పకడ్బందీగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2022-12-13T00:19:15+05:30 IST

ఎస్‌ఐ, పోలీస్‌ కానిస్టేబుల్‌ నియామకాల్లో భాగంగా ఈ నెల 22 నుంచి జనవరి మూడో తేదీ వరకు సిద్దిపేటలో జరిగే పోలీస్‌ దేహదారుఢ్య పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సీపీ శ్వేత పోలీస్‌ అధికారులకు సూచించారు.

పకడ్బందీగా నిర్వహించాలి
సమావేశంలో మాట్లాడుతున్న సీపీ శ్వేత

పోలీస్‌ కమిషనర్‌ శ్వేత

పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో అభ్యర్థులకు ఫిజికల్‌ టెస్టులకు ఏర్పాట్లు

బయోమెట్రిక్‌, సీసీ నిఘాలో పరీక్షలు

హాజరుకానున్న 9,983 అభ్యర్థులు

సిద్దిపేట క్రైం, డిసెంబరు 12: ఎస్‌ఐ, పోలీస్‌ కానిస్టేబుల్‌ నియామకాల్లో భాగంగా ఈ నెల 22 నుంచి జనవరి మూడో తేదీ వరకు సిద్దిపేటలో జరిగే పోలీస్‌ దేహదారుఢ్య పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సీపీ శ్వేత పోలీస్‌ అధికారులకు సూచించారు. సోమవారం ఆమె కమిషనర్‌ కార్యాలయంలో పోలీసు దేహదారుఢ్య పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 9,983 మందికి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించేందుకు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. 8,013 మంది పురుషులు, 1,970 మంది మహిళా అభ్యర్థులు ఈవెంట్స్‌లో పాల్గొంటారని ఆమె పేర్కొన్నారు. పురుషులకు 1600 మీటర్లు, మహిళలకు 800 మీటర్ల రన్నింగ్‌ రేసు నిర్వహించన్నుట్లు తెలిపారు. ఆర్‌ఎ్‌ఫఐడీ ప్యాడ్లను ఉపయోగిస్తూ ప్రతి అభ్యర్థికి రిస్ట్‌బ్యాండ్‌ అమర్చడం జరుగుతుందన్నారు. అభ్యర్థులు ఎవరూ కూడా రిస్ట్‌బ్యాండ్‌ను తీసేయడం లేదా డ్యామేజ్‌ చేయడం తగదని అలా చేస్తే అనర్హులుగా ప్రకటిస్తారని ఆమె హెచ్చరించారు. బయోమెట్రిక్‌, సీసీ నిఘాలో పోలీస్‌ ఈవెంట్లు కొనసాగుతాయని పేర్కొన్నారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో పూర్తి పారదర్శకంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఈవెంట్‌లకు సంబంధించి ప్రతీది ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదవుతుందని తెలిపారు. మైదానంలో అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆమె అధికారులకు సూచించారు.

నిరంతర నిఘా ఉంచాలి

సిద్దిపేట క్రైం, డిసెంబరు 12 : రౌడీలు, కేడీలు, అనుమానితుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని సిద్దిపేట సీపీ శ్వేత గజ్వేల్‌ పోలీస్‌ అధికారులకు సూచించారు. సోమవారం ఆమె గజ్వేల్‌ డివిజన్‌ పోలీస్‌ అధికారులతో కమిషనర్‌ కార్యాలయంలో పెండింగ్‌ కేసులపై సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. 2021, 2022 పెండింగ్‌ కేసులను పూర్తిస్థాయిలో విచారణ చేసి వాటిని క్లోజ్‌ చేయాలని సూచించారు. గంజాయి, పేకాటస్థావరాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి సమూలంగా నిర్మూలించాలన్నారు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసుల్లో 60 రోజుల్లో ఇన్వెస్టిగేషన్‌ పూర్తి చేసి చార్జిషీట్‌ దాఖలు చేయాలన్నారు. ప్రతీరోజు ఉదయం, సాయంత్రం విజబుల్‌ పోలీసింగ్‌లో భాగంగా వాహనాల తనిఖీలను నిర్వహించాలని సూచించారు. రాత్రివేళల్లో పెట్రోలింగ్‌ అధికారులు లాడ్జిలు, పాత నేరస్థులను తనిఖీ చేయాలని చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కేసులు నమోదు చేయాలని సూచించారు. సైబర్‌ నేరాల నియంత్రణకు ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. సమావేశంలో అడిషనల్‌ డీసీపీ అడ్మిన్‌ మహేందర్‌, సిద్దిపేట ట్రాఫిక్‌ ఏసీపీ ఇన్‌చార్జి, గజ్వేల్‌ ఏసీపీ ఫణిందర్‌, గజ్వేల్‌ సీఐ వీరాప్రసాద్‌, రూరల్‌ సీఐ రాజశేఖర్‌రెడ్డి, తొగుట సీఐ కమలాకర్‌, గజ్వేల్‌ ట్రాఫిక్‌ సీఐ తిరుపతి, సీసీఆర్బీ సీఐ సైదానాయక్‌, ఐటీ కోర్‌ ఎస్‌ఐ శ్రీకాంత్‌, గజ్వేల్‌ డివిజన్‌ ఎస్‌ఐలు, సీసీఆర్బీ, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T00:19:15+05:30 IST

Read more