జాతీయ అవార్డులకు అన్ని గ్రామపంచాయతీలు పోటీపడాలి

ABN , First Publish Date - 2022-09-09T05:18:44+05:30 IST

నేషనల్‌ పంచాయతీ అవార్డులకు జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలు పోటీలో పాల్గొనాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ అధికారులను ఆదేశించారు. గ్రామపంచాయతీల నుంచి దరఖాస్తు చేసుకోవడంపై మండలస్థాయి అధికారులకు గురువారం కలెక్టర్‌ కార్యాలయంలో గ్రామీణ అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

జాతీయ అవార్డులకు అన్ని గ్రామపంచాయతీలు పోటీపడాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌

దరఖాస్తు చేసుకునేలా అధికారులు చొరవ చూపాలి

అభివృద్ధి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి

పొరపాట్లకు తావులేకుండా పొందుపరచాలి

కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌


సిద్దిపేట అగ్రికల్చర్‌, సెప్టెంబరు 8: నేషనల్‌ పంచాయతీ అవార్డులకు జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలు పోటీలో పాల్గొనాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ అధికారులను ఆదేశించారు. గ్రామపంచాయతీల నుంచి దరఖాస్తు చేసుకోవడంపై మండలస్థాయి అధికారులకు గురువారం కలెక్టర్‌ కార్యాలయంలో గ్రామీణ అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలవుతూ అన్ని గ్రామపంచాయతీలు అభివృద్ధి పథంలో ముందున్నాయని ఆయన పేర్కొన్నారు. అవార్డులు, ప్రశంసలు సమర్థవంతంగా పనిచేయడానికి ఎంతో ప్రోత్సాహం అందిస్తాయని, జిల్లాలోని గ్రామ పంచాయతీలు అవార్డు పొందడానికి అర్హత కలిగి ఉన్నాయని తెలిపారు. అన్ని గ్రామపంచాయతీల నుంచి నేషనల్‌ పంచాయతీ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకునేలా అధికారులు చొరవ చూపాలని కలెక్టర్‌ ఆదేశించారు. గ్రామపంచాయతీల అభివృద్ధిలో పావర్టీ ఫ్రీ అండ్‌ లైవ్‌లీ హుడ్స్‌ పంచాయతీ, చైల్డ్‌ ఫ్రెండ్లీ పంచాయతీ, వాటర్‌ సఫిసియంట్‌ పంచాయతీ, క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ పంచాయతీ, సెల్ఫ్‌ సఫీసియంట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్‌ పంచాయతీ, సోషల్లీ సెక్యూర్డ్‌ పంచాయతీ, పంచాయత్‌ విత్‌ గుడ్‌ గవర్నెన్స్‌, ఉమెన్‌ ఫ్రెండ్లీ పంచాయతీ అంశాలను ప్రామాణికంగా తీసుకున్నారని వివరించారు. ఆయా అంశాల్లో రూపొందించిన ప్రశ్నలకు జిల్లాలోని గ్రామ పంచాయతీల వారీగా సాధించిన అభివృద్ధి వివరాలను సరైన పద్ధతిలో సమాధానాలను ఆన్‌లైన్‌లో పొందిపరిచి పంపించాలని సూచించారు. ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఎంఈవోలు, సీడీపీవోలు, మెడికల్‌ ఆఫీసర్స్‌, ఈజీఎస్‌ ఏపీవోలు, ఐకేపీ ఏపీఎంలు పొరపాట్లకు తావులేకుండా సంబంధిత అంశాలను క్లుప్తంగా పొందుపరచాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌, జిల్లా ట్రైనింగ్‌ కలెక్టర్‌ ఫైజాన్‌ అహ్మద్‌, డీఆర్డీవో గోపాల్‌రావు, జడ్పీ సీఈవో రమేష్‌, డీపీవో దేవకీదేవి, డీఎంహెచ్‌వో కాశీనాథ్‌, జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారి రాంగోపాల్‌రెడ్డి, ఎంపీడీవోలు, ఐకేపీ ఏపీఎంలు తదితరులు పాల్గొన్నారు.

Read more