పల్లె దవాఖానాల్లో మెరుగైన వైద్య సేవలందించాలి

ABN , First Publish Date - 2022-11-23T23:51:33+05:30 IST

పల్లె దవాఖానాల్లో పని చేసేందుకు వైద్యులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలని, ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలందించాలని అదనపు కలెక్టర్‌ ముజామ్మిల్‌ఖాన్‌ సూచించారు.

పల్లె దవాఖానాల్లో మెరుగైన వైద్య సేవలందించాలి
దివ్యాంగుల క్రీడా పోటీలను ప్రారంభిస్తున్న అదనపు కలెక్టర్‌ ముజామ్మిల్‌ఖాన్‌

అదనపు కలెక్టర్‌ ముజామ్మిల్‌ఖాన్‌

సిద్దిపేట టౌన్‌, నవంబరు 23 : పల్లె దవాఖానాల్లో పని చేసేందుకు వైద్యులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలని, ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలందించాలని అదనపు కలెక్టర్‌ ముజామ్మిల్‌ఖాన్‌ సూచించారు. బుధవారం సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి అనుబంధ మెడికల్‌ కళాశాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని పల్లె దవాఖానలో పనిచేసే 45 మంది మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్లు(ఎంఎల్‌హెచ్‌పీ) వైద్యులకు 6 నెలల బ్రిడ్జ్‌ కోర్సు శిక్షణ కార్యక్రమాన్ని డీఎంహెచ్‌వో కాశీనాథ్‌తో కలిసి అదనపు కలెక్టర్‌ ముజామ్మిల్‌ఖాన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు, హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ కమిషనర్‌ శ్వేతామహంతి ఆదేశాల మేరకు ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆరోగ్య తెలంగాణ సాధించే దిశగా అందరూ భాగస్వాములు కావాలని ముజామ్మిల్‌ఖాన్‌ సూచించారు. డీఎంహెచ్‌వో కాశీనాథ్‌ మాట్లాడుతూ ఈ శిక్షణ ఆరు నెలల పాటు నిర్వహించనున్నట్లు, ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు శిక్షణ కొనసాగుతుందని తెలియజేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న వైద్యాధికారుల నుంచి ఆశ కార్యకర్తల వరకు, ఆరోగ్య ఉప కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది విధుల గురించి ఈ శిక్షణలో తెలుపుతారన్నారు. శిక్షణలో భాగంగా క్లాస్‌రూమ్‌ సెషన్స్‌, ఫీల్డ్‌ విజిట్స్‌ ఉంటాయని వెల్లడించారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లినప్పుడు ప్రజలకు ఎలాంటి ఆరోగ్య కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయని తెలుసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ కిషోర్‌, వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ విమలాథామస్‌, కోఆర్డినేటర్‌ తదితరులు పాల్గొన్నారు.

శరీరానికే వైకల్యం..

వైకల్యం అనేది శరీరానికే కానీ మనసుకు, మేధస్సుకు కాదని అదనపు కలెక్టర్‌ ముజామ్మిల్‌ఖాన్‌ అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జిల్లాస్థాయి దివ్యాంగుల క్రీడోత్సవాలను మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ రాజనర్సుతో కలిసి బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ముజామ్మిల్‌ఖాన్‌ మాట్లాడుతూ అంధ, బధిర, శారీరక, మానసిక దివ్యాంగులకు జూనియర్‌, సీనియర్‌ విభాగాల్లో ట్రైసైకిల్‌ రేస్‌, పరుగు పందెం, చెస్‌, క్యారం, జావలిన్‌ త్రో, షాట్‌పుట్‌లలో పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. దివ్యాంగులు ఎవరికి తీసిపోరని, వారిని ప్రోత్సహిస్తే వారికున్న మేధాశక్తితో అద్భుతాలు ఆవిష్కరించగలరన్నారు. దివ్యాంగులు ఈ పోటీలలో ఉల్లాసంగా, ఉత్సాహంగా పాల్గొనాలని అదనపు కలెక్టర్‌ సూచించారు. జిల్లా స్థాయిలో వివిధ ఆటల పోటీలలో ప్రథమ స్థానంలో నిలిచిన వారిని రాష్ట్రస్థాయి క్రీడలకు పంపించనున్నట్లు చెప్పారు. ఎనిమిదేళ్ల క్రితమే మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో దివ్యాంగుల కోసం ప్రత్యేకమైన సంఘ భవనాన్ని పట్టణంలోని కాళ్లకుంట కాలనీలో నిర్మించారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీల శాఖాధికారి నాగేందర్‌, కౌన్సిలర్లు, వివిధ మండలాల వచ్చిన దివ్యాంగులు, అంధ ఉద్యోగుల సంక్షేమ సంఘం బాధ్యులు అనిల్‌, శ్రీనివాస్‌, నందన్‌తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-23T23:51:34+05:30 IST