విద్యార్థిని కొట్టిన లెక్చరర్లపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-03-17T05:08:32+05:30 IST

ఇంటర్‌ విద్యార్థిని లెక్చరర్లు అమానుషంగా కొట్టారని ఆరోపిస్తూ విద్యార్థి తల్లిదండ్రులతో పాటు బంధువులు ఆందోళనకు దిగారు.

విద్యార్థిని కొట్టిన లెక్చరర్లపై చర్యలు తీసుకోవాలి
లెక్చరర్లను నిలదీస్తున్న తల్లిదండ్రులు

తల్లిదండ్రుల ఆందోళన... కౌడిపల్లి మండలంలోని గురుకులంలో ఘటన

నర్సాపూర్‌, మార్చి 16: ఇంటర్‌ విద్యార్థిని లెక్చరర్లు అమానుషంగా కొట్టారని ఆరోపిస్తూ విద్యార్థి తల్లిదండ్రులతో పాటు బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన  కౌడిపల్లి మండలం తుంకి సమీపంలోని మహత్మా జ్యోతిరావుఫూలే గురుకుల విద్యాలయంలో బుధవారం చోటు చేసుకున్నది.  వివరాల్లోకి వెళ్తే.. తుంకి గురుకుల విద్యాలయంలో ఝరాసంగం మండలానికి చెందిన  చంద్రకాంత్‌ అనే విద్యార్థి ఇంటర్‌ ఫస్టియర్‌ ఎంపీసీ  చదువుతున్నాడు. మంగళవారం రాత్రి  లెక్చరర్లు చంద్రకాంత్‌ శరీరంపై వాతలు వచ్చేలా కొట్టారని తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో బుధవారం వారు గురుకులానికి వచ్చి ప్రిన్సిపాల్‌తో వాగ్వాదానికి దిగారు. తమ కుమారుడిని చితకబాదిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంజనేయులుగౌడ్‌, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్రఅధ్యక్షుడు శ్రీనివా్‌సగౌడ్‌ అక్కడకు చేరుకుని తల్లిదండ్రుల ఆందోళనకు మద్దతుగా నిలిచారు. కొట్టిన లెక్చరర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో కొందరు విద్యార్థులు మెదక్‌-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై కొద్దిసేపు ఆందోళనకు దిగారు. అదే సమయంలో ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణమాదిగ వచ్చి విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా నిలిచి ప్రిన్సిపాల్‌ను నిలదీశారు.  ఈ విషయమై ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌ స్పందిస్తూ సదరు విద్యార్థి తరచూ ఎలాంటి అనుమతి లేకుండా బయటకు వెళ్తూ సిగరెట్లు తెస్తుండటంతో మందలించారే తప్ప కొట్టలేదని వివరించారు.  


Updated Date - 2022-03-17T05:08:32+05:30 IST