ఇక అందుబాటులో ఆయుష్‌ సేవలు

ABN , First Publish Date - 2022-12-13T00:16:26+05:30 IST

సోమవారం సిద్దిపేట పట్టణంలోని మెడికల్‌ కళాశాల ఆవరణలో ప్రభుత్వ కేంద్రీయ ఔషధ గిడ్డంగి, 50 పడకల ప్రభుత్వ ఆయుష్‌ ఆసుపత్రి భవన నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం మెడికల్‌ కళాశాలలో 900 పడకల ఆసుపత్రి భవన నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఇక అందుబాటులో ఆయుష్‌ సేవలు
సిద్దిపేటలో ఉమెన్స్‌ హస్టల్‌ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న మంత్రి హరీశ్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్శ

ఔషధ గిడ్డంగి ఏర్పాటుతో సకాలంలో మందుల పంపిణీ

వైద్య విద్యలో జాతీయస్థాయిలో ఆదర్శంగా నిలవాలి

రైతులకు ధాన్యం డబ్బు చెల్లింపులో జిల్లాకు మూడో స్థానం

రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట టౌన్‌, డిసెంబరు 12 : సిద్దిపేటలో ఏర్పాటు చేయబోతున్న 50 పడకల ఆయుష్‌ ఆసుపత్రిలో అన్నీ రకాల ఆయుష్‌ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలియజేశారు. సిద్దిపేట పట్టణంలో రూ.15 కోట్ల వ్యయంతో 50 పడకల ఆయుష్‌ ఆసుపత్రికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. సోమవారం సిద్దిపేట పట్టణంలోని మెడికల్‌ కళాశాల ఆవరణలో ప్రభుత్వ కేంద్రీయ ఔషధ గిడ్డంగి, 50 పడకల ప్రభుత్వ ఆయుష్‌ ఆసుపత్రి భవన నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం మెడికల్‌ కళాశాలలో 900 పడకల ఆసుపత్రి భవన నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ఆయుష్‌ వైద్యానికి మంచి భవిష్యత్తు ఉందని, సంప్రదాయ వైద్యానికి రోజురోజుకూ ప్రాధాన్యం పెరుగుతున్నదన్నారు. ఆయుర్వేదం, యోగ, నాచురోపతి, యునాని, సిద్ధ, హోమియో దేనీ ప్రత్యేకత దానిదేనని చెప్పారు. ప్రకృతి వైద్యానికి తెలంగాణ కేరాఫ్‌ అడ్ర్‌సగా నిలిచేలా ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. సిద్దిపేటలో సెంట్రల్‌ మెడిసిన్‌ స్టోర్‌(సీఎంఎస్‌) ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీటి పరిధిలో ఆసుపత్రులకు సకాలంలో మందులు పంపిణీ జరుగుతందని తెలిపారు. ఇప్పటివరకు సిద్దిపేటకు మందులు హైదరాబాదు డ్రగ్‌ స్టోర్‌ నుంచి పంపిణీ జరిగేవని, ఇక నుంచి సిద్దిపేటలోనే డ్రగ్‌ స్టోర్‌ అందుబాటులోకి వస్తుందన్నారు.

బీబీనగర్‌ ఎయిమ్స్‌ కంటే మెరుగైన వసతులు

వన్‌ ఆఫ్‌ ది యంగ్‌ మెడికల్‌ కళాశాల సిద్దిపేట అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం సిద్దిపేట మెడికల్‌ కళాశాలలో మొదటి పీజీ బ్యాచ్‌ 2022-23కు చెందిన విద్యార్థుల పరిచయం కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధతో వైద్య విద్య, వైద్య సేవలపై దృష్టి సారించారన్నారు. ఉస్మానియా లాంటి కళాశాలకే సంవత్సరానికి మూడు, నాలుగు పీజీ సీట్లు వస్తాయని తెలిపారు. కానీ మొదటి సంవత్సరంలోనే సిద్దిపేట మెడికల్‌ కళాశాలకు రికార్డుస్థాయిలో 57 పీజీ సీట్లు సాధించామని వెల్లడించారు. పీజీ మెడికల్‌ సీట్ల సాధనలో మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌, ప్రొఫెసర్ల కృషి చాలా ఉందని ప్రశంసించారు. బీబీనగర్‌ ఎయిమ్స్‌లో లేని వసతులు సిద్దిపేట ప్రభుత్వం మెడికల్‌ కళాశాలలో ఉన్నాయన్నారు. జీజీహెచ్‌లో త్వరలోనే క్యాథ్‌లాగ్‌, కీమోథెరపీ, రేడియో థెరపీ సేవలను ప్రారంభించనున్నామన్నారు. సిద్దిపేట మెడికల్‌ కాలేజీలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని, అందరూ ప్రొఫెసర్‌లు అందుబాటులో ఉన్నట్లు, వారి సేవలను ఉపయోగించుకొని ఉన్నతంగా ఎదగాలన్నారు. దేశస్థాయిలోనే సిద్దిపేట ప్రభుత్వ మెడికల్‌ కాలేజీకి ప్రత్యేక గుర్తింపు తేవాలని కోరారు. చరిత్రలో నిలిచేలా అందరూ డిస్టింక్షన్‌ సాధించి, రాబోవు తరాల విద్యార్థులకు మొదటి పీజీ బ్యాచ్‌ మెడికోలు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. అన్నీ రంగాలలో సిద్దిపేట ఆదర్శంగా నిలుస్తున్న మాదిరిగానే, వైద్య విద్యలోనూ జాతీయస్థాయిలో రోల్‌మోడల్‌గా నిలపాలని సూచించారు.

కంటి అద్దాల పంపీణీ

సర్వేద్రియానాం నయనం ప్రధానం అన్నట్లుగా వృద్ధుల కష్టాలు, ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కంటి క్యాటరాక్ట్‌ ఆపరేషన్లు చేయిస్తున్నామని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో క్యాటరాక్ట్‌ ఆపరేషన్లు చేసిన దాదాపు 300పైచిలుకు మందికి ఆయన కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనవరి 18వ తేదీ నుంచి కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం ప్రారంభం చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గ పరిధిలోని 3వేల మందికి క్యాటరాక్ట్‌ ఆపరేషన్లు చేయించి అద్దాలను పంపిణీ చేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీచైర్‌పర్సన్‌ రోజారాఽధాకృష్ణశర్మ, కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ కాశీనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

మూడు రోజుల్లో రైతు బ్యాంకు ఖాతాలో డబ్బు జమ

రైతులకు సకాలంలో ధాన్యం కొనుగోలు డబ్బును చెల్లించడంలో సిద్దిపేట జిల్లా రాష్ట్ర స్థాయిలో 3వ స్థానంలో నిలిచిందని మంత్రి హరీశ్‌రావు అధికారులను అభినందించారు. సోమవారం సిద్దిపేట పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ జిల్లాలో 9 లక్షల మెట్రిక్‌ టన్నుల వరిధాన్యం పండిందని, వాటిలో 4 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రైతులు వారి అవసరాలకు ఉంచుకోగా, రూ.619 కోట్ల విలువగల 3 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని తెలిపారు. మూడు రోజుల్లో రైతుల బ్యాంకు ఖాతాలో డబ్బు జమచేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో రూ.544 కోట్లను రైతులకు చెల్లించినట్లు పేర్కొన్నారు. ఇంకా రూ.65 కోట్లను చెల్లించాల్సి ఉందిని చెప్పారు. లక్షన్నర మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ప్రైవేట్‌ వ్యాపారులు కొనుగోలు చేశారని, జిల్లాలో 416 ప్రభుత్వ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా, 62 కేంద్రాల పరిధిలో వరిధాన్యం కొనుగోలు వందశాతం పూర్తి కాగా, వాటిని మూసి వెసినట్లు చెప్పారు. ఇంకా మిగిలి ఉన్న 50 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉందని వివరించారు. వారం, పది రోజుల్లో వందశాతం పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

‘మన బడి’ పనులు వేగవంతం చేయాలి

జిల్లాలో మన ఊరు - మన బడి పనులను వేగవంతం చేయాలని అధికారులను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. జిల్లాలో 343 పాఠశాలలు పునరుద్ధరణకు ఇప్పటివరకు 239 గ్రౌండింగ్‌ చేయడం పూర్తయ్యిందని సమీక్షలో అధికారులు మంత్రి హరీశ్‌రావు దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో పనులు ముమ్మరం చేయాలన్నారు. పెయింటింగ్‌ వర్క్‌ మిగిలిన పాఠశాలలను ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ శ్రీనివా్‌సరెడ్డి, డీఆర్డీవో గోపాల్‌రావు, జిల్లా సహకార అధికారి, ఇంజనీరింగ్‌ శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం పట్టణంలో బ్రాహ్మణ పరిషత్‌ సంక్షేమ, వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టల్‌ భవన నిర్మాణ పనులకు, ఎస్‌ఎంహెచ్‌ హాస్టల్‌లో తాగునీటి ట్యాంక్‌ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అంతకుముందు ఆయన క్యాంపు కార్యాలయంలో కార్మికులకు లేబర్‌ కార్డులను అందజేశారు. స్వచ్ఛ బడి, డంపుయార్డుపై విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ రాజనర్సు, సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T00:16:27+05:30 IST