బస్టాండు ఆవరణలో నిర్మించిన సీసీ ప్లాట్‌ఫామ్‌ను ధాన్యాన్ని ఆరబెట్టడానికి రైతులు వినియోగిస్తున్నారు. బస్టాండ్‌లోకి బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు, కళాశాలలకు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు బస్సు కోసం స్థానిక అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద రోడ్డుపైనే వేచి ఉండాల్సిన పరిస్థితి. బస్టాండు నిర్వహణపై అధికారులు, పాలకులు పట్టించుకోకపోవడంతో నిరుపయోగంగా మారింది. లక్షలాది రూపాయాలు వెచ్చించి నిర్మించిన బస్టాండును సంబంధిత అధికారులు, పాలకులు చొరవ తీసుకోని అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.


 

Read more