నెరవేరని సొంతింటి కల

ABN , First Publish Date - 2022-10-15T04:58:22+05:30 IST

సదాశివపేటలో పేదల సొంతింటి కల.. కలగానే మిగులుతున్నది. కాంగ్రెస్‌ హయాంలో పంపిణీ చేసిన 5వేల ప్లాట్లను లాక్కున్న నేతలు అధికారంలోకి వచ్చాక ప్లేట్‌ ఫిరాయిస్తున్నారు. అందరికీ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇవ్వడం ఖాయమని చెప్పి పేదల ఓట్లను కొల్లగొట్టిన నేతలు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు

నెరవేరని సొంతింటి కల
సదాశివపేట పరిధిలో సిద్దాపూర్‌ శివారులో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల భవన సముదాయాలు

సదాశివపేటలో ఇళ్ల పంపిణీపై నాయకుల ‘డబుల్‌’ గేమ్‌

కాంగ్రెస్‌ హయాంలో ఇచ్చిన ప్లాట్లను గుంజుకున్న వైనం

ఇళ్ల పంపిణీలో కాలయాపన చేస్తున్న అధికారులు

స్థలం కోల్పోయి.. ఇళ్లు ఆలస్యమై ఆందోళనలో లబ్ధిదారులు


 సదాశివపేట, అక్టోబరు 11 : సదాశివపేటలో పేదల సొంతింటి కల.. కలగానే మిగులుతున్నది. కాంగ్రెస్‌ హయాంలో పంపిణీ చేసిన 5వేల ప్లాట్లను లాక్కున్న నేతలు అధికారంలోకి వచ్చాక ప్లేట్‌ ఫిరాయిస్తున్నారు. అందరికీ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇవ్వడం ఖాయమని చెప్పి పేదల ఓట్లను కొల్లగొట్టిన నేతలు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. నాయకుల ‘డబుల్‌’ గేమ్‌ వల్ల ఇళ్ల పంపిణీ ఆలస్యమవుతున్నది. నామమాత్రంగా నిర్మించిన 500 డబుల్‌బెడ్‌రూం ఇళ్లు పంపిణీకి నోచుకోక నిరుపయోగంగా శిథిలావస్థకు చేరుతున్నాయి. స్థలం కోల్పోయి, సొంతింటి కల నెరవేరక లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. 


 కాంగ్రెస్‌ హయాంలో..

 ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిరుపేదల ఇళ్ల స్థలాల కోసం సిద్దాపూర్‌ గ్రామపరిధిలో రైతుల నుంచి వ్యవసాయ భూములు 184.37 ఎకరాలను ప్రభుత్వంతో కొనుగోలు చేయించారు. 2012 అక్టోబరు 31న 5100 మంది లబ్ధిదారులకు 80 చదరపు గజాల చొప్పున స్థలాలను కేటాయిస్తూ పట్టాలను పంపిణీ చేశారు. తదనంతరం కొత్తగా వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వారికి పొజిషన్‌ చూపకుండానే వాటిని రద్దు చేసింది. పట్టణంలోని సిద్దాపూర్‌ శివారులో 2017 మేలో 500 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు అవసరమైన స్థలం కేటాయించి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. నాటి నుంచి నేటి వరకు కనీసం ఒక్క లబ్ధిదారుడికి కూడా స్థలం చూపలేదు, ఇల్లు కూడా నిర్మించి ఇవ్వలేదు. ఇళ్ల స్థలాల కోసం సీపీఐ, సీపీఎం పార్టీలు నిరుపేద ప్రజలతో కలిసి నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నాయి. ఏళ్ల తరబడి నిరీక్షించిన నిరుపేదలు విసుగెత్తి స్థలాల కబ్జాలు, ఆక్రమణకు పాల్పడ్డారు. ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకునేందుకు సిద్ధమైన పేదలపై, వారికి అండగా నిలిచిన నాయకులపై పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. అయితే 5,100 మంది నుంచి స్థలాలు లాక్కుని కేవలం 500 మందికే ఇళ్లు కట్టించి ఇస్తే సమస్య అవుతుందని భావించి కావాలనే ఆలస్యం చేస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఇక ప్రభుత్వం ఇవ్వాలి అనుకుంటే సదాశివపేటలోనే 10వేల మంది లబ్ధిదారులకు స్థలం కేటాయించే అవకాశం ఉంది. కానీ ఇల్లు నిర్మించి ఇస్తామే తప్ప స్థలాలను పంపిణీ చేసే పాలసీ లేదంటూ అధికార పార్టీ నేతలు కాలం వెళ్లదీస్తున్నారు.  రూ.లక్షల కోట్ల వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తిచేసిన ప్రభుత్వం 500 డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణాన్ని ఐదేళ్లయినా పూర్తి చేయలేకపోయింది. ఇప్పటికే నాలుగుసార్లు జిల్లా కలెక్టర్‌ సందర్శించి అధికారులతో సమీక్షించారు. సెప్టెంబరు నెలాఖరు వరకు పనులను పూర్తిచేయాలని కాంట్రాక్టర్లకు హుకుం జారీ చేసినప్పటికీ ఫలితం మాత్రం శూన్యం. 


అసాంఘిక కార్యాకలాపాలకు అడ్డాగా..  

 90 శాతం పనులు పూర్తయినా వాటి సౌకర్యాల కల్పనలో ఆలస్యమవుతున్నది. దీంతో ఆ నివాసాలు అసాంఘిక కార్యాకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. విలువైన వస్తువులు దొంగల పాలవుతున్నాయి. రాత్రివేళల్లో ఆకతాయిలు కిటికీలు, అద్దాలు, తలుపులను, పైపులను ధ్వంసం చేస్తున్నారు. ధ్వంసమైన వాటికి మళ్లీ మరమ్మతులు చేయకతప్పడం లేదు. ఈ సంవత్సరం దసరా వరకు అర్హులైన లబ్ధిదారులందరికీ ఇళ్లను అప్పగిస్తారని ఆశించినా వారిని నిరాశే ఎదురైంది. పట్టణంలో దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను పరిశీలన చేసినా నేటికీ పూర్తిస్థాయిలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తికాలేదు. నాయకులు, ఉన్నతాధికారులు స్పందించి తుది దశకు చేరుకున్న పనులను పూర్తిచేసి అర్హులైన లబ్ధిదారులకు దీపావళి వరకైనా అందజేయాలని ప్రజలు కోరుతున్నారు.  Read more