బిల్లు..భయం!

ABN , First Publish Date - 2022-08-26T05:05:10+05:30 IST

బిల్లులు రావన్న భయంతో మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా చేపట్టాల్సిన పనులకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఫలితంగా పాఠశాలల్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి.

బిల్లు..భయం!

బిల్లులు రావన్న కారణంతో ముందుకు రాని కాంట్రాక్టర్లు

నత్తనడకన ‘మన ఊరు-మన బడి’ 

ఇప్పటికీ ఒక్క పాఠశాలలోనే మరమ్మతులు పూర్తి

అధికారులు బెదిరిస్తున్నారని సర్పంచ్‌, కాంట్రాక్టర్ల ఆవేదన


  ఆంధ్రజ్యోతిప్రతినిధి, సంగారెడ్డి, ఆగస్టు 25   బిల్లులు రావన్న భయంతో మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా చేపట్టాల్సిన పనులకు కాంట్రాక్టర్లు  ముందుకు రావడం లేదు. ఫలితంగా పాఠశాలల్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. గత జూన్‌ 12వ తేదీలోగా ఎంపిక చేసిన పాఠశాలల్లో మన ఊరు-మన బడి ద్వారా మరమ్మతులు పూర్తి కావాలి. అయితే నిర్ణీత గడువు  ముగిసి రెండున్నర నెలలు గడిచినా  ఎంపిక చేసిన సగానికిపైగా స్కూళ్లలో అసలు పనులే మొదలు పెట్టలేదు. ఇప్పటి వరకు జిల్లాలో ఎంపిక చేసిన 441 పాఠశాలల్లో ఒకే ఒక్క పాఠశాలలోనే మరమ్మతు పనులు పూర్తి కావడం గమనార్హం. 

సంగారెడ్డి జిల్లాలో అన్ని కేటగిరీల ప్రభుత్వ పాఠశాలలు 1262 ఉండగా, ప్రస్తుత విద్యా సంవత్సరంలో 441 పాఠశాలలను మన ఊరు-మన బడి కార్యక్రమం అమలుకు ఎంపిక చేశారు. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 256 ఉండగా, ప్రాథమికోన్నత పాఠశాలలు 61, ఉన్నత పాఠశాలలు 124 ఉన్నాయి. ఈ పాఠశాల్లో టాయ్‌లెట్స్‌ విత్‌రన్నింగ్‌ వాటర్‌, ప్రహరీ, కిచెన్‌షెడ్‌, విద్యుత్‌ సౌకర్యం, తాగునీటి వసతి, మేజర్‌, మైనర్‌ రిపేర్లు, ఉన్నత పాఠశాలల్లో డైనింగ్‌ హాలును ఏర్పాటు చేయాల్సి ఉన్నది. 


రూ.2 కోట్లు మంజూరు

మన ఊరు-మన బడి ద్వారా ఎంపిక చేసిన ఆయా పాఠశాలల్లో మరమ్మతు పనులు చేపట్టేందుకు ప్రభుత్వం రూ.2కోట్లు మంజూరు చేసింది. జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి మేరకు మాజీ ఎమ్మెల్యే చింతాప్రభాకర్‌ రూ.2లక్షలు, డీసీఎంఎస్‌ చైర్మన్‌ ఎం.శివకుమార్‌ రూ.1లక్షను విరాళంగా ఇచ్చారు. ఇక పనులు చేపట్టాల్సిన వాటిలో 331 పాఠశాలల్లో రూ.30 లక్షల లోపు అంచనాలతో మంజూరు చేశారు. ఇందులో పనులు ప్రారంభించిన 203 పాఠశాలలకు అంచనాలలో 10శాతం చొప్పున డబ్బును కాంట్రాక్టర్లకు చెల్లించారు. కాగా రూ.30 లక్షలకు పైగా చొప్పున 104 పాఠశాలల్లో చేపట్టాల్సిన పనులకు అంచనాలు రూపొందించారు. వీటిలో 30 పాఠశాలల్లో పనులకు టెండర్లు ఖరారయ్యాయి. టెండర్ల ద్వారా పనులు పొందిన కాంట్రాక్టర్లు 15 పాఠశాలల్లోనే పనులు మొదలుపెట్టారు. మిగిలిన పాఠశాలల్లో ఇంకా పనులు మొదల కానేలేదు. ఆరు పాఠశాలల్లో మాత్రం వివిధ కారణాలతో ప్రభుత్వం పనులు మంజూరు చేయలేదు. 


ఒకే పాఠశాలలో పనులు పూర్తి

ప్రస్తుత విద్యా సంవత్సరం మొదలై రెండున్నర నెలలు గడిచినా ఇప్పటి వరకు జిల్లాలో మన ఊరు-మన బడి ద్వారా ఎంపిక చేసిన పాఠశాలల్లో సిర్గాపూర్‌ మండలం లక్ష్మణ్‌నాయక్‌ తండా ప్రాథమిక పాఠశాలలోనే మరమ్మతు పనులు పూర్తి అయ్యాయి. ఈ పాఠశాలలో తాగునీటి వసతి, టాయ్‌లెట్లు తదితర వాటి కల్పనకు రూ.9.57 లక్షల ఖర్చుతో పనులు పూర్తి చేశారు. 


 పనులు ఇలా..

రూ.30లక్షల లోపు అంచనాలతో మంజూరైన 331 పాఠశాలల్లో 128 పాఠశాలల్లో అసలు పనులే మొదలు కాలేదు. మిగిన 203 పాఠశాలల్లో పనుల కోసం అంచనాలతో 10శాతం చొప్పున డబ్బును జిల్లా యంత్రాంగం కాంట్రాక్టర్లకు చెల్లించింది. సదరు కాంట్రాక్టర్లు ఆ మేరకు పాఠశాలల్లో పనులు చేసి, అసంపూర్తిగా వదిలేశారు. రూ.30లక్షలకు పైగా అంచనాలతో మంజూరైన 104 పాఠశాలల్లో 74 పాఠశాలలకు టెండర్లు వేసేందుకు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదు. 30 పాఠశాలలకు టెండర్లు ఖరారై, ఒప్పందం కుదుర్చుకున్న కాంట్రాక్టర్లు 15 పాఠశాలల్లోనే పనులు ప్రారంభించారు. ఆయా పాఠశాలల్లో టాయ్‌లెట్లు, తాగునీటి ఏర్పాటు తరగతి గదుల నిర్మాణం తదితర పనులన్నీ అసంపూర్తిగా కనిపిస్తున్నాయి. 


బిల్లుల మంజూరులో జాప్యమే..

మన ఊరు-మన బడి ద్వారా ఎంపిక చేసిన పాఠశాలల్లో పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడానికి బిల్లుల మంజూరులో జాప్యమే కారణమని తెలుస్తున్నది. బయట వడ్డీకి అప్పులు చేసి, పనులు పూర్తి చేసినా బిల్లులు చెల్లించేందుకు అధికారులు ఆర్నెళ్లకు పైగా సమయం తీసుకుంటున్నారని పలువురు కాంట్రాక్టర్లు తెలిపారు. దీనికి తోడు బిల్లుల మంజూరుకు మామూళ్లు ఇవ్వడం సరేసరి. ఇవన్నీ కలుపుకుంటే చేసిన పనులకు చెల్లించే బిల్లులు తాము తెచ్చిన అసలు, వడ్డీ డబ్బుకు సరిపోవడం లేదని పలువురు కాంట్రాక్టర్లు వాపోతున్నారు. ఇక గ్రామాల్లో ఎంపిక చేసిన పాఠశాలలో పనులు చేపట్టేలా చూడాలని మండల, డివిజన్‌ స్థాయి అధికారులు తమను బెదిరిస్తున్నారని పలువురు సర్పంచ్‌లు తెలిపారు. ప్రభుత్వం డబ్బులు ఇవ్వడంలో జాప్యం చేస్తుండడం వల్లే పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని వారు వివరించారు. ఇలాంటి పరిస్థితులలో చెక్‌ పవర్‌ రద్దు చేస్తామని, సస్పెండ్‌ చేస్తామని తమను బెదిరిస్తే తామేమి చేయలేమని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో పనుల బాధ్యత తీసుకున్న పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌, ప్రజారోగ్యశాఖ, నీటి పారుదల తదితర శాఖల అధికారులు నిస్సహాయంగా ఉండిపోయారు.

Read more