అమీన్‌పూర్‌ ఎంపీపీఅసైన్డ్‌ భూమి కబ్జా!

ABN , First Publish Date - 2022-07-06T05:27:23+05:30 IST

అమీన్‌పూర్‌ ఎంపీపీ, అధికార పార్టీ నాయకుడు ఈర్లదేవానంద్‌ బడుగుల తమ అసైన్డ్‌ భూమిని కబ్జా చేస్తున్నాడని బాధితులు ఆందోళనకు దిగారు.

అమీన్‌పూర్‌ ఎంపీపీఅసైన్డ్‌ భూమి కబ్జా!
కిష్టారెడ్డిపేటలోని అసైన్డ్‌ భూమిలో నిర్మాణాలు చేపడుతున్న దృశ్యం

అధికార పార్టీ అండతో అసైన్డ్‌ భూమిలో పాగా!!

ఫిర్యాదు చేసినా ఎంపీపీకే తహశీల్దార్‌ వత్తాసు

న్యాయం చేయాలని అధికారులకు బాధితురాలి విన్నపం


పటాన్‌చెరు,జూలై5: అమీన్‌పూర్‌ ఎంపీపీ, అధికార పార్టీ నాయకుడు ఈర్లదేవానంద్‌ బడుగుల తమ అసైన్డ్‌ భూమిని కబ్జా చేస్తున్నాడని బాధితులు ఆందోళనకు దిగారు. మండల పరిధిలోని కిష్టారెడ్డిపేటలోని సర్వేనంబర్‌ 194/4లో సుమారు 25గుంటల అసైన్డ్‌ భూమిలో ఎంపీపీ ఈర్లదేవానంద్‌ పాగావేయడం చర్చనీయాంశంగా మారింది. మంగళవారం అసైన్డ్‌దారుడి కుటుంబసభ్యులు సదరు భూమిలోనే ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో తమ గోడును వెళ్లబోసుకున్నారు.  సుమారు మూడు దశాబ్దాల క్రితం పటేల్‌గూడ గ్రామానికి చెందిన బండమీది కిష్టయ్య అనే వ్యక్తికి సర్వేనెంబర్‌ 194/4లో 25గుంటల భూమిని ప్రభుత్వం అసైన్డ్‌ చేసింది. ఇన్నాళ్లుగా కిష్టయ్య కుటుంబమే సదరు భూమిని సాగుచేసుకుంటూ వస్తున్నారు. కాలక్రమంలో కిష్టయ్యతో పాటు ఆయన ఇద్దరు కుమారులు మృతిచెందారు. కిష్టయ్యకు ఉన్న ఒక్కగానొక్క కుమార్తెకు చెం దాల్సిన ఆ అసైన్డ్‌ భూమిపై గ్రామానికి చెందిన కొందరి కన్ను పడింది. పటేల్‌గూడ గ్రామానికి చెందిన అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన అమీన్‌పూర్‌ మండలాధ్యక్షుడు ఈర్లదేవానంద్‌ తమ భూమిని స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తున్నాడని కిష్టయ్య కూతురు శమంత ఆందోళనకు దిగింది. తన తండ్రి నుంచి తనకు రావాల్సిన భూమిని దక్కకుండా అధికార పలుకుబడితో కుట్రలు చేస్తున్నాడని ఆమె ఆరోపించింది. పటేల్‌గూడలో భూముల ధరలు పెద్ద ఎత్తున పెరగడంతో ఎంపీపీ తన అధికారాన్ని ఉపయోగించి సదరు భూమిని ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారని తెలిపింది. అసైన్డ్‌ చట్టంప్రకారం భూములు అమ్మడం, కొనడం నిషేధమని తెలిసినా రూ.కోట్లు దండుకునేందుకు ఎత్తుగడ వేశారని ఆరోపించింది. అక్రమంగా తమ భూమిలో గదులు నిర్మిస్తూ, కంటైనర్‌ బాక్స్‌ తెచ్చి కబ్జా చేసే ప్రయత్నాలు చేస్తున్నారని తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసినా స్పందించకపోగా అతనికే వత్తాసు పలుకుతున్నారని ఆవేదన చెందింది. ఆ భూమిని తాము కొన్నామని దిక్కున్నచోట చెప్పుకోవాలని దౌర్జన్యం చేస్తున్నారని కుటుంబీకులు ఆరోపించారు. జిల్లా కలెక్టర్‌ చొరవ తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరారు. ఎంపీపీ దౌర్జన్యాలపై హైకోర్టు, మానవహక్కుల కమిషనర్‌, సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిని కలిసి తనకు జరుగుతున్న అన్యాయంపై ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఎంపీపీ దేవానంద్‌కు ఒత్తాసు పలుకుతున్న స్థానిక రెవెన్యూ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బాధితురాలికి న్యాయం జరిగే  వరకు అం డగా ఉంటామని కాంగ్రెస్‌ గ్రామ నాయకులు నందు, తదితరులు తెలిపారు.

Read more