మరుగుదొడ్డిలో మృత శిశువు

ABN , First Publish Date - 2022-11-24T23:47:25+05:30 IST

కాలకృత్యాల కోసమని టాయిలెట్‌కు వెళ్లిన ఓ సెక్యురిటీ గార్డుకు మరుగుదొడ్డి కుండీలో మృత శిశువు కనిపించింది. విషయాన్ని అధికారులకు చెప్పడంతో ఆస్పత్రి అధికారులు, డాక్టర్లు మృత శిశువును పరిశీలించారు.

మరుగుదొడ్డిలో మృత శిశువు

సంగారెడ్డి ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్‌లో అమానవీయ ఘటన

సంగారెడ్డి అర్బన్‌, నవంబరు 24: కాలకృత్యాల కోసమని టాయిలెట్‌కు వెళ్లిన ఓ సెక్యురిటీ గార్డుకు మరుగుదొడ్డి కుండీలో మృత శిశువు కనిపించింది. విషయాన్ని అధికారులకు చెప్పడంతో ఆస్పత్రి అధికారులు, డాక్టర్లు మృత శిశువును పరిశీలించారు. ఈ అమానవీయ ఘటన గురువారం సంగారెడ్డిలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో వెలుగుచూసింది. మెదక్‌ జిల్లా పెద్దశంకరంపేటకు చెందిన ఓ మహిళ (26) రెండో కాన్పు కోసం బుధవారం రాత్రి 11.40 గంటలకు సంగారెడ్డిలోని ఎంసీహెచ్‌లో చేరింది. గర్భిణీని పరీక్షించిన వైద్యులు శిశువు కడుపులోనే మృతిచెందినట్లు గుర్తించారు. నార్మల్‌ డెలివరీ చేసి గురువారం ఉదయం 4:50 గంటలకు ఆడ మృత శిశువును బయటకు తీసిన వైద్యులు కుటుంబసభ్యులకు అప్పగించారు. మెడికల్‌ కాలేజీ అనాటమీ విభాగానికి మృత శిశువును ఇవ్వాలని ఆస్పత్రి డాక్టర్లు కుటుంబసభ్యులను అడిగారు. సరేనన్న కుటుంబసభ్యులు అనాటమీ విభాగానికి మృత శిశువును అప్పగించినట్లే ఇచ్చి మళ్లీ తీసుకెళ్లారని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ తెలిపారు. కడుపులోనే కన్నుమూసిన మృత శిశువును సాంప్రదాయబద్దంగా ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాల్సిన తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఆస్పత్రి అత్యవసర విభాగంలోని మరుగుదొడ్డి కుండీలో పారవేసి నీళ్లు కొట్టారు. అయినా ఆ శిశువు కొట్టుకుపోకపోవడంతో కుండీలో కుక్కేసి వెళ్లినట్లు తెలుస్తున్నది. సెక్యూరిటీ సిబ్బంది ద్వారా తెలుసుకొని అప్రమత్తమైన అధికారులు గుట్టుచప్పుడు కాకుండా హుటాహుటిన మృతశిశువును ఆస్పత్రి ప్రాంగణంలోని టీబీ వార్డు వెనకాల డంపింగ్‌ యార్డులో పాతిపెట్టినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

Updated Date - 2022-11-24T23:47:27+05:30 IST