అసైన్డ్‌ భూములు హాంఫట్‌

ABN , First Publish Date - 2022-09-28T05:30:00+05:30 IST

వెట్టిచాకిరి కార్మికులకు పంచిన భూములు దర్జాగా చేతులు మారుతున్నాయి. ఈ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ మరొకరికి విక్రయించడానికి వీల్లేకుండా నిబంధనలు ఉన్నాయి. ఒకవేళ ఎవరికైనా విక్రయించాలంటే కలెక్టర్‌ నుంచి ఎన్‌వోసీ తప్పనిసరి. కానీ నిబంధనలు పక్కనబెట్టి అసైన్డ్‌ భూములను ఓ వ్యక్తి కొనుగోలు చేయగా.. అన్నీ పరిశీలించాల్సిన తహసీల్దార్‌ అవేవీ లేకుండా దర్జాగా పట్టా చేయడం చర్చనీయాంశంగా మారింది.

అసైన్డ్‌ భూములు హాంఫట్‌

వెట్టిచాకిరి కార్మికులకు పంచిన స్థలం చేతులు మారిన వైనం

పట్టా చేసిన దుబ్బాక పాత తహసీల్దార్‌

సెక్షన్‌ 22ఏ రిజిస్టర్‌ బేఖాతరు 

చెల్లాపూర్‌లో ఐదెకరాల భూభాగోతం


వెట్టిచాకిరి కార్మికులకు పంచిన భూములు దర్జాగా చేతులు మారుతున్నాయి. ఈ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ మరొకరికి విక్రయించడానికి వీల్లేకుండా నిబంధనలు ఉన్నాయి. ఒకవేళ ఎవరికైనా విక్రయించాలంటే కలెక్టర్‌ నుంచి ఎన్‌వోసీ తప్పనిసరి. కానీ నిబంధనలు పక్కనబెట్టి అసైన్డ్‌ భూములను ఓ వ్యక్తి కొనుగోలు చేయగా.. అన్నీ పరిశీలించాల్సిన తహసీల్దార్‌ అవేవీ లేకుండా దర్జాగా పట్టా చేయడం చర్చనీయాంశంగా మారింది. 


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, సెప్టెంబరు 28 : దుబ్బాక మండలం చెల్లాపూర్‌కు చెందిన ఆరుగురికి 20 ఏళ్ల క్రితం అదే గ్రామంలోని 293/అ సర్వేనంబర్‌లో తలా ఒక ఎకరం చొప్పున ఆనాటి  ప్రభుత్వం పంపిణీ చేసింది. వాస్తవానికి ప్రభుత్వ భూమిని వారికి అసైన్డ్‌ చేయాల్సి ఉండగా.. అక్కడ ప్రభుత్వ భూమి లేకపోవడంతో భూమి కొనుగోలు పథకం కింద మరొకరి పట్టాభూమిని కొనుగోలు చేసి ఇచ్చింది. దీనిని ప్రభుత్వ పరిధిలోని భూమిగా పరిగణిస్తూ కీలకమైన ‘సెక్షన్‌ 22ఏ’ రిజిష్టర్‌లో నమోదు చేశారు. ఇందులో ఐదుగురు వ్యక్తుల వద్ద నుంచి దుబ్బాకకు చెందిన కిష్టమ్మగారి సుభాష్‌ అనే వ్యక్తి ఐదెకరాలను కొనుగోలు చేశాడు. నిబంధనల ప్రకారం ఈ భూమిని సుభాష్‌ పేరిట రిజిస్ర్టేషన్‌ చేయడానికి వీల్లేదు. కానీ  2021 డిసెంబరు 24వ తేదీన అప్పటి తహసీల్దార్‌ రాజేందర్‌రెడ్డి రిజిస్ర్టేషన్‌ చేశారు. 22ఏ రిజిష్టర్‌లో ఇది ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్‌ భూమిగా పేర్కొన్నప్పటికీ ఏ నిబంధన ప్రకారం రిజిస్ర్టేషన్‌ చేశారో అంతుబట్టకుండా ఉంది. ధరణి పోర్టల్‌ ద్వారా రిజిస్ర్టేషన్‌ చేయాల్సిన సమయంలో ఆయా భూముల సర్వే నంబర్‌ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సిన బాధ్యత తహసీల్దార్‌లకు ఉంది. అసైన్డ్‌, సీలింగ్‌, ప్రభుత్వ, వివాదాస్పద, నిషేధిత భూములు కావని నిర్ధారించుకున్నాకే రిజిస్ర్టేషన్‌ చేయాలి. కానీ ఇవేమి పట్టకుండా అడ్డదారిన రిజిస్ర్టేషన్‌ చేశారనే ఆరోపణలు మెండుగా వినిపిస్తున్నాయి.


ఆరు నెలల్లో మూడో వ్యక్తికి రిజిస్ట్రేషన్‌

వెట్టి కార్మికుల నుంచి ఐదెకరాల విలువైన భూములను కొనుగోలు చేసిన కిష్టమ్మగారి సుభాష్‌ ఈ ఏడాది మే 25వ తేదీన ఏల సుధాకర్‌ అనే మరో వ్యక్తికి ఆ భూములను విక్రయించారు. ఆరు నెలల వ్యవధిలోనే మూడో వ్యక్తికి రిజిస్ర్టేషన్‌ అయ్యిందంటే అతిశయోక్తి కాదు. భూముల విలువ పెరగడంతో స్వయంగా రెవెన్యూ అధికారులే సహకరించడంతో అసైన్డ్‌ భూమి కొనుగోళ్లలో భారీగా నగదు చేతులు మారింది. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాగా ఈ విషయంపై దుబ్బాక తహసీల్దార్‌ సలీమ్‌ను వివరణ కోరగా.. చెల్లాపూర్‌లో బాండెడ్‌ లేబర్లకు ఇచ్చిన అసైన్డ్‌ భూములను కిష్టమ్మగారి సుభాష్‌ పేరిట తాను రిజిస్ర్టేషన్‌ చేయలేదని చెప్పారు. గతంలో ఇక్కడ పనిచేసిన తహసీల్దార్‌ చేశారని వివరించారు. 


తహసీల్దార్ల పైసావసూల్‌

జిల్లాలో తహసీల్దార్‌ కార్యాలయాలు అవినీతికి కేరాఫ్‌ అడ్ర్‌సగా నిలుస్తున్నాయి. రిజిస్ర్టేషన్లలో అక్రమాలు వారానికి ఒక్కటైనా వెలుగులోకి వస్తుండడమే అందుకు నిదర్శనం. ఇప్పటికే లంచం తీసుకున్న ఘటనల్లో రాయపోల్‌, తొగుట తహసీల్దార్లు సస్పెండయ్యారు. సీలింగ్‌ భూములను పట్టా చేసిన మద్దూరు తహసీల్దార్‌కు నోటీసులు అందాయి. దళితులకు ఇచ్చిన భూములను రిజిస్ర్టేషన్‌ చేసిన ఘటన బెజ్జంకిలో చోటు చేసుకున్నది. తాజాగా వెట్టి కార్మికులకు పంచిన అసైన్డ్‌ భూములను సైతం ఇతరులకు రిజిస్ర్టేషన్‌ చేయడం మొదలైంది. వెలుగులోకి వచ్చిన ఘటనలే ఇలా ఉంటే గుట్టుగా జరుగుతున్న భాగోతాలు ఎన్నెన్నో ఉన్నాయి. Read more