బీసీలు బిచ్చగాళ్లు కాదు

ABN , First Publish Date - 2022-07-04T05:20:39+05:30 IST

బీసీలు బిచ్చగాళ్లు కాదని కేంద్ర ప్రభుత్వం బీసీలకు కేవలం బిచ్చమేసినట్టు రూ.1400 కోట్లు కేటాయించిందని రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య విమర్శించారు.

బీసీలు బిచ్చగాళ్లు కాదు
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నఆర్‌.కృష్ణయ్య

కేంద్ర ప్రభుత్వం బీసీల వ్యతిరేకి

పార్టీలకతీతంగా బీసీలు పోరాడాలి

రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య


సంగారెడ్డి రూరల్‌, జూలై3: బీసీలు బిచ్చగాళ్లు కాదని కేంద్ర ప్రభుత్వం బీసీలకు కేవలం  బిచ్చమేసినట్టు రూ.1400 కోట్లు కేటాయించిందని రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య విమర్శించారు. సంగారెడ్డిలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు బీరయ్యయాదవ్‌ నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం బీసీల వ్యతిరేకి అని అన్నారు. పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టి పాస్‌ చేయాలని అందుకు ఉద్యమిస్తామని చెప్పారు. ఏపీ సీఎం జగన్‌ బీసీలకు మద్దతిస్తానన్నారని పేర్కొన్నారు. జనాభా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేశామని ఆయన గుర్తుచేశారు. ఏ పార్టీ కూడా బీసీల సంక్షేమానికి పాటుపడలేదని, బీసీలను పట్టించుకోలేదని ఆరోపించారు. బీసీలు బిచ్చగాళ్లు కాదని బీజేపీ బీసీలను మోసగిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. బీజేపి నిర్వహించే సమావేశాల్లో బీసీల సంక్షేమానికి ఏం చేస్తారో ప్రధాని మోదీ ప్రకటించాలని కృష్ణయ్య డిమాండ్‌ చేశారు.  బీసీ గురుకులాలకు ఒక్క భవనం కూడా లేదన్నారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. పార్టీలకతీతంగా బీసీలు కలిసి వచ్చి పోరాడాలని ఆర్‌.కృష్ణయ్య పిలుపునిచ్చారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు బీరయ్యయాదవ్‌, ఉపాధ్యాయ సంఘం నాయకులు లక్ష్మయ్య, కిష్టయ్య, విద్యార్థి సంఘం నాయకులు రాహుల్‌, నరేందర్‌, మల్లేశ్‌, సాయి భాస్కర్‌, అఖిల్‌, రఘు పాల్గొన్నారు.



Updated Date - 2022-07-04T05:20:39+05:30 IST